ఉత్సాహంగా అమృత్‌ మహోత్సవ్‌

ABN , First Publish Date - 2022-08-07T06:33:48+05:30 IST

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు జిల్లాలో ఉత్సాహంగా జరుగుతున్నాయి.

ఉత్సాహంగా అమృత్‌ మహోత్సవ్‌
ఒంగోలులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న న్యాయమూర్తులు

జిల్లావ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమాలు

పలు ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు

13 నుంచి ప్రతి ఇంటిపై  త్రివర్ణ పతాకాల ఎగురవేత

14న ఒంగోలులో మూడు కిలోమీటర్ల జాతీయజెండా ప్రదర్శన

ఒంగోలు,ఆగస్టు 6 (ఆంఽధ్రజ్యోతి): 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు జిల్లాలో ఉత్సాహంగా జరుగుతున్నాయి.  శనివారం న్యాయసేవాధికార సంస్థ సూచనలకు అనుగుణంగా న్యాయాధి కారులు, ఉద్యోగులు ప్రత్యక్ష భాగస్వా మ్యంతో ర్యాలీలు జరిగాయి. ఒంగోలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శ్యాంబాబు ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జై జవాన్‌... జైకిసాన్‌ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ ప్రారంభించగా గాంధీజీ వేషధారణతో పాల్గొన్న అనంతపురం జిల్లాకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి గడిపూడి తిరుపతయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ఘర్‌ తిరంగా పేరుతో ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగురవేసేలా ప్రత్యేక కార్యక్రమానికి కేంద్రం పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 5.60లక్షల గృహాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 7లక్షల వరకూ ఉన్నట్లు అధికార వర్గాల అంచనా. అందులో కనీసం ఐదు లక్షల ఇళ్లపై జెండాలు ఎగురవేయించాలన్న ఆలోచనలో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం యూనిట్‌గా తీసుకొని సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికీ జాతీయజెండా, కర్రలు సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా 15వతేదీ ఒంగోలులోని పరేడ్‌ గ్రౌండ్‌తోపాటు జిల్లావ్యాప్తంగా భారీగా స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమ యంలో 14న ఒంగోలులో అద్దంకి బస్టాండు నుంచి దక్షిణ బైపాస్‌ వరకు మూడు కిలోమీటర్ల దూరం జాతీయ జెండా ప్రదర్శనకు కలెక్టర్‌  నిర్ణయించి తదనుగుణ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. 


Updated Date - 2022-08-07T06:33:48+05:30 IST