అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-02T10:10:58+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ఆమదాలవలస, రూరల్‌, ఆగస్టు1: రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.  మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు శనివారం  ఒన్‌వే జంక్షన్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ,  గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధితోపాటు పాలనాపరమైన ఆలోచనలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు.


రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ తప్పు చేస్తే ప్రస్తుతం అమరావతి రాజధాని రద్దు చేస్తూ బీజేపీ, వైసీపీలు అవే తప్పిదాలకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ దురాగతాలపై కేంద్రం జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షసపాలన సాగుతోందని, దీన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. తిరిగి ఆ పార్టీ నేతలు ప్రతిపక్షం చేస్తున్న సూచనలను తప్పుగా చిత్రీకరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటే పుట్టగతులుండవన్నారు. ఇప్పటికే కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా వాటిని పట్టించుకోకుండా దుందుడుకు చర్యలకు పాల్పడం ప్రభుత్వానికి తగదన్నారు.   కార్యక్రమంలో నాయకులు మొదలవలస రమేష్‌, తమ్మినేని విద్యాసాగర్‌, బోర గోవిందరావు, బొడ్డేపల్లి లక్ష్మణరావు, రాడ విజయ్‌కుమార్‌, అన్నెపు భాస్కర రావు, అన్నెపు ప్రసాదరావు, దవళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


మూడు ముక్కలాట సరికాదు 

ఎచ్చెర్ల, ఆగస్టు 1: మూడు ముక్కలాట  సరికాదని, నవ్యాంధ్రకు ప్రజా రాజధాని అమరావతి సరిపోతుందని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. ఎచ్చెర్లలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్‌ను అడ్డంగా పెట్టుకొని సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లులను పాస్‌ చేయించుకున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేసి, అమరావతిని హత్యచేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా, న్యాయస్థానాల ద్వారా ధర్మమే గెలుస్తుందని చెప్పారు.   కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ బీవీ రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గాలి వెంకటరెడ్డి, నేతలు వావిలపల్లి రామకృష్ణ, మెండ రాజారావు, బచ్చు కోటిరెడ్డి, గొంటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. 


‘మొండిపట్టుకు ఇది సమయం కాదు’

కవిటి: కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో మూడు రాజధానులపై అధికార పార్టీ మొండిపట్టుపట్టడం భావ్యం కాదని ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  సీఆర్‌డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల నిర్ణయానికి ఇది సమయం కాదని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి పరిపాలన సాగించడం తగదన్నారు.  దూరాలోచనతో ముందుకెళ్తే భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.


అమరావతి రైతులకు అండగా ఉంటాం

గుజరాతీపేట: అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం తెలిపారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాజధాని భూముల సేకరణ సమయంలో అప్పటి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు, రాయితీలను కల్పించే వరకూ బీజేపీ పోరాడుతుందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికే పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు.  

Updated Date - 2020-08-02T10:10:58+05:30 IST