అమరావతే ఏకైక రాజధాని!

ABN , First Publish Date - 2021-12-04T08:35:36+05:30 IST

అమరావతే ఏకైక రాజధాని!

అమరావతే ఏకైక రాజధాని!

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల వినతి

ప్రసంగం మధ్యలో అడ్డుతగిలిన వైసీపీ


న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీ పునర్విభజన చ ట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఏర్పాటైన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక ఆధారంగా మెజార్టీ ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే గుంటూరు-విజయవాడల మధ్యలో ఏపీ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని చెప్పారు. అయితే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక, అమరావతి రాజధానిని కాదని, కొత్తగా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. దీన్ని నిరసిస్తూ రైతులు 710రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నారని చెప్పారు. కాగా, ఈ దశలో వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు కనకమేడల ప్రసంగానికి అడ్డుతగులుతూ వ్యతిరేక నినాదాలు చేయడంతో కొద్ది సేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభాధ్యక్షత స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ సముదాయించడంతో పరిస్థితి చక్కబడింది. 

Updated Date - 2021-12-04T08:35:36+05:30 IST