నిన్నటి Tirupati సభలో అరుదైన సన్నివేశం ఏమిటంటే...!

ABN , First Publish Date - 2021-12-18T07:10:54+05:30 IST

నిన్నటి Tirupati సభలో అరుదైన సన్నివేశం ఏమిటంటే...!

నిన్నటి Tirupati సభలో అరుదైన సన్నివేశం ఏమిటంటే...!
అమరావతికి మద్దతుగా నినదిస్తున్న అఖిలపక్ష నేతలు

  • అందరినోటా ఒకే రాజధాని మాట అమరావతి గర్జన
  • తిరుపతి వేదికగా దశదిశలా
  • పిక్కటిల్లిన అమరావతీ నినాదం
  • హరిత వర్ణంతో పోటెత్తిన బహిరంగ సభ
  • కన్నీరు పెట్టుకున్న రాజధాని మహిళలు
  • సభికులను కదిలించిన రైతుల త్యాగాలు
  • నినాదాలతో సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆహూతులు
  • ఏకైక రాజధానికి జై కొట్టిన వైసీపీయేతర పార్టీలు
  • చంద్రబాబు రాకతో ఉర్రూతలూగిన జనం
  • ప్రత్యేక ఆకర్షణగా ఎంపీ రఘురామకృష్ణరాజు
  • సర్వమత ప్రార్ధనలతో సభను ప్రారంభించిన నిర్వాహకులు
  • హాజరైన శ్రీనివాసానంద సరస్వతి, బ్రదర్‌ సిరాజ్‌


హైకోర్టు అనుమతికీ సభ నిర్వహణకూ నడుమ ఒకే ఒక్కరోజు వ్యవధి.. అయినా, సంకల్పబలానికి సమయం సలాము చేసింది. పనులు పరుగులుపెట్టాయి. ఎస్వీయూ స్టేడియం లేదన్నా, ఖాళీబీడునే చదునుచేశారు. ఒక రాత్రీ ఒక పగలూ పనిచేశారు. తెల్లారేసరికి.. కుండపోత వానకు తిరుమలకొండమీద కనిపించిన జలపాతపాయల్లాగా జనం కదిలివచ్చారు. వేలాదిమంది సీమజనం పోటెత్తారు. అమరావతే మన రాజధాని అని నినదించారు. ఆకుపచ్చని పైగుడ్డలే పతాకాలుగా ఊపి ఆమోదం తెలిపారు. 45 రోజుల 450 కిలోమీటర్ల రైతుపాదయాత్రకు సీమ సంపూర్ణసంఘీభావం ప్రకటించింది. అధికారమెక్కిన తర్వాత మాటమార్చిన వైసీపీ తప్ప, సమస్త రాజకీయపార్టీలూ ఒకే గొంతు వినిపించాయి.  


తిరుపతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి వేదికగా అమరావతీ నినాదం దశదిశలా పిక్కటిల్లింది. బహిరంగసభకు అన్ని వైపుల నుంచీ జనం పోటెత్తారు. వైసీపీయేతర పార్టీలన్నీ అమరావతి ఏకైక రాజధానికి జైకొట్టాయి. రాఽజధానికి భూములిచ్చిన రైతులు తాము చేసిన త్యాగాలను, ఇపుడు ఎదుర్కొంటున్న వేధింపులను గద్గద స్వరంతో వివరించిన తీరు ప్రజలను కదిలించింది. అదే వారితో ఉద్యమానికి సంపూర్ణ మద్దతుగా నినాదాలు చేయించింది. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో టీడీపీ అధినేత చంద్రబాబు రాకకు జనం ఉర్రూతలూగింది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ హీరో శివాజీలు ప్రత్యేక ఆకర్షణగా మారారు. సర్వమత ప్రార్థనలతో సభను ప్రారంభించడం, సాధు పరిషత్‌ నేత శ్రీనివాసానంద సరస్వతి, బ్రదర్‌ సిరాజ్‌ రాక సభకు ఆధ్యాత్మిక పరిమళాలు అందించగా సీపీఐ నారాయణ ప్రసంగం నవ్వులు పూయించింది. వెరసి అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది.


అరుదైన సన్నివేశం

‘అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ సభకు వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి’. అని సినీనటుడు శివాజీ అనడంతో జేఏసీ నేత శివారెడ్డి జోక్యంచేసుకుని వైసీపీ ఎంపీ రఘురామ కృష్టరాజు ఉన్నారన్నారు. అందుకు శివాజీ స్పందిస్తూ ఆయనను రాజుగారిగానే గుర్తిస్తామని బదులివ్వడంతో సభలో నవ్వులు పూసాయి. ఒకరకంగా రాజకీయ పక్షాలన్నీ మద్దతు ప్రకటించడంతో పాటు పాల్గొన్న కార్యక్రమంగా ఈ మహోద్యమసభ సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు.


 సర్వమత ప్రార్థనలతో సభ ప్రారంభం

అమరావతి ప్రాముఖ్యాన్ని వివరించిన రైతు ఉద్యమ కారులు


అమరావతి పరిరక్షణ మహోద్యమ సభను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. ఈ ఉద్యమం మతాలకు అతీతం అని తెలియజేయడానికి ముందుగా.. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులను సభా వేదికపైకి ఆహ్వానించారు. వీరు.. గణేశుడిని,  అల్లాను, క్రీస్తును ప్రార్థించారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు పునాదులు వేయాలని.. అందుకు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. అలాగే వందేమాతరం గీతాన్ని ఆలపించి సభను కొనసాగించారు.


ఇది ఒక్క కులం, మతానికి చెందిన ఉద్యమం కాదు

సభ ప్రారంభమయ్యాక, తొలుత దళిత రైతుల జేఏసీ నాయకులకే మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ మహిళా కన్వీనర్‌ సువర్ణ కమల, కోటా అప్పారావు, ఆకుల ఉమామహేశ్వరావు, కంభంపాటి శిరీష, కళ్లం రాజశేఖర్‌రెడ్డి, మల్లీశ్వరి, పులి చిన్నా, జానీ, లక్ష్మి ప్రసంగించారు. వారి మాటల్లోనే.. ‘మీ భూములను త్యాగం చేస్తే.. రాష్ట్రంతోపాటు మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని గత ప్రభుత్వం చెప్పింది. దాంతో 29,800 కుటుంబాల రైతులం.. కన్నతల్లిలాంటి 34,300 ఎకరాల బంగారు భూములను ఇచ్చేశాం. ఈ భూముల్లో.. గత ప్రభుత్వ హయాంలో  రూ.9,500 కోట్లతో పలు భవనాలు నిర్మించారు. అలా నిర్మించిన భవనాల్లోనే ఇప్పటి ప్రభుత్వం కూడా పాలన సాగిస్తూ.. అమరావతిలో ఏ ఒక్క కట్టడం లేదని, అంతా గ్రాఫిక్స్‌ అని అనడం హాస్యాస్పదం. భవనాలు గ్రాఫిక్స్‌ అయితే.. వాటిల్లో ఉంటూ పరిపాలన సాగించే ప్రభుత్వాన్ని కూడా గ్రాఫిక్స్‌ పాలన అనాలేమో. రాష్ట్ర భవిష్యత్తు కోసం మా భూములు త్యాగం చేస్తే.. ఇప్పటి ప్రభుత్వం రాష్ర్టాన్ని ముక్కలు చేసేందుకు మూడు రాజధానుల ప్రస్తావనను లేవనెత్తి సరిగ్గా ఇప్పటికి 731 రోజులవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తున్న మాపై అడుగడుగునా రాళ్ల వర్షం తప్పదని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరి నుంచి కూడా వ్యతిరేక భావన కనిపించలేదు. రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ముందుకు తీసుకొచ్చి.. రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశానికి వెన్నెముక వంటి రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. 80 కేసులు పెట్టి, 18 రోజులు జైళ్లలో కూర్చోబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలాంటి ప్రభుత్వ విధానాల వల్ల ఇంట్లో కుటుంబ బాధ్యతలు తప్ప లోకం తెలియని మహిళలు రోడ్డుపైకి వచ్చి పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది’ అని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 


అమరావతి పరిరక్షణ సమితికి రూ.2,15,000 విరాళం

అమరావతి పరిరక్షణ సమితికి గుడిపాల మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు రూ.2,15,000 విరాళం అందజేశారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన మహాసభలో మాజీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చెక్‌ అందించారు. ఉపాఽధ్యక్షుడు అనిల్‌కుమార్‌, అధికార ప్రతినిధి గోళ్ల హేమాద్రి నాయుడు, శంకర్‌, సుబ్రమణ్యం యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


అమరావతి రైతుల సభకు పటిష్ఠ బందోబస్తు

తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి రైతుల సభకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు కల్పించారు. డీఎస్పీలు మురళీకృష్ణ (ఈస్ట్‌), నరసప్ప (వెస్ట్‌), కాటమరాజు (ట్రాఫిక్‌), కొండయ్య (కమాండ్‌ కంట్రోల్‌) ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరానికి వెలుపల, జాతీయ రహదారికి పక్కనే సభాస్థలి ఉండటం వల్ల ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన పరిస్థితులు కూడా తలెత్తలేదు. సభ నిర్వాహకులు వాహనాల పార్కింగ్‌కు పక్కా ఏర్పాట్లు చేసినా, కొందరు వాహనదారులు జాతీయ రహదారికి ఇరువైపులా నిలపడంతో ట్రాఫిక్‌కు కొద్దిపాటి ఇబ్బంది కల్గింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, ట్రాఫిక్‌ స్తంభించకుండా చర్యలు చేపట్టారు. హైవేపై రెండు మార్గాల్లోనూ రాకపోకలను అనుమతించారు. మాజీ సీఎం చంద్రబాబు సభాస్థలికి వచ్చాక ఓవైపు మాత్రమే ట్రాఫిక్‌ను అనుమతించారు. సభ ముగిసిన తర్వాత కొంతసేపు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు సర్దుబాటు చేసినా, కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు. కాగా.. తిరుపతి అర్బన్‌ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు బయటి నుంచి సభకు వచ్చే వాహనాలను ఆపి, వారి వివరాలను నమోదుచేసుకుని పంపించినట్టు కొందరు రైతులు తెలిపారు. ప్రధానంగా.. రంగంపేట, రామానుజపల్లె, ఆంజనేయపురం వద్ద పోలీసులు వాహనాలను అడ్డగించినట్టు సమాచారం. తిరుపతిలో ఇటువంటి పరిస్థితులు కనిపించలేదు. 


సభ నిర్వాహకులపై కేసు నమోదు..

అమరావతి రైతుల మహోద్యమ సభ నిర్వాహకులపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదుచేశారు. తిరుచానూరు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని కోరుతూ దామినేడు వద్ద శుక్రవారం అమరావతి రైతులు భారీ సభను నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతులు, అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. అయితే సభకు హాజరైన ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుమికూడి, మాస్కులు కూడా ధరించకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘించారు. దీనికి కారణమైన సభ నిర్వాహకులపై కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన కింద సెక్షన్‌ 188, 269, 271 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. 



Updated Date - 2021-12-18T07:10:54+05:30 IST