అమ్మకానికి అమరావతి!

ABN , First Publish Date - 2021-12-31T07:15:32+05:30 IST

అమ్మకానికి అమరావతి!

అమ్మకానికి అమరావతి!

ముందు భూములు.. తర్వాత భవనాలు

అభివృద్ధి పేరిట సర్కారు వారి ‘ప్రణాళిక’

బ్యాంకుల నుంచి రూ.2995 కోట్లు అప్పు

తిరిగి చెల్లించేందుకు భూముల అమ్మకం

7 శాతం వడ్డీ అయితే 481 ఎకరాలు

8 శాతం వడ్డీ అయితే 504 ఎకరాలు 

16 ఏళ్లపాటు అమ్ముతూనే ఉంటాం

ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వం

అప్పుల కోసమే 3 రాజధానుల బిల్లు వెనక్కి?


అసలు అమరావతిని పక్కనపెట్టి?

అమరావతి ‘సెల్ఫ్‌ ఫైనాన్స్‌’ ప్రాజెక్టు. అంటే... నగరాభివృద్ధికి అవసరమైన నిధులను అమరావతి నుంచే రాబట్టేలా దీనిని రూపొందించారు. రైతుల నుంచి సమీకరించిన భూములతోపాటు ప్రభుత్వ భూములు దాదాపు 50 వేల ఎకరాలను అమరావతికి కేటాయించారు. అన్ని అవసరాలకుపోగా మిగిలిన భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు. దీని ద్వారా సీడ్‌ క్యాపిటల్‌తోపాటు నవ నగరాలను నిర్మించాలన్న బృహత్‌ ప్రణాళికతో ‘అమరావతి’ మొదలైంది. కానీ... ఈ మొత్తం ప్రణాళికను సర్కారు అటకెక్కించింది. ఇప్పుడు... కొత్తగా ‘అభివృద్ధి’ పేరిట అమరావతి భూముల అమ్మకానికి తెరలేపుతోంది.


ఏఎంఆర్డీఏ ఎక్కడుందని?

‘మూడు’ ముక్కలాట మొదలెట్టిన ప్రభుత్వం... సీఆర్డీయేను రద్దు చేసింది. దాని స్థానంలో ఏఎంఆర్డీఏను తెచ్చింది. నవంబరులో 3 రాజధానులతోపాటు, సీఆర్డీయే రద్దు చట్టాన్నీ వెనక్కి తీసుకుంది. అంటే ప్రస్తుతం ఏఎంఆర్డీఏ ఉనికిలోనే లేదు. కానీ అమరావతి పేరిట అప్పులు తెచ్చి, భూములమ్మేందుకు రూపొందించిన నివేదికంతా ‘ఏఎంఆర్డీఏ’ పేరిటే రూపొందింది. 62 పేజీలున్న ఆ నివేదికపై డిసెంబరు 9న సీఆర్డీయే అధికారులు సంతకాలు చేశారు. ఇందులో ‘బారోయర్‌’గా (అప్పు తెచ్చే ది) ఏఎంఆర్డీఏనే చూపించారు. ఏఎంఆర్డీఏనే లేనప్పుడు దానితో అప్పెలా తెస్తారు?


తప్పుడు లెక్కలు..

తెలుగుదేశం హయాంలోనే అమరావతి పరిధిలో 350 కిలోమీటర్ల పొడవునా రోడ్లు నిర్మించారు. ఇప్పుడు... చేస్తామంటున్న అభివృద్ధిలో భాగంగా 70 కిలోమీటర్ల రహదారులు వేస్తామంటున్నారు. నిజానికి... అవి అంతకుముందే వేసిన 350 కిలోమీటర్లలో భాగమే!

తాజా ‘అభివృద్ధి ప్రాజెక్టు’లో ప్రభుత్వ వాటా (ఈక్విటీ) రూ.700 కోట్లు. అంటే... ఈ మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా చెల్లించాలి. కానీ... ఇప్పటికే అక్కడ వేసిన రహదారుల విలువనే ఈక్విటీగా చూపించేస్తున్నారు. వెరసి... ‘ఎడారి’లో ఆ మేరకైనా పనులు జరిగాయని అంగీకరించారన్న మాట. నిజానికి... అమరావతిలో టీడీపీ హయాంలో రూ.20వేల కోట్ల విలువైన పనులు జరిగాయి.

ముఖ్యమంత్రి జగన్‌ ఆగస్టులో అమరావతిపై సమీక్షించారు. అక్కడ ప్రాధాన్యం ప్రకారం చేయాల్సిన పనుల విలువను రూ.11వేల కోట్లుగా గుర్తించారు. ఇప్పుడు... 3వేల కోట్ల రుణానికి వెళుతున్నారు. దీనికే 504 ఎకరాలు అమ్ముతారు. 11వేల కోట్లు కావాలంటే 14వేల ఎకరాలు విక్రయించాలి.


అప్పట్లో చంద్రబాబు అడిగారు! రాజధాని రైతులు స్పందించి భూములు అప్పగించారు! చివరాఖరికి... అదేదో సామెత చెప్పినట్లు, వాటిని జగన్‌ మెల్లమెల్లగా అమ్మి సొమ్ము చేసుకుంటారట! ఆ సొమ్ముతో... ఎప్పుడో అటకెక్కించిన అమరావతిని అభివృద్ధి చేస్తారట! ముందుగా అప్పులు తెచ్చి... ఆ తర్వాత మెల్లమెల్లగా భూములు అమ్ముతూ పోతారట! ఇది నిజంగా నిజం! దీనిపై ‘అమరావతి మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ’ (ఏఎంఆర్డీఏ) ఒక సవివరమైన నివేదికను కూడా సిద్ధం చేసింది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకటి వద్దన్నారు. రెండు చాలవన్నారు. ఏకంగా ‘మూడు’ రాజధానుల పేరు చెప్పారు. కానీ... ఏదీ ముందుకు కదల్లేదు. చివరికి... ‘సాంకేతిక’ కారణాల పేరిట ఆ మూడు రాజధానుల చట్టాన్నీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు... ఎడారి, శ్మశానం అంటూ తిట్టిపోసిన అమరావతి భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ‘తప్పేముంది! అమరావతి ప్రణాళిక భూములు అమ్మి అభివృద్ధి చేయడమే కదా!’ అనుకుంటున్నారా? అయితే... తప్పులో కాలేసినట్లే! అప్పుడు చంద్రబాబు సర్కారు రూపొందించిన ప్రణాళిక వేరు! ఇప్పుడు... అమరావతిలో భూములు అమ్మేందుకు జగన్‌ సర్కారు సిద్ధం చేసిన ‘స్కీమ్‌’ వేరు!


సొమ్ముల కోసమేనా...

‘మూడు’ పేరిట హడావుడి చేసిన జగన్‌ సర్కారు... నవంబరు నెలలో ఉన్నట్టుండి ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ‘సాంకేతిక కారణాలవల్లే వెనక్కి తీసుకున్నాం. మళ్లీ పక్కాగా బిల్లులు తీసుకొస్తాం. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం’ అని కబుర్లు చెప్పింది. హైకోర్టులో చుక్కెదురు కాకముందే... సర్కారు ఇలా ముందుజాగ్రత్త పడిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే... దీనివెనుక ఉన్న అసలు కథ వేరని ఇప్పుడు తెలుస్తోంది. ఎక్కడెక్కడ భూములున్నాయి, వాటిని ఎలా అమ్మాలి? అని తొలినుంచీ ఆలోచిస్తున్న ప్రభుత్వం... ఇప్పుడు అమరావతి భూముల అమ్మకంపై కన్నేసి, వాటిని అమ్మేందుకే ‘మూడు’పై వెనక్కి తగ్గినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అప్పుల కోసం, అమరావతి భూములను, అక్కడి భవనాలను అమ్మడం కోసమే ఈ పని చేసినట్లు స్పష్టమవుతోంది. అమరావతిలో ట్రంక్‌ ఇన్‌ఫ్రా, ఎల్‌పీఎస్‌ (భూసమీకరణ రైతులకు కేటాయించిన ప్లాట్లు) లేఔట్ల అభివృద్ధి పేరుతో అప్పులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం బ్యాంకుల నుంచి రూ.2995 కోట్లు రుణం సేకరిస్తామని నివేదికలో తెలిపింది. అలా తెచ్చిన అప్పును అమరావతిలో ఉన్న భూములను సంవత్సరానికి కొన్ని ఎకరాల చొప్పున అమ్మేసి తీరుస్తామని ప్రభుత్వం పేర్కొంది. 


ఇంతకీ ఏం చేస్తారట?

‘అప్పు చేసి, భూములు అమ్మి అమరావతిలో అభివృద్ధి చేస్తాం’ అని నివేదికలో పేర్కొన్న పనులేవీ కొత్తవి కాదు. ఇవన్నీ గత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయినవే. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.2995 కోట్ల అప్పు తెచ్చి, పైపై మెరుగులు దిద్ది, మిగిలిన డబ్బులు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. రూ.2995 కోట్లు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించే మార్గమేదీ లేదు. అప్పిచ్చే బ్యాంకుకు ఏదో ఒక ఆదాయ వనరు చూపించాలి. అందుకే అమరావతి భూములపై కన్నేశారు. ‘‘ప్రతిఏటా అమరావతిలోని భూములను అమ్ముతాం. ఆ డబ్బులతో అప్పు చెల్లిస్తాం. వడ్డీ 7 శాతమైతే 481 ఎకరాలు, 8 శాతమైతే 504 ఎకరాలు అమ్ముతాం’’ అని నివేదికలో తెలిపారు. రుణం కాలపరిమితిని 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఇందులో... రెండేళ్లు మారటోరియం. అంటే, మొదటి రెండేళ్లు అసలు, వడ్డీ కట్టక్కర్లేదు. మూడో సంవత్సరం నుంచి 18వ సంవత్సరం వరకు అసలు, వడ్డీ కట్టాలి. ఇందుకోసం ప్రతి సంవత్సరం అ మరావతిలోని కొన్ని ఎకరాల భూమి అమ్ముతూ ఉంటారు. కమర్షియల్‌ మానెటైజేషన్‌ కోసం అమరావతిలోని 5220 ఎకరాలు వాడుకుంటామని నివేదికలో పేర్కొన్నారు.


ప్రజల ఆస్తులను అమ్మేయడమే లక్ష్యం

జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్ర సంపదైన ప్రభుత్వ భూములను అమ్మేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరుతో భూములు అమ్మేందుకు జాబితా కూడా సిద్ధం చేసింది. ఈ దూకుడుకు కోర్టు బ్రేకులు వేసింది. నీతి ఆయోగ్‌ కూడా ఇలా అమ్మకం కుదరదని చెప్పింది. దీంతో... సర్కారు రూటు మార్చింది. అప్పుల కోసం విశాఖలోని కలెక్టరు కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయాలు, ప్రభుత్వ కాలేజీలు, వందల ఎకరాల ప్రభుత్వ భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు జెన్‌కో, పవర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లపైనా  సర్కారు కన్ను పడింది. ఆ రెండు సంస్థలను అప్పుల్లోకి నెట్టి... పవర్‌ ప్లాంట్లను విక్రయించే పథకం రచించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు... వేల ఎకరాల భూమి, భారీ భవనాలున్న అమరావతిని  కూడా ‘సేల్‌’కు పెట్టేశారు.


ట్రంక్‌ ఇన్‌ఫ్రా - ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా

ట్రంక్‌ ఇన్‌ఫ్రా కింద అమరావతిలో ఉత్తరం, దక్షిణం రోడ్లు నిర్మిస్తామని నివేదికలో పేర్కొన్నారు. 70.11 కిలోమీటర్ల పొడవునా రోడ్లు, 15 కెనాల్‌ బ్రిడ్జిలు, 73 కిలోమీటర్ల మేర స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌, కృష్ణా నది మీద హైలెవల్‌ బ్రిడ్జి, నీటి సరఫరా నెటవర్క్‌, వరద ఉపశమన చర్యల పనులు చేపడతామని ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా కింద రోడ్లు, విద్యుత్‌ నెట్‌వర్క్‌ పనులు చేపడతామని పేర్కొంది. అసలు విషయం ఏమిటంటే... ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటున్న పనులు చంద్రబాబు హయాంలోనే దాదాపు పూర్తయ్యాయని కొందరు అధికారులు చెబుతున్నారు. కొన్ని పనులనేమో జగన్‌ ప్రభుత్వమే అటకెక్కించింది. ఇక... అమరావతి పరిధిలో రోడ్లను అడ్డదిడ్డంగా తవ్వేస్తున్నా కనీస చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు కొత్త రోడ్లు  వేస్తామంటోంది.

Updated Date - 2021-12-31T07:15:32+05:30 IST