అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అక్కర్లేదు!

ABN , First Publish Date - 2022-01-03T08:37:54+05:30 IST

అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అక్కర్లేదు!

అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అక్కర్లేదు!

ముఖ్యమంత్రి జగన్‌వి అవాస్తవాలు

రూ.పది వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తే చాలు

భూములను అభివృద్ధి చేసి విక్రయిస్తే ఆ డబ్బుతోనే అభివృద్ధి చేయొచ్చు

భూములిచ్చిన వారిలో రెడ్లే ఎక్కువ.. ఒక వర్గానికే చెందినదనడం దుష్ప్రచారం

ప్రజలను ప్రభుత్వం భయపెడుతోంది.. సంక్షేమంతో పేదలను కట్టడి చేసింది

రేపు జగన్‌ పదవీచ్యుతుడైతే అది అమరావతి ఉద్యమంతోనే!

ఒకవేళ మళ్లీ వస్తే అభివృద్ధి చేయడేమో కానీ రాజధానిని మాత్రం మార్చలేరు

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతల స్పష్టీకరణ


రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కావాలని సీఎం జగన్‌ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు. కేవలం రూ.10 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తే.. ఆనక భూములు విక్రయంతో అధికాదాయం ఆర్జించి.. అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్ఘాటిస్తున్నారు. ఇకపై 175 నియోజకవర్గాల్లోనూ జేఏసీలు పెడతామన్నారు. తమ ఉద్యమంతోనే జగన్‌ పదవీచ్యుతుడవుతారని వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో జేఏసీ నేతలు కె.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, అమరావతి రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు పువ్వాడ సుధాకర్‌, మహిళా జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజ పాల్గొన్నారు.


45 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేశారు కదా.. కాళ్ల వాపులు తగ్గాయా?

అసలు కాళ్ల వాపులే అనిపించలేదు. మొదటి రెండు రోజులు కొంచెం అనిపించినా తర్వాత జనాన్ని చూస్తుంటే నొప్పులనిపించలేదు.


నాయకుల పాదయాత్రలో కాళ్లకు బొబ్బలు వచ్చినట్లు చూస్తుంటాం కదా!

మాకు అలాంటిదేమీ లేదు. 60, 70 ఏళ్లు ఉన్న మహిళలు కూడా నడిచారు. వారికి తొలినాళ్లలో బొబ్బలు వస్తే.. విశ్రాంతి తీసుకోవాలని కోరినా చివరి వరకూ నడిచారు. 


శివారెడ్డిగారూ.. మీ నేపథ్యం ఏమిటి?

నేను బిల్డర్‌నండీ. మాది వ్యవసాయ కుటుంబమే. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం నా సొంతూరు. విజయవాడలో సెటిలయ్యాం. 35 ఏళ్ల నుంచి నిర్మాణ రంగంలో ఉన్నాం. గత ప్రభుత్వంలో టిడ్కో సభ్యుడిగా నియమించారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో సింగపూర్‌ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. దాంతో అమరావతితో ఒక అనుబంధం ఏర్పడింది. ననా ఎన్‌ఆర్‌ఐ మిత్రులకు చెప్పి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని సూచించాను. దాంతో చాలామంది భూములు కొన్నారు. 


వారంతా మిమ్మల్ని తిడుతున్నారా?

శివారెడ్డి: తిట్టడం కాదు.. ఎప్పటికైనా అమరావతి రాజధానిగా ఏర్పడుతుందని ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రెండున్నరేళ్లుగా దీనిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 


మీరు అమరావతికి ఎంత భూమిచ్చారు? 

శివారెడ్డి: ఆరెకరాలు ఇచ్చాం. 


మాస్టర్‌ ప్లాన్‌లో మీకున్న అనుబంధంతో జేఏసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారా?

అదేం కాదు. మాస్టర్‌ ప్లాన్‌పై పని చేసినప్పుడు ఒక అవగాహన వచ్చింది. ఇది మొత్తం 216 చదరపు కిలోమీటర్లు. నార్త్‌, సౌత్‌ డైరెక్షన్‌లో 18 కిలోమీటర్లు ఉంటే.. ఈస్ట్‌, వెస్ట్‌ దిశగా  12 కిలోమీటర్లు ఉంటుంది. చదరపు కిలోమీటరుకు 250 ఎకరాలు వేసుకున్నా.. 50 వేల ఎకరాలు. ఇదంతా ప్రభుత్వ, అసైన్డ్‌ భూమి.. రైతులు ఇచ్చినవే. ఇందులో 48 శాతం భూమి మౌలిక వసతుల కోసమే. ఈ ప్రణాళిక చాలా అద్భుతం. 2050కి ఈ మాస్టర్‌ ప్లాన్‌ పూర్తవుతుంది. అప్పటికి 50 లక్షల మంది ఇక్కడ నివసించే అవకాశం ఉండేలా రూపొందించిన ప్రణాళిక. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఇంత భారీ ప్రణాళికతో రూపొందాల్సిన నగరాన్ని విధ్వంసం చేసే ఆలోచన మొదలు కావడంతో.. అడ్డుకోవాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని అమరావతిని నిలబెట్టేందుకు నడుం కట్టాలని భావించా. దాదాపు 15 సంస్థలు, సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేశాం. అందరూ నన్ను చైర్మన్‌గా ఉండాలని కోరడంతో ఈ బాధ్యతలు చేపట్టాను. 


మీకు మీ వర్గం నుంచి అవరోధాలు ఎదురుకాలేదా? కులంలో చెడబుట్టావని ఎవరూ తిట్టలేదా?

శివారెడ్డి: ఎవరూ తిట్టలేదు. పైగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే పోరాటంలో భాగం అవుతున్నారంటూ నా వర్గానికి చెందిన వాళ్లు ఎందరో అభినందించారు. 


రాష్ట్ర ఆదాయాన్ని తెచ్చి ఈ 29 గ్రామాలకు ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రం ఏమై పోవాలని చెబుతున్నారు కదా!

శివారెడ్డి: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటూ కూడా సీఎం మాట్లాడుతూ లక్ష కోట్ల అంశాన్ని ప్రస్తావించారు. ఇది పూర్తయ్యేసరికి ఏడెనిమిది లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే ఏడెనిమిదేళ్లలో 40 లక్షల కోట్ల భారం ప్రజలపై పెట్టి పోతున్నానని చెప్పకనే చెప్పారు. మేం సీఆర్‌డీఏ చట్టం పూర్తిగా చదివాం. దాని ప్రకారం ఏ ప్రభుత్వమూ లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. తాత్కాలికంగా పది వేల కోట్లు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించి ఇస్తే చాలు. ఇక సీఆర్‌డీఏలో 80.5 శాతం నివాస భూమి రైతులది. 60 శాతానికిపైగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూమి రైతులది. ఇక్కడి భూములను అభివృద్ధి చేసి విక్రయించుకుని ఆ డబ్బుతోనే అభివృద్ధి చేయవచ్చు.


మీరు డాక్టర్‌ కదా.. ఈ ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు?

రాయపాటి శైలజ: 2014 వరకూ మేం చెన్నైలో ఉండేవాళ్లం. సమైక్య ఉద్యమం జరిగే సమయంలో మేం నేరుగా వచ్చి ఏమీ చేయలేకపోయామనే బాధ ఉండేది. రాష్ట్రం విడిపోయాక అమరావతి రూపంలో ఒక కొత్త ఆశ చిగురించింది. అదే సమయంలో వ్యక్తిగత కారణాలతో గుంటూరుకు వచ్చేశాం. ఆ ఐదేళ్లలో జరిగిన కార్యక్రమాలు చూసిన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయినా అమరావతి రూపంలో ఒక ఆశ అందరికీ ఏర్పడింది. అందరి భవిష్యత్‌ బాగుంటుందని అనుకునే తరుణంలో 2019లో ఈ ప్రభుత్వ నిర్ణయంతో అంతా తారుమారైంది. మహిళలు బస్సు యాత్ర నిర్వహించాలని అనుకున్నప్పుడు వారిని విజయవాడలో అడ్డుకున్నారు. అది టీవీలో చూసిన నేను అప్పటికప్పుడు గుంటూరులో ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్లాను. అక్కడ ఉన్న అందరిలో నేనొక్కదానినే మహిళను. అలా ఉద్యమంలో భాగమైపోయాను. 


మీ కట్టు..బొట్టుపైనా కామెంట్లు చేశారు కదా?

శైలజ: బాధ అనిపించింది. సోషల్‌ మీడియాలో నా వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటకు లాగారు. ఆడపిల్లలపై విమర్శలు చేయడం సులువు. వారికి మా గురించి ఏం దొరకనప్పుడు మా వ్యక్తిత్వాలపై దాడి చేస్తారు. తొలి రోజుల్లో అన్నిటికీ స్పందించేదానిని. ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. 


సుధాకర్‌ గారూ.. మీరు ఆడిటర్‌. మీరెలా వచ్చారు ఉద్యమంలోకి?

సుధాకర్‌: మాది తుళ్లూరు. నేనూ రైతు బిడ్డనే. జరీబు భూములు కాబట్టి తొలి నాళ్లలో ల్యాండ్‌ పూలింగ్‌కు భూములివ్వడానికి ముందుకు రాలేదు. అమరావతి ప్రణాళికను అధ్యయనం చేసిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలను మార్చేసే ప్రాజెక్టు అని అందరికీ అర్థమయ్యేలే ప్రతి ఊరిలో సమావేశాలు పెట్టాం. జనం అడిగిన అన్ని ప్రశ్నలకు వారికి అర్థమయ్యేలా చెబుతూ అందరినీ సిద్ధం చేశాం. మా తుళ్లూరు మండలంలో 340 ఎకరాలు మినహా మొత్తం ల్యాండ్‌ ఫూలింగ్‌కు ఇచ్చేలా కృషి చేశాం. 


వారు ఎందుకు ఇవ్వలేదు?

వాళ్లు కూడా రోడ్లు తీసుకోండి.. భూమి మాత్రం మాకే ఉండాలన్నారు. వారితో కూడా పోరాడాం. ఎందరో త్యాగం చేస్తేనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వంటివి వచ్చాయని వివరించాం. భారతదేశ చరిత్రలో, ఆదాయ పన్ను చరిత్రలోనే ఈ ల్యాండ్‌ పూలింగ్‌కు వచ్చిన పన్ను మినహాయింపే మొదటిది. ఈ రోజు నిజమైన అమరావతి ఉంటే రైతులకు 30-40 వేల కోట్ల రూపాయల ప్రయోజనం వచ్చేది. 


మీరెంత భూమి ఇచ్చారు?

సుధాకర్‌: ఆరెకరాలు. ఈ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కేసులు నాపైనే ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులూ ఉన్నాయి. 


పూలింగ్‌కు ఇవ్వకముందు మీ ప్రాంతంలో భూములు ధరలు ఎంత ఉండేవి?

సుధాకర్‌: మాది మెట్ట భూమి కాబట్టి ఎకరా ఐదారు లక్షలు ఉండేది. 2002 నుంచి కాలువ వచ్చి రెండు పంటలు పండడం మొదలైంది. దాంతో భూమి ధర పాతిక లక్షల వరకూ వచ్చింది. వెంకటపాలెం వద్ద జాతీయ రహదారి ప్రకటించారు. దాంతో అక్కడ మూడు కోట్ల ధర ఉంది. 


పూలింగ్‌కు నిరాకరించినవారు బాధపడుతున్నారా?

సుధాకర్‌: ఆ రోజున రాజధానికి వ్యతిరేకంగా కేసులు వేసిన వాళ్ల బాధ వర్ణనాతీతం. బయటకొచ్చి ఉద్యమంలో తిరగాంటే మీరే కదా చెడగొట్టారని అంటారు. దాంతో వారు కూడా బాగా కుమిలిపోతున్నారు. 


మీ నలుగురికి వ్యాపారపరంగా బాగానే నష్టం జరిగి ఉంటుంది కదా?

తిరుమలరావు: బాగా జరిగింది. గత ప్రభుత్వం అమరావతి ప్రకటించిన తర్వాత అక్కడకు అందరూ తరలివచ్చారు. నిర్మాణ సంస్థలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు ఇలా అన్నీ తరలివచ్చాయి. ఇప్పుడవన్నీ నష్టపోయాయి. 


ఈ ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేయడంలో, ఇతరులను కన్విన్స్‌ చేయడంలో విఫలమయ్యారు కదా?

తిరుపతిరావు: మా పాదయాత్రలో చేసింది ఇదే. రాష్ట్రానికి జరిగే నష్టం అందరికీ తెలుసు. ప్రజలను ప్రభుత్వం భయపెడుతోంది. ఆ భయానికి స్వార్థం తోడు కావడంతో ఎవరూ బయటకు రావడం లేదు. పేదలను సంక్షేమ పథకాలు ప్రయోగించి ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక వ్యాపారులు మాకెందుకులే అని ఊరుకుంటున్నారు. 


తెలంగాణ ఉద్యమంలో అక్కడి పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకూ నినదించారు కదా?

శివారెడ్డి: అవునండీ.. వంద శాతం నిజం. ఆ రోజు మా భూములను త్యాగం చేసింది ఈ రాష్ట్రం కోసం. సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ భూములు రాష్ట్ర ప్రజలందరివీ.  29 గ్రామాల ప్రజలది కాదు. 


సుధాకర్‌: అమరావతి ఉపయోగాలు ఏమిటి? అమరావతి వల్ల ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా జరుగుతుంది.. దానికి అమరావతి నుంచి నిధులు ఎలా వస్తాయని చెప్పడంలో కొంత వైఫల్యం ఉంది. 



పూర్తి వైఫల్యం చెందారు లెండి.. అమరావతి వల్ల రాష్ట్రానికి ఉపయోగాలేమిటో చెప్పలేకపోయారు..

తిరుపతిరావు: ఇంకోటీ జరిగింది. ఈ రాష్ట్రంలో డబ్బంతా తీసుకెళ్లి అక్కడే పెడుతున్నారు. నవ నగరాలు అని అక్కడే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం వల్లా నష్టం జరిగింది. 

శైలజ: అమరావతి అనేది ఒక రాజకీయ అంశమైపోయింది. ఒక వ్యక్తి మీద ద్వేషం, ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో విద్వేషాన్ని బాగా పెంచేశారు. 

సుధాకర్‌: పాదయాత్ర ద్వారా ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకున్నాం. పోటీ సభకు వెళ్లిన ప్రజలు కూడా అమరావతి కావాలని అడిగిన విషయం మీ చానల్లోనే లైవ్‌లో చూశాం. ఇది మహా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అమరావతి జేఏసీలు ఏర్పాటు చేస్తాం. ఇక అన్ని కార్యక్రమాలూ రాష్ట్రవ్యాప్తంగా జరిగేలా చూస్తాం. 


సీమలో రెడ్లపై లేని వ్యతిరేకత.. కోస్తాలో కమ్మవారిపై ఎందుకు ఉంది? 

తిరుపతిరావు: ప్రభుత్వం చెప్పే అబద్ధాలను తిప్పికొట్టడంలో ప్రతిపక్షం ఫెయిలవుతోంది. గత ఐదేళ్లలో ప్రతి పనికిమాలినవాడూ మేధావి అని ముందుకు వచ్చి ఉప్పర్‌ మీటింగ్‌లు పెట్టేవాడు కదా! ఇప్పుడు ఏడీ.. ఒక్కడూ కనిపించడే?

శివారెడ్డి: పాదయాత్రతో జనంలో ధైర్యం మొదలైంది. యా త్ర తర్వాత బిల్లు ఉపసంహరణ జరిగింది. అలాగే మేం 60 లక్షల మంది ఉన్నాం.. మా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నా రు.. మేం తలచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని ఉద్యోగులు ప్రకటించారు. గతంలో ఇలాంటి కామెంట్‌ ఎవరైనా చేశారా?  


మీ మీద ఏం కేసులు ఉన్నాయి?

శైలజ: ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సహా చాలా కేసులు పెట్టారు.  

సుధాకర్‌: నేను అమరావతి జేఏసీ కన్వీనర్‌ కాబట్టి ఏ కేసు పెట్టినా అందులో నన్నే ఏ-1గా చూపించేవారు. 


2024లో కూడా జగన్‌ అధికారంలోకి వస్తే?

శివారెడ్డి: రాజధానిని అభివృద్ధి చేయడేమో కానీ.. రాజధానిని మాత్రం ఇక్కడ నుంచి మార్చలేరు. 

తిరుపతిరావు: ప్రజలు ఇప్పటికే కిందిస్థాయి వరకూ విసిగి వేసారిపోయారు. ఒక్క చాన్స్‌ అని అడుక్కోవడం వల్ల.. తల్లి, చెల్లి అందరూ కలిసి జోలె పట్టుకుని అడుక్కోవడం వల్ల అందరూ జాలిపడ్డారు. అంతేగాని.. ఏదో తవ్వితీసి పెడతాడని ఎవరూ అనుకోలేదు. 


పంజాబ్‌ రైతుల మాదిరి జేఏసీ రాజకీయ అవతారమెత్తే ఆలోచన ఉందా?

శివారెడ్డి: అసలు అలాంటి ఆలోచనే లేదు. 


మీ మీద కూడా కేసులు పెట్టారా?

శివారెడ్డి: ఈ ఉద్యమంలో మొదటి కేసు నా మీదే నమోదైంది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇద్దామనుకుంటే కేసులు పెట్టారు. ఆ రోజు నుంచి కేసులు పెట్టడం మొదలైంది. ఇక ఈ పాదయాత్రలోనే 80 కేసులు వరకూ పెట్టారు. రైలు వెళ్లే సమయంలో ఎవరినో ప్రభావితం చేసి రైలు గేట్లు ఎత్తేయించామంటూ పోలీసులు ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టారు. పాదయాత్రను చాలా క్రమశిక్షణతో చేశాం. ఆ యాత్రలో ఒక్క రాజకీయ విమర్శ కూడా చేయలేదు. 


సుధాకర్‌: అమరావతి ఉద్యమం మొదలైన సమయంలో తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ఇష్టమొచ్చినట్లు కొట్టడం, లాక్కెళ్లడం పోలీసులు అరాచకం చేశారు. ఎప్పుడైతే 144 సెక్షన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిందో పోలీసులు వెనక్కి తగ్గారు. దాంతో ప్రజల్లో చాలా ధైర్యం వచ్చింది. ఈ రోజున మహిళలకు కూడా.. జైళ్లకు తీసుకెళ్తారా, ఎంతమందిని రమ్మంటారు అని అడిగేంత ధైర్యం వచ్చింది. 


సీజేఐ రమణను రమణ చౌదరి అని తిట్టించిన ఇదే జగన్‌.. ఇప్పుడు ఆయన్నే పొగుడుతున్నారు. అంటే ఇప్పుడు కులం పోయిందా?

సుధాకర్‌: కొంచెమన్నా నైతిక విలువలు ఉండాలి. కానీ అదెక్కడా కనిపించడం లేదు. 

శైలజ: కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆలస్యమైనా కచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. 


జగన్‌ సీఎంగా ఉన్నంతవరకూ అమరావతిని ఆయన అంగీకరించరేమో?

తిరుపతిరావు: జగన్‌ భవిష్యత్‌లో పదవీచ్యుతుడవుతారు అంటే అది అమరావతి ఉద్యమం వల్లనే. మూడు రాజధానుల ప్రకటనతోనే ఆయన పదవీచ్యుతుడు అవుతారు. ఇది ఆరంభం మాత్రమే. 


శివారెడ్డి: జగన్‌గారు ప్రతిదీ వెనుకడుగు వేస్తున్నారు. శాసనమండలిలో బలం లేని రోజున రద్దు చేసి ఇప్పుడు బలం వచ్చిన తర్వాత రద్దు నుంచి వెనక్కి తగ్గారు. అలాగే, మూడు రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకున్నారు. మళ్లీ పెడతా అని చెప్పేది మేకపోతు గాంభీర్యమే అనుకుంటున్నా. ఈ 45 రోజుల పాదయాత్రలో నేను పూర్తిగా రథం పక్కనే ఉన్నా. ఈ రాజధాని మనది అనే అభిప్రాయం జనంలో వచ్చిందని గమనించాను. దీనిని కాపాడుకోకుంటే వలస పక్షుల్లాగా వెళ్లాల్సి ఉంటుందనేది ప్రజల్లో కలిగింది. కాబట్టి తిరుపతిరావు చెప్పినట్లు అమరావతి వల్లనే ఈ సీఎం పదవి కోల్పోతారు. 



మీకు పరిహారం ఇవ్వాల్సిందే కదా? పరిహారం ఎంత రావచ్చు?

సుధాకర్‌: 2013 చట్టం ప్రకారం చూసినా 34,573 ఎకరాలకు రమారమి 1.20 నుంచి 1.60 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే. అలాగే జీవనాధారం కోల్పోయిన వాళ్లకూ  పరిహారమివ్వాలి. 


అంటే ఎకరాకు 3 కోట్ల రూపాయలు రావొచ్చు.. అంటే రాజధాని ఉన్నా లేకున్నా మీరు బాగుపడినట్లే కదా?

తిరుపతిరావు: బాగుపడడం అంటే.. ఇవాళ పెళ్లిళ్లు కావడం లేదు. అందరి మానసిక స్థితి బాగోలేదు. వీటికి ఎవరు జవాబు చెప్పాలి?


సుధాకర్‌: ఐనవోలుకు చెందిన ఒక వ్యక్తి అర్ధరాత్రి రెండు గంటలకు ఫోన్‌ చేసి... ఈ సీఆర్‌డీఏ ప్లాట్లు ఇచ్చేలా లేదు... జగన్‌ ఇలా ప్రకటనలు చేస్తున్నారు.. నేను ఉరి వేసుకుంటున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఆ రోజు పడ్డ టెన్షన్‌ వర్ణనాతీతం.


శివారెడ్డి: రైతులు, రైతు కూలీల బాధలు ఒకెత్తు అయితే.. ఇక్కడ ఏదైనా కల్యాణమండపమో.. హోటలో, విద్యా సంస్థో కట్టాలని కొంత సొంత డబ్బు పెట్టి... బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ల బాధలు చెప్పనలవి కాదు. ఇలా వేల కోట్లు నష్టపోయిన వాళ్లు ఉన్నారు. చాలామంది అడ్ర్‌సలు మార్చి తిరుగుతున్నవాళ్లూ ఉన్నారు. 


అసెంబ్లీ, హైకోర్టు కట్టిన భూమి ఎవరి పేరుతో ఉంది?

సుధాకర్‌: అసెంబ్లీ కట్టిన భూమి నా భార్య పేరుతో ఉంది. 

Updated Date - 2022-01-03T08:37:54+05:30 IST