విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిపై హైకోర్టులో స్టేటస్ కో రావడం హర్షణీయమని చెప్పారు. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి అవేమి పట్టడం లేదన్నారు. రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులతో వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారని ఆరోపించారు. అయినా ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా?, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటానికి వామపక్షాల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.