అమరావతి కోసం.. పాదయాత్ర

ABN , First Publish Date - 2020-10-23T10:08:21+05:30 IST

అమరావతి కోసం.. అడుగులు కదిపారు. రాజధాని రక్షణ కోసం గొంతెత్తారు. ప్రజా రాజధాని కోసం పాదయాత్ర చేపట్టారు. మహిళలు, వివిధ పక్షాల నేతలు, విద్యార్థులు కదం తొక్కారు.

అమరావతి కోసం.. పాదయాత్ర

కదం తొక్కిన రాజకీయ పక్షాలు, ప్రజలు

40 కిమీ మేర సాగిన మహా పాదయాత్ర 

గుంటూరు, మందడం, రాయపూడిల నుంచి 

శంకుస్థాపన స్థలి ఉద్దండ్రాయునిపాలెంలో ప్రత్యేక పూజలు

సీఎం మనస్సు మారాలంటూ సర్వమత ప్రార్థనలు 

ప్రభలు కట్టి.. పాదయాత్రలో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలు


అమరావతి కోసం.. అడుగులు కదిపారు. రాజధాని రక్షణ కోసం గొంతెత్తారు. ప్రజా రాజధాని కోసం పాదయాత్ర చేపట్టారు. మహిళలు, వివిధ పక్షాల నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. గుంటూరు, మందడం, రాయపూడిల నుంచి ఉద్దండ్రాయునిపాలెం వరకు 40 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించారు. దేవుళ్లకు పూజలు చేస్తూ ఉద్దండ్రాయునిపాలెంలోని పుణ్యస్థలి వరకు సాగింది. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు సంఘీభావం పలకగా దారిపొడవునా జై అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినదించారు.  రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి ఐదేళ్లు అయిన సందర్భంగా ‘అమరావతి చూపు.. మోదీ వైపు’ పేరుతో రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు గురువారం వినూత్న నిరసనలు నిర్వహించారు. 

  

గుంటూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల ఆశల రాజధాని అమరావతి అంటూ గుంటూరువాసులు నినదించారు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి ఐదేళ్లైన సందర్భగా గురువారం వివిధ పక్షాల నాయకులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, రాయపూడి, గుంటూరుల నుంచి వేర్వేరుగా పాదయాత్రలు నిర్వహించారు. గుంటూరు లక్ష్మీపురంలోని మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి ఉదయం మహా పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాదయాత్ర గోరంట్ల, లాం, తాడికొండ, పెదపరిమి మీదగా తుళ్లూరు ఉద్దండ్రాయునిపాలేనికి చేరుకుంది. జేఏసీ నేతలు డాక్టర్‌ రాయపాటి శైలజ, మల్లికార్జునరావు, తెలుగుయువత నాయకులు భాష్యం నరసయ్య, మన్నెం శివనాగమల్లేశ్వరరావు, రావిపాటి సాయికృష్ణ, సాకిరి చైతన్య తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.


ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని

ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని అది అమరావతే అంటూ వివిధ ప్రాంతాల రైతులు కదం తొక్కారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలంలోని రాజధాని గ్రామాల రైతులు మందడం నుంచి, తుళ్లూరు మండలానికి చెందిన రైతులు రాయపూడి నుంచి ఉద్దండ్రాయునిపాలెం వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. రాయపూడి, వెలగపూడి, ఐనవోలు గ్రామాల రైతులు ప్రభలతో ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఉద్దండ్రాయునిపాలెంలో మహారుద్ర యాగం నిర్వహించారు. సీఎం మనసు మర్చాలంటూ రైతులు సర్వమత ప్రార్థనలు చేయించారు. 13 జిల్లాల పేరుతో పుణ్యస్థలి వద్ద మహిళలు పొంగళ్లు సమర్పించారు. అనంతరం అమరావతి అమరవీరులకు నివాళులర్పించారు. రైతులకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ, సీపీఐ నేత ముపాళ్ల రామకృష్ణ సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులు 29 గ్రామాలలో రాత్రి 7 గంటల సమయంలో కాగడాల ప్రదర్శనలు చేశారు. 


ప్రధాని మోదీ బొమ్మల టీ షర్టులతో..

ప్రధాని మోదీ బొమ్మలున్న టీ షర్టులు వేసుకుని మహా పాదయాత్ర నిర్వహించారు. సీఎం మొండి వైఖరితో ముందుకెళ్లి రాజధాని మారిస్తే ఆంధ్రుల భవిష్యత్తుకు ఇబ్బందులు వస్తాయంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం 310 రోజులుగా జరుగుతున్న ఆందోళనల్ని గుర్తించాలన్నారు. పాదయాత్ర మధ్యలో ఉన్న ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూ ముందుకెళ్లారు.  

Updated Date - 2020-10-23T10:08:21+05:30 IST