ఆవేదన.. ఆక్రోశం

ABN , First Publish Date - 2020-08-10T10:07:41+05:30 IST

భూములిస్తామని రైతులు ప్రభుత్వం వద్దకు వెళ్లలేదని.. ప్రభుత్వమే తమ దగ్గరకు వచ్చిఅడిగితే భూములు త్యాగం ..

ఆవేదన.. ఆక్రోశం

ప్రభుత్వం అడిగితేనే భూములిచ్చాం

ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెట్టారు

రాజధాని రైతుల ఆవేదన 

236 వ రోజుకు చేరుకున్న ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి క్రైం, ఆగస్టు 9: భూములిస్తామని రైతులు ప్రభుత్వం వద్దకు వెళ్లలేదని.. ప్రభుత్వమే తమ దగ్గరకు వచ్చిఅడిగితే భూములు త్యాగం చేశామని రైతులు అన్నారు.  ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.  అమరావతి కొనసాగాలని రాజధాని రైతులు రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం ఆదివారం 236వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, మందండం, రాయపూడి, వెలగపూడి, అబ్బరాజుపాలెం, తదితర గ్రామాల్లోని రైతు శిబిరాలలో నిరసనలు, దీక్షలు కొనసాగించారు. కేంద్రం ద్వంద వైఖరి విడనాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయదేవతే తమకు అండగా ఉందని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక, పొన్నెకల్లు గ్రామాల్లో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తొమ్మిది నెలల నుంచి రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే వారి గోడును పట్టించుకోకుండా రాజధాని తరలించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందని పేర్కొన్నారు.  శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలన్నారు. గవర్నర్‌ ఆమోదం తెలిపిన బిల్లులను మరోసారి పునఃసమీక్షించాలన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెంలో గ్రామదేవత గంగానమ్మకు ఆదివారం రైతులు, రైతు కూలీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.   కార్యక్రమంలో  రైతు సంఘ నాయకులు ఉమామహేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, కానుకొలను రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:07:41+05:30 IST