కలలకు సమాధి!

ABN , First Publish Date - 2020-07-04T08:51:55+05:30 IST

‘‘మేము భూములిచ్చింది రాజధాని నగరం కోసం! మేము ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో! అంతేతప్ప..

కలలకు సమాధి!

రాజధాని ఉద్యమానికి నేటితో 200 రోజులు

అమరావతిపై అందరి ఆశలు ‘మూడు’ ముక్కలు

రైతులకే కాదు.. భూములు కొన్న వారికీ కష్టం

అన్ని కులాలు, ప్రాంతాల వారికీ నష్టం


గృహ ప్రవేశాలకు సిద్ధమైన నిర్మాణాలు... వృథాగా మిగిలాయి. చకచకా లేవాల్సిన భవనాలు... పిల్లర్ల దశలోనే తుప్పల్లో కలిసిపోతున్నాయి. వేలమంది కార్మికులు కదలాడిన నేలలో... ఇప్పుడంతా నిశ్శబ్దం! నిర్మాణాలన్నీ ఎక్కడివక్కడే నిస్తేజం! సీమాంధ్రులకు ఆశా సౌధంగా నిలుస్తుందని భావించిన ‘అమరావతి’ నేడు శిథిలమవుతోంది. ఏడాదికిపైగా ఎక్కడికక్కడ నిలిచిన పనులతో రోదిస్తోంది. అమరావతిలో ఆగిన నిర్మాణాలపై సచిత్ర కథనం.....



అమరావతి... ఎవరిది? 200 రోజులుగా ఉద్యమిస్తున్న  రైతులదా? కృష్ణా, గుంటూరు జిల్లాలదా? లేక... మొత్తం సీమాంధ్రులదా! ‘అందరికీ అభివృద్ధి... అందరి కోసం అమరావతి’ అనే నినాదంతో రాజధాని రైతులు ఉద్యమిస్తున్నప్పటికీ... అమరావతి మనందరిదీ అని సీమాంధ్రులంతా భావించారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో స్థిరపడినవారు, విదేశాల్లోని తెలుగు వారూ అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు.  రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వగా... రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల్లోని వేలమంది తెలుగువారు లక్షలు, కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీరందరికీ ఇప్పుడు ఎంత కష్టం... ఎంత నష్టం!  



 ప్రభుత్వం మారితే... 

‘‘మేము భూములిచ్చింది రాజధాని నగరం కోసం! మేము ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో! అంతేతప్ప...వ్యక్తులతోనో, పార్టీలతోనే కాదు! చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించితీరాల్సిందే’’ అని రైతులు తేల్చి చెబుతున్నారు. తమకు ఇచ్చిన హామీ, ఒప్పందాలకు లోబడి రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యమిస్తున్నారు. ఈ రెండొందల రోజుల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. వేధింపులు, కేసులు, లాఠీచార్జీలు... ఇలా ఎన్నెన్నో నిర్బంధాలు. చివరికి... శాంతియుత ఉద్యమంపై ఏమిటీ ఉక్కుపాదం అని ఉన్నత న్యాయస్థానం పలుమార్లు తలంటిన తర్వాతే పోలీసుల తీరు మారింది. ఈలోగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. ఆందోళనలు, నిరసనలపై ఆంక్షల నేపథ్యంలో... రైతులు తమ ఉద్యమ పంథా మార్చారు. అప్పటిదాకా... వంటా వార్పూ, అమ్మోరికి పొంగళ్లు, ధర్నాలు చేసిన వారు... ఉద్యమంపై పట్టు సడలించకుండా ఇళ్లవద్దే తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో వున్నపుడు ఓ మాట...అధికారంలోకి వచ్చాక  మరోబాట పడుతున్న నేతలకు కనువిప్పు కలిగేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అమరావతి ఉద్యమ దీక్షాపరులు స్పష్టం చేస్తున్నారు. ఇక... రాజధాని తరలింపు ప్రకటన వచ్చినప్పటి నుంచి నేటిదాకా 68 మంది రైతులు ప్రాణాలను విడిచారు. 


ఎక్కడికీ పోదనుకున్నారు!

‘అమరావతి’ని స్వాగతిస్తున్నాం అని విపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు. పైగా... టీడీపీ సర్కారు దాదాపు రూ.9500 కోట్లతో వివిధ నిర్మాణాలను పూర్తి చేసింది. మరిన్ని వేల కోట్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. దీంతో... ప్రభుత్వం మారినా రాజధాని మారదని అందరూ భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయినప్పటికీ... ఇది తాత్కాలికమే అని, మళ్లీ యథాతథ స్థితి వస్తుందని అనుకున్నారు. కానీ... ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నట్టుండి ‘మూడు రాజధానుల’ ప్రకటన చేశారు. దీంతో అమరావతిపై ప్రజలు, స్థానికులు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.


ధరలు ఢమాల్‌

ఒక దశలో రాజధాని గ్రామాల్లో చదరపు గజం కనిష్ఠ ధర రూ 15 వేలు కాగా... గరిష్ఠంగా రూ.42వేల వరకు వెళ్లింది. ఇప్పుడు గరిష్ఠ ధరే రూ.10వేలకు పడిపోయింది. అంటే... కనిష్ఠ ధర పలికిన భూములను అడిగేవారే లేరు. అప్పట్లో భూములమ్ముకున్న కొంతమంది రైతులు తమ అదృష్టానికి మురిసిపోతుండగా...నాడు వాటిని కొనుగోలు చేసిన వారు, అప్పట్లో భూములను అమ్ముకోనివారు తమ దురదృష్టానికి తమనే నిందించుకుంటున్నారు. అప్పట్లో రాజధాని గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు బాగా జోరుగా సాగుతున్నపుడు ప్రభుత్వం గజం విలువను రూ.వెయ్యిగా నిర్ధారించింది. అదేం చిత్రమోకానీ... రాజధానిని అటకెక్కించిన వైసీపీ సర్కారు ఆ ధరను రూ.5వేలకు పెంచింది. దీంతో... ఏదో ఒక మూలన భూమి కొందామనుకున్న వారు కూడా వెనక్కి తగ్గుతున్నారు.


బడా సంస్థలు దివాళా

రాజధాని అమరావతిని నమ్ముకుని భారీగా పెట్టుబడులు పెట్టిన గృహ నిర్మాణ సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. రాజధాని ప్రకటనతో విజయవాడ కనకదుర్గ వారధి నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం వరకు సుమారు ఎనిమిది సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా మెగా వెంచర్‌లను నెలకొల్పాయి. గేటెడ్‌ కమ్యూనిటీలలో మూడింటి నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతావి అర్ధంతరంగా నిలిచిపోయాయి. పూర్తయినవాటికి డిమాండ్‌ లేకుండా పోయింది. దీంతో ఆ సంస్థలన్నీ ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాయి. ‘మూడు ముక్కల’కు ముందు రాజధాని పరిసర ప్రాంతాల్లో, జాతీయ రహదారికి ఇరువైపులా రియల్‌ ఎస్టేట్‌ జోరు కొనసాగింది. ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల దాక ఉండే డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ ఇప్పుడు రూ.25 - రూ.30 లక్షలకు పడిపోయింది. మంగళగిరి ప్రైమ్‌ లొకేషన్స్‌లో నిర్మించిన అపార్టుమెంట్లలో చదరపు అడుగు మొన్నటివరకు రూ.6 నుంచి రూ.7 వేలు పలికింది. ఈ రోజు అది రూ.4వేలకు పడిపోయింది. 


  రిజిస్ట్రేషన్లపై అనాసక్తి

అమరావతి కోసం ప్రభుత్వానికి రైతులు 34,385 ఎకరాలను భూ సమీకరణ రూపంలో ఇచ్చారు. ఆయా రైతులకు  మొత్తం 64,709 ప్లాట్లను ఇవ్వాలి ఉంది. అయితే ఇప్పటివరకు 40,046 ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. గత ఏడాది జూన్‌ ఒకటినుంచి ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు కేవలం 2,576 ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక్క ప్లాటు కూడా రిజిస్టర్‌ కాలేదు. అమరావతి  భవితవ్యం సందిగ్ధంలో పడటమే దీనికి కారణం. 


ఒక్కదానికీ దిక్కులేదు!

అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవించబోతుందన్న అంచనాలతో కొన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు సుమారు 190 ఎకరాలను సీఆర్డీయే నుంచి కొనుగోలు చేశాయి. ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించాయి. కానీ... ప్రభుత్వమే రాజధానిని మూలకు నెట్టడంతో, ఆయా సంస్థల్లో ఏ ఒక్కటీ నిర్మాణాలు ప్రారంభించలేదు.


 - గుంటూరు, ఆంధ్రజ్యోతి



రాజధానిలో అడుగు పెట్టగానే... సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కనే టీటీడీ చేపట్టిన వెంకన్న ఆలయమిది. సర్కారు వారి పుణ్యమా అని... ఈ గుడి కూడా మొండిగోడల వద్ద ఆగిపోయింది.


 ‘అభివృద్ధి కేంద్రం’ ధ్వంసం

తెలంగాణకు హైదరాబాద్‌లాగా... సీమాంధ్రకు ‘అమరావతి’ ఆర్థిక కేంద్రంగా మారుతుందని అందరూ భావించారు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు... అటు ఒంగోలు, ఇటు రాజమండ్రి వరకు దాని ప్రభావం కనిపించింది. రియల్‌ వ్యాపారం విస్తరించింది. కానీ, నేడు రాజధానికే దిక్కులేకుండా పోయింది. 


ఏవీ నాటి వెలుగులు

ఒకరూ ఇద్దరూ కాదు... వేలాదిమంది కార్మికులు! రాత్రింబవళ్లు అనే తేడా లేదు... ఫ్లడ్‌లైట్ల వెలుగులోనూ సాగిన పనులు! అదొక నిర్మాణ యజ్ఞం... పనుల జాతర! ఎక్కడ చూసినా జనమే! ఎక్కడో రాజస్థాన్‌ నుంచి వచ్చి టీకొట్టు పెట్టుకున్న వారి నుంచి... తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారి వ్యాపార సముదాయాల వరకు! అన్నీ కళకళలాడేవి! ఇప్పుడు అంతా మారిపోయింది. వ్యాపారాలు నేలకు దిగాయి. కొందరు పూర్తిగా మూసేసుకున్నారు.


రాజధాని రైతుకు దిగులు 

రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులలో 85 శాతం వరకు చిన్నా సన్నకారు రైతులే. రాజధాని కోసం వారిచ్చిన భూముల స్వరూపం మారిపోయింది. అవి ఎక్కడున్నాయో రైతులే కనుక్కోలేని పరిస్థితి. అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు చేతికి రాలేదు. వచ్చినా... వాటికి ధర పలకదు. వ్యవసాయం మూలన పడింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన కౌలు సరైన సమయానికి రావడంలేదు. ఇప్పటికీ వార్షిక కౌలు అందలేదు. ఒకప్పుడు బ్రాండెడ్‌ వస్తువులు కొన్న రాజధాని ప్రాంత వాసుల్లో అత్యధికులు ఇప్పుడు రేషన్‌ బియ్యంతో సరిపెట్టుకుంటున్నారు. ఏ వస్తువు కొనాలన్నా ఆలోచించి కొంటున్నాడు. 


అప్పులపాలై స్వస్థలాలకు!

‘అమరావతి’ని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామన్న ప్రకటన... అందుకు తగిన కార్యాచరణతో... చాలామంది ఉపాధి కోసం ఇక్కడికి తరలి వచ్చారు. ఫ్యాన్సీ షాప్‌లు, జ్యువెలరీ, చెప్పుల షాపులు, రెడీమేడ్‌ వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు, హోటళ్లు ప్రారంభించారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. నిర్మాణ పనులు సాగినన్నాళ్లు వీరి వ్యాపారాలు బాగానే నడిచాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఆగిపోయాయి. వ్యాపారాలు సాగలేదు. మూడు రాజధానుల ప్రకటనతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పుల ఊబిలోకి వెళ్లకముందే జాగ్రత్త పడాలని... దుకాణాలు మూతేసుకుని  స్వస్థలాలకు వెళ్లిపోయారు.


రాజధానిలో ఎంతోకొంత భూమి కొంటే భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో బంధువులు, మిత్రులు కలిసి తలా ఇంత డబ్బు జమ చేసుకుని రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. భవిష్యత్తుపై ఆశతో అప్పులు చేసి మరీ భూములు కొన్న వారూ ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య వేలలోనే ఉంది! వీరిలో అన్ని సామాజిక వర్గాలవారు, అన్ని స్థాయుల వారూ ఉన్నారు. ప్రభుత్వం ‘హ్యాపీ నెస్ట్‌’లో ఫ్లాట్ల విక్రయాలు ప్రారంభించినప్పుడు... గంటల్లోన్నీ అన్నీ అమ్ముడయ్యాయి.


‘మన రాజధానిలో మనకూ ఒక నివాసం’ ఉండాలనే ఉద్దేశంతో... సీమాంధ్రులతోపాటు దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారెందరో ఈ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ‘హ్యాపీనెస్ట్‌’ ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టు కూడా అప్పగించింది. సరిగ్గా పనులు మొదలయ్యే సమయానికి సీన్‌ మారిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టుల్లో పెట్టిబడి పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వెరసి... రాజధాని పనులు ఆగిపోవడంతో... జరిగిన నష్టం స్థానిక రైతులకే కాదు! అక్కడ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు కొన్న వారికి కూడా! ఇలా పెట్టుబడులు పెట్టిన వారిలో వైసీపీ అభిమానులు, నేతలూ ఉన్నారు.


అద్దెకు అడిగేవారేరీ?

గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నప్పుడు... ఈ ప్రాంతంలో ఇళ్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. నిర్మాణ సంస్థల్లో పని చేసే ఇంజనీర్లు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువమంది స్థానికంగానే నివసించేందుకు మొగ్గు చూపారు. రాజధాని రైతులు భూములు అమ్మి కట్టిన ఇళ్లకు మంచి కిరాయి లభించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు! అద్దెకు అడిగే వారే లేరు. లక్షలు పెట్టి కట్టిన ఇళ్లలో 70 శాతం వరకు ఖాళీగా ఉన్నాయి. 


నిర్మాణం... నిస్తేజం!

రాజధాని గ్రామాల్లో భారీ ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు కొనసాగేవి. ఆయా గ్రామాల్లో భారీ ఎత్తున ఎలక్ట్రికల్‌, సిమెంట్‌, హార్డ్‌వేర్‌ షాపులు వెలిశాయి. ఆ వ్యాపారాలన్నీ ఇప్పుడు మూలన పడ్డాయి. ఆయా రంగాలలో పని చేసే కూలీలు ఇప్పుడు ఉపాధి లేక ఖాళీగా కూర్చుంటున్నారు.


తెరిచి... మూశారు

రాజధాని పనులు జోరుగా సాగుతున్న సమయంలో అక్కడంతా కళకళ! వేలాది మంది కార్మికులు... వచ్చీ పోయే ఉద్యోగులతో సందడి నెలకొంది. దీంతో... తుళ్లూరులో ఎప్పుడో మూతపడిన సినిమా థియేటర్‌ను కోటిన్నర వ్యయంతో ఆధునికీకరించి  మళ్లీ తెరిచారు. ఈ సినిమా హాలు కార్మికులకు, స్థానికులకు వినోదం పంచింది. రాజధాని పనులు మూలన పడ్డాక అంతా స్తబ్ధతే! థియేటర్‌  నిర్వహణ ఖర్చు కూడా కష్టమైంది. ప్రస్తుతం వినోదాలకు కరోనాతో బ్రేక్‌ పడటంతో సినిమా థియేటర్‌ను మూసి వేశారు.

- తుళ్లూరు , మంగళగిరి


 నేడు ఉపవాస దీక్ష రాజధాని రైతులకు సర్వత్రా మద్దతు

200 రోజులుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు అనేక సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయి. శనివారం రైతులు తమ ఇళ్లలోనే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. దీనిపై జేఏసీ ఇప్పటికే కార్యచరణ రూపొందించింది. రైతులకు ప్రవాసాంధ్రులు కూడా సంఘీభావం ప్రకటించారు. శనివారం అమెరికాలో దాదాపు 300 నగరాల్లో అమరావతి రైతులకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.





ఎక్కడివక్కడే..!


50 అంతస్ధుల జీఏడీ టవర్ల నిర్మాణ శంకుస్థాపన  శిలాఫలకమిది! తుప్పల్లో కలిసిపోతోంది!



ఇవి మంత్రుల క్వార్టర్లు. నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి పూర్తయ్యేవి. ఇప్పుడు అక్కడ పందులు తిరుగుతున్నాయి.



హైకోర్టు న్యాయమూర్తుల నివాసం...ఇప్పుడు, పిచ్చి మొక్కలు, తీగలకు ఆవాసం!



వందశాతం ‘ప్రీకాస్ట్‌’ టెక్నాలజీతో మొదలుపెట్టిన సీఆర్డీయే ప్రధాన కార్యాలయం... పనులన్నీ ఆగిపోయి ఇలా బోడిగా మిగిలిపోయింది.

Updated Date - 2020-07-04T08:51:55+05:30 IST