రాజధానిని దెబ్బతీసే మాస్టర్‌ ప్లాన్‌!

ABN , First Publish Date - 2020-04-04T09:07:51+05:30 IST

రాజధానిలో స్థానికేతర పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవోను జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి.

రాజధానిని దెబ్బతీసే  మాస్టర్‌ ప్లాన్‌!

పేదలకు ఇళ్ల స్థలాల సాకుతో అమరావతిలో మార్పులు!

తాజా జీవో జారీ వెనుక రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమిదే?


(ఆంధ్రజ్యోతి, అమరావతి): రాజధానిలో స్థానికేతర పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవోను జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాల్లోని 52,000 మందికి రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాలివ్వాలన్న ఉద్దేశ్యంతోనే  తాజా జీవోను ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా, అవసరమైతే నియమనిబంధనలు, చట్టాలు, పాత తీర్మానాలను సవరించుకోవచ్చునంటూ ఈ ఉత్తర్వుల ద్వారా ఏపీసీఆర్డీయేకు అవకాశమిచ్చింది. అవసరమైతే అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను సైతం మార్చుకోవచ్చునని కూడా దీనిలో పేర్కొన్నారు!


రాజధానిని విశాఖపట్నానికి తరలించాలన్న ఆలోచనకు మాస్టర్‌ ప్లాన్‌ అడుగడుగునా అడ్డు పడుతున్న నేపథ్యంలో దానిని నిర్వీర్యం చేసేందుకే తాజా ఉత్తర్వులిచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుపేదలకు ఇళ్ల స్థలాల పేరిట మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు జరిపించాలని నిర్ణయించారని, ఇలా చెబితే న్యాయస్థానాలు అంతగా అభ్యంతరం పెట్టకపోవచ్చునన్నది వారి అభిప్రాయమని తెలుస్తోంది. 


అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా దేశ విదేశాలకు చెందిన నిపుణులు కొన్ని నెలలపాటు శ్రమించి, రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ఇది. సమాజంలోని అన్ని వర్గాలవారూ ఇక్కడ సౌకర్యవంతంగా జీవించేలా డిజైన్‌ చేశారు. అందులో భాగంగానే రాజధానిలో 10 చోట్ల ఒక్కొక్క ప్రదేశంలో 500 అపార్ట్‌మెంట్లతో కూడిన మొత్తం 5,000 ఫ్లాట్లను భూమి లేని పేదల కోసం నిర్మించారు. కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చి ఊరుకుంటే పేదలు వాటిల్లో గృహాలు నిర్మించుకోలేకపోతే ప్రయోజనం ఉండదన్న ఉద్దేశ్యంతో మాస్టర్‌ప్లాన్‌లో దీనిని పొందుపరిచారు. అవసరాన్నిబట్టి మరి కొన్ని చోట్ల ఈ గృహ సముదాయాలను నిర్మించేందుకు వీలుగా మాస్టర్‌ ప్లాన్‌లో పలు ప్రదేశాల్లో ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌’ కోసమని స్థలాలను కూడా నాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ చర్యల ద్వారా రాజధానిలోని పేదలందరికీ గృహ వసతి అమరుతుంది. 


నిర్మాణాలను నిలిపేసి..

దేశ విదేశాల మన్ననలు చూరగొన్న అమరావతిని మరింత వేగంగా నిర్మించి, చరిత్రలో నిలిచిపోయే సువర్ణావకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం చేజేతులా జారవిడుచుకుంటోంది! అమరావతిని ఉనికిలో లేకుండా చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటోంది. ముందుగా అక్కడ జరుగుతున్న నిర్మాణాలను అర్ధంతరంగా ఆపివేయించారు. తర్వాత మూడు రాజధానుల నిర్ణయం చేశారు. దీనికి వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో వారు 108 రోజులుగా వివిధ రూపాల్లో శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో రాజధానికి వెలుపల ఉన్న 52,000 మంది పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించారు.


అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగానూ, ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలకు భిన్నంగా ఈ నిర్ణయాలున్నాయంటూ పలువురు రైతులు హైకోర్టులో సవాల్‌ చేశారు. వాదోపవాదాల అనంతరం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రైతుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఇతర ప్రాంతాల రైతులకు రాజధాని గ్రామాల్లో భూమిని ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం తగదంటూ గత నెలలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతోనైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని పునఃసమీక్షించుకుని, దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందేమోనని కొందరు భావించారు. కానీ వారి ఆశలను వమ్ము చేస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తానంటూనే, హైకోర్టు తప్పుబట్టిన అంశాలను సవరిస్తూ ప్రభుత్వం గురువారం తాజా జీవో జారీ చేసింది. అందులో కేవలం ఆయా అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, ‘అవసరమైతే అమరావతి మాస్టర్‌ప్లాన్‌కు మార్పులు చేసైనా సరే’ రాజధానేతర పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలివ్వాల్సిందేనంటూ సీఆర్డీయేను ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది.


Updated Date - 2020-04-04T09:07:51+05:30 IST