మా శ్వాస.. ధ్యాస అమరావతే

ABN , First Publish Date - 2020-04-04T09:09:54+05:30 IST

‘మా శ్వాస అమరావతి.. మా ధ్యాస అమరావతే.. మా పోరాటం అమరావతి అభివృద్ధి కోసమే..’ అంటూ శుక్రవారం రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగించారు.

మా శ్వాస.. ధ్యాస అమరావతే

రాజకీయాలొద్దు అభివృద్ధే కావాలి 

108వ రోజు రాజధాని రైతుల దీక్షలు


తుళ్లూరు/తాడికొండ, గుంటూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘మా శ్వాస అమరావతి.. మా ధ్యాస అమరావతే.. మా పోరాటం అమరావతి అభివృద్ధి కోసమే..’ అంటూ శుక్రవారం రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు  ఎవరి ఇంటిలో వారు ఆకుపచ్చ జెండాలు చేతబూని జై అమరావతి అంటూ  నిరసనల్లో పాల్గొన్నారు. అమరాతినే  రాజధానిగా కొనసాగించే వరకు ఉద్యమం ఆగదన్నారు. రాజకీయాలు, ఆయా పార్టీలతో పనిలేదని, తమకు కావాల్సింది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేశారు. వెంకటపాలెం, తుళ్లూరు, పెదపరిమి, మందడం, వెలగపూడి, నీరుకొండ, రాయపూడి దీక్షా శిబిరంలో వంతుల వారీగా రైతులు భౌతిక దూరం పాటిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతవరం, నెక్కల్లు, వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో  మహిళలు బృందాలుగా ఏర్పడి నిరసనలు తెలిపారు. ‘అమరావతి వెలుగు’ పేరిట శుక్రవారం కూడా రాజధాని మహిళలు నిరసనలు కొనసాగించారు. 


ఆంక్షలు కఠినతరం

రాజధాని గ్రామాల్లో శుక్రవారం పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యమం కొనసాగించటం సరికాదని పోలీసులు హెచ్చరించారు. తమ మాట వినకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

 

Updated Date - 2020-04-04T09:09:54+05:30 IST