Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్లుండి ఢిల్లీకి బాబు

  • అదేరోజు రాష్ట్రపతి కోవింద్‌తో సమావేశం 
  • మోదీ, షా అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నం 
  • కేంద్రం దృష్టికి మాదక ద్రవ్యాలు, దాడుల అంశం
  • రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్న బృందం
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు నేతల బలప్రదర్శన
  • మినీ మహానాడును తలపించిన టీడీపీ కేంద్ర కార్యాలయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36గంటల నిరశన దీక్ష శుక్రవారం రాత్రి ముగిసింది. తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి ఈ దీక్ష బాగా ఉపకరించిందని, ఆ కోణంలో ఇది సఫలమైందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జన స్పందన రీత్యా కూడా దీక్ష సక్సెస్‌ అయిందంటున్నాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం కిటకిటలాడింది. ఉదయం 6గంటలకు మొదలైన కార్యకర్తల రాక.. సాయంత్రానికి విపరీతంగా పెరిగిపోయింది. కార్యాలయం లోపల  కాలుమోపలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ పార్టీ మహానాడు సమావేశాలను నిర్వహించడం లేదు. ఆ లోటును ఈ దీక్ష తీర్చిందని, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో మినీ మహానాడు మాదిరిగా జరిగిందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ 300 కార్లతో తరలివచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని విజయవాడ నుంచి వచ్చారు. లోకేశ్‌ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి వందల మంది కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చారు. వీరిలో మహిళలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు.


 అమరావతి దళిత జేఏసీ కూడా ప్రదర్శనగా తరలివచ్చింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చినవారు అధికంగా కనిపించారు. ‘రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంపై అధికార పార్టీ దాడులు జరిపించింది. టీడీపీ నేతల ఇళ్లపైనా దాడులు చేయించారు. ఇవి ఎంత దుర్మార్గమో.. అధికార పార్టీకి పోలీసులు ఎంత సహకరిస్తున్నారో ఈ దీక్ష సందర్బంగా చంద్రబాబు మొదలుకొని పార్టీ నేతలంతా బాగా చెప్పగలిగారు. గంజాయి, డ్రగ్స్‌పై తాము మాట్లాడడం వల్లే ఈ దాడులు జరిగాయని కూడా మా నేతలు బట్టబయలు చేశారు. ఆత్మరక్షణలో పడిన అధికార పార్టీ.. టీడీపీ నేతలు బూతులు మాట్లాడటం వల్లే దాడులు జరిగాయని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. చివరకు ముఖ్యమంత్రి కూడా పదేపదే అదే వాదనను వల్లెవేశారు. ఇదే సందర్బంలో అధికార పార్టీ నేతలు గతంలో ఎన్నెన్ని బూతులు మాట్లాడారో గుర్తు చేయడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. అహంకారం ప్రదర్శించే అధికార పక్షం తమను బూతులు తిట్టారంటూ సానుభూతి కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. ఇది చంద్రబాబు దీక్ష సాధించిన విజయం’ అని టీడీపీ ముఖ్య నేత పేర్కొన్నారు. శుక్రవారం రెండోరోజు ఉదయం 5గంటలకు చంద్రబాబు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆరున్నర గంటలకు వేదికపైకి చేరుకుని దీక్ష ప్రారంభించారు. ఆ సమయంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీక్ష ప్రారంభించే సమయంలో వేదికపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఉన్నారు. అప్పటికే పలువురు కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూ బాబు వేదికపై కూర్చున్నారు. రెండో రోజు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వారికి పార్టీ కార్యాలయం భోజన ఏర్పాట్లు చేసింది. దీక్ష సందర్భంగా రెండు రోజుల్లో సుమారుగా 50 మంది నేతలు ప్రసంగించారు. ఈ దీక్షకు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. 


జగన్‌, డీజీపీ.. ఇప్పుడేమంటారు?

‘‘ఏపీనే గంజాయి కేంద్రం అని దేశం మొత్తం అంటోంది. వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు చెప్పిన వీడియోలు ఇవిగో. వీటికి ఏం సమాధానం చెప్తావు జగన్‌రెడ్డీ? వాళ్లందరిపైనా కేసులు పెడతావా డీజీపీ?’’ అని లోకేశ్‌ నిలదీశారు. గంజాయి అంతా ఏపీనుంచే వస్తోందని ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన వీడియోలను ఆయన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలు డ్రగ్స్‌ హబ్‌ ఏపీ అని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కూస్తున్నాయి. వాళ్లందరికీ నోటీసులిస్తారా? ఇప్పుడేం చేస్తారు?’’ అని ప్రశ్నించారు. 


ఎల్లుండి ఢిల్లీకి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు హస్తిన యాత్రకు బయల్దేరనుంది. ఎంపీలతో సహా సుమారు పది మంది నేతలు ఈ బృందంలో ఉంటారు. రాష్ట్రపతి కోవింద్‌తో పాటు పలువురు పెద్దలను కలసి మాదకద్రవ్యాలు, వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతి సోమవారం అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కోరనుంది. 

పోలీసుల్లేకుండా.. రా!

70 లక్షల పసుపు సైన్యం ఉరికించి కొడతారు!.. లోకేశ్‌ ఫైర్‌

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి దమ్ముంటే, పోలీసులు లేకుండా టీడీపీ కార్యాలయం వైపు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సవాల్‌ చేశారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ ఆఫీసు పై రాళ్లేసి.. ఉద్యోగులను కొట్టి వెళ్లడం కాదు.. దమ్ముంటే ఇప్పుడు రండి.. మా సత్తా చూపిస్తాం’ అని హెచ్చరించారు. ఒక చెంపపై కొడితే, రెండు చెంపలూ పగలకొట్టి పంపిస్తామన్నారు. 70 లక్షల పసుపు సైన్యం ఉరికించి కొడుతుందని స్పష్టంచేశారు. ’అయ్యా.. జగన్‌రెడ్డీ! నీ తాడేపల్లి కొంపలో పడుకోవడం కాదు.. టీడీపీపై దాడి చేయాలని ఉంటే, నువ్వే నేరుగా రా.. నీ పెంపు కుక్కలను పంపిస్తే, 10 నిమిషాల్లో పారిపోతారు. గంజాయి, డ్రగ్స్‌తో యువత భవితను నాశనం చేయొద్దని డిమాండ్‌ చేసిన టీడీపీ నేతలపైనా, కార్యాలయాలపైనా దాడులు చేయడం సిగ్గుచేటు.


 పోలీసు అధికారులే టీడీపీ ఆఫీసుపై దాడి చేయించారు. దాడి చేసిన వారిని తప్పించేందుకు గుంటూరు నుంచి డీఎస్పీ వచ్చాడంటే.. ఇది ప్రభుత్వ ఉగ్రవాద దాడి కాదా? టీడీపీలో ఇప్పుడు యువ రక్తం ఉరకలెత్తుతోంది. ఎవ్వరూ ఊరుకోరు. 70 లక్షల మంది కార్యకర్తలకు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయ అద్దాలు మాత్రమే పగలకొట్టారు. మా కార్యకర్తల గుండెల్లో టీడీపీపై ఉన్న అభిమానాన్ని పగలగొట్టలేరు. 2024నాటికి టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. జగన్‌రెడ్డిలా చిన్నాన్న జోలికెళ్లలేదంటూ, మీ చిన్నాన్నని ఎవరు చంపారో దర్యాప్తు చేయించగలవా? అని సవాల్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో టీడీపీని గెలిపించి, చంద్రబాబుకు కానుగా ఇస్తాం. ఇప్పుడు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. అసలు సినిమా రెండున్నరేళ్లలో చూపిస్తాం’ అని లోకేశ్‌ హెచ్చరించారు. 

Advertisement
Advertisement