జగన్‌ మనసు మారాలి!

ABN , First Publish Date - 2020-02-22T09:41:40+05:30 IST

జగన్‌ మనసు మారాలి!

జగన్‌ మనసు మారాలి!

శిబిరాల్లో.. శివపూజలు

మహాశివరాత్రి రోజూ కొనసాగిన ఆందోళనలు 

సీఎం మనసు మారాలంటూ లింగాభిషేకాలు 

అమరావతికి జై కొట్టిన సీపీఐ

గుంటూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్‌ మనసు మార్చు శివా!’- అంటూ అమరావతి రైతులు మహాశివరాత్రిని పురస్కరించుకుని తాము ఆందోళనలు చేస్తున్న శిబిరాల్లోనే లింగార్చనలు చేశారు.  రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాక తమ పోరాటం ఆగదని.. సీఎం జగన్‌ అన్ని గ్రామాల్లోనూ పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని.. రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరాతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం 66వ రోజుకు చేరాయి. మహాశివరాత్రి రోజు కూడా రైతులు నిరసనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కోటప్పకొండ తిరుణాళ్లలో జై.. అమరావతి నినాదం మార్మోగింది. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, కావూరు గ్రామస్థులు ఏర్పాటు చేసిన ప్రభ తాళ్లను చేతపట్టుకుని అమరావతి రైతులు నినాదాలు చేస్తూ కోటప్పకొండకు సాగారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు తదితర గ్రామాల నుంచి రైతులు, మహిళలు బస్సులు, కార్లలో కోటప్పకొండకు పయనమైయ్యారు. ఆకుపచ్చ కండువాలు కప్పుకొని రైతులు ప్రదర్శనలో పాల్గొన్నారు. అమరావతి రైతులకు భక్తులు సంఘీభావం తెలిపి వారితో ముందుకు సాగారు. అమరావతి ఉద్యమ గీతాలను వినిపించారు. కమ్మవారిపాలెం ప్రభకు ‘జై అమరావతి’ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులు అమరావతి బ్యానర్లను తొలగించగా రైతులునిరసన వ్యక్తం చేశారు.  


తాడికొండ అడ్డరోడ్డులో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు, మహిళలు శుక్రవారం శివరాత్రి పండుగ సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు చేశారు. శిబిరం ముందు శివలింగాన్ని ఏర్పాటు చేసి, పువ్వులతో శివలింగాకారాన్ని, ‘జై అమరావతి’ అని రాసి నిరసనలు కొనసాగించారు. పొన్నెకల్లు గ్రామ మహిళలు శిబిరంలోనే జాగారం చేశారు.  

రాయపూడి దిక్షా శిబిరంలో హిందూ, ముస్లిం మహిళలు కలిసి కాలేషా దర్గాలో పొంగళ్లు చేసి ర్యాలీగా దీక్షా శిబిరానికి వచ్చారు. అక్కడ శివపూజ చేయటంతో పాటు, గోపూజ చేసి మతసామర్యం చాటారు. అమరావతి కోసం దీక్ష చేశారు. ముస్లిం మహిళలు మాట్లాడుతూ, ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో దీక్ష చేస్తున్న మహిళలు తమకు ఆదర్శమని చెప్పారు.  


మందడం దీక్షా శిబిరాన్ని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను డబ్బుతో కొనుగోలు చేయటానికి జగన్‌ సిద్ధమయ్యారని ఆరోపించారు. 


తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, జేఏసీ నేతలు నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు శుక్రవారం 66వ రోజుకు చేరాయి.  


రైతులదే తుది విజయం: దేవినేని

అమరావతి ఉద్యమంలో రైతులదే తుది విజయమని, ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కృష్ణాయపాలెంలో రైతులు, రైతు కూలీలు, జేఏసీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అమరావతిని ఏకైక రాజధాని కొనసాగించాలని దీక్షలు చేస్తుంటే సీఎం జగన్‌కు నవ్వులాటలా ఉండడం బాధాకరమన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అత్యుత్సాహంతో పని చేస్తున్నాడని విమర్శించారు.  


నేడు అమరావతి బంద్‌

రైతులు, రైతుకూలీలు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయటంతో పాటు, అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అమరావతిలోని 29 గ్రామాల్లో శనివారం బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. విద్య, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని జేఏసీ కోరింది. 

Updated Date - 2020-02-22T09:41:40+05:30 IST