అమ్మఒడి అందేనా..?

ABN , First Publish Date - 2022-04-26T05:55:29+05:30 IST

జగనన్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. విద్యార్థుల హాజరు నుంచి వారి ఇళ్లలో విద్యుత్‌ వరకు నిర్దేశించిన ప్రకారం ఉంటేనే అమ్మఒడి సాయం అందుతుంది.

అమ్మఒడి అందేనా..?

పథకం వర్తింపునకు నిబంధనలు 

విద్యుత్‌ వాడకం 300 యూనిట్లు దాటితే కట్‌ 

విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి 

ఆధార్‌ కార్డులో కొత్త జిల్లాల పేర్లు చేర్చుకోవాలి 

వలంటీర్ల వద్ద పేర్లు, వయస్సు సరి చూసుకోవాలి

కొత్త షరతులతో తల్లిదండ్రుల అయోమయం


కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 25: జగనన్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. విద్యార్థుల హాజరు నుంచి వారి ఇళ్లలో విద్యుత్‌ వరకు నిర్దేశించిన ప్రకారం ఉంటేనే  అమ్మఒడి సాయం అందుతుంది. కుటుంబ విద్యుత్‌ వాడకం 300 యూనిట్లలోపే ఉండాలి. అది దాటితే పథకానికి అనర్హులవుతారు. హాజరు శాతాన్ని కూడా సీరియ్‌సగా పరిగణిస్తారు. వాస్తవానికి గతంలోనే అమ్మఒడి కింద లబ్ధి పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరే అన్న నిబంధన విధించారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆ షరతుకు మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరం మాత్రం 75 శాతం హాజరు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆధార్‌ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చి కొత్త జిల్లాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. అమ్మఒడి కింద లబ్ధి పొందాలనుకునే వారంతా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అందులో పాత జిల్లా పేరును మార్చి కొత్త జిల్లా పేరు అప్‌డేట్‌ చేసుకోవాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమ్మఒడి అర్హత ఎవరెవరికి ఉంటుందో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి సవివరంగా తెలియజేశారు. అమ్మఒడి పథకం కింద యేటా జిల్లాలో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15వేల చొప్పున నగదు జమ చేస్తున్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి జనవరిలో తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. వేసవి సెలవుల అనంతరం జూలైలో నగదు జమ చేసేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలతో చాలా మంది అమ్మఒడి పథకానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అమ్మఒడి పథకానికి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 


ఇవీ నిబంధనలు


బియ్యం కార్డు కొత్తదై ఉండాలి.

ఇంటింటి సర్వే మ్యాపులో విద్యార్థి, తల్లి ఒకే మ్యాపింగ్‌ అయి ఉండాలి 

విద్యార్థి ఈకేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి

వలంటీర్ల వద్దకు వెళ్లి విద్యార్థి పేరు, వయస్సు సరి చేసుకోవాలి.

తల్లుల బ్యాంకు ఖాతా నెంబరు ఆధార్‌కు లింక్‌ అయిందో లేదో చూసుకోవాలి

బ్యాంకు ఖాతా ఆధార్‌ నెంబరును ఫోన్‌ నెంబరుతో లింక్‌ చేయించుకోవాలి

బ్యాంకు ఖాతా ట్రాన్సక్షన్స్‌ కలిగి ఉండాలి


ఇవి ఉంటే అమ్మఒడి  వర్తించదు 


విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం వర్తించదు 

విద్యార్థుల హాజరు 75 శాతం కంటే తక్కువ ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు 

ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవాళ్లకు అమ్మఒడి వర్తించదు 

ఇటువంటి వారిలో ఎవరైనా అమ్మఒడి తీసుకొని ఉంటే క్రిమినల్‌ కేసు నమోదుకు ఆదేశాలు ఉన్నాయి

నాలుగు చక్రాల వాహనం ఉన్నా అమ్మఒడి వర్తించదు.


ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల వివరాలు..


2019-20 విద్యా సంవత్సరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 7,81,348 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి వర్తిస్తుంది. ఈ మేరకు యూనిక్‌ మదర్‌ను తీసుకుని 3,77,662 మంది విద్యార్థులకు రూ.566.49 కోట్లు జమ చేశారు. 2020-21 విద్యా సంవత్సరంలో 8,14,351 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 4,12,884 మంది విద్యార్థులకు రూ.619.326 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 


ఏడాది నష్టం


ప్రతి సంవత్సరం సుమారు జిల్లాలో అమ్మఒడి పథకం కింద 4.20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. దీని కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు అందిస్తున్నారు. ఇందులో  పాఠశాలల ఆయాల జీతాల కోసం రూ.1000 మినహాయించి, మిగతా రూ.14వేలు అందజేస్తున్నారు. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఏటా జనవరిలో ఈ పథకం కింద విద్యార్థి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావాలి. అయితే ఈసారి జనవరిలో కాకుండా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అంటే జూలైలో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల ఒక ఏడాది ఇవ్వకుండా నిలిపివేసినట్లే.  కాగా అమ్మఒడి నిబంధనలపై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని డీఈవో రంగారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-26T05:55:29+05:30 IST