ఆ వెయ్యేది..!

ABN , First Publish Date - 2021-07-30T06:48:03+05:30 IST

జిల్లాలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం అమ్మఒడి నుంచి రూ.1000 మినహాయించారు. ఇంతవరకు ఆ మొత్తాన్ని పాఠశాలలకు జమ చేయలేదు.

ఆ వెయ్యేది..!

  • మరుగుదొడ్ల నిర్వహణకు అమ్మ ఒడి నుంచి మినహాయింపు
  • పాఠశాలలకు జమ చేయని ప్రభుత్వం
  • మొత్తం రూ.45 కోట్లు

తుని, జూలై 29: జిల్లాలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం అమ్మఒడి నుంచి రూ.1000 మినహాయించారు. ఇంతవరకు ఆ మొత్తాన్ని పాఠశాలలకు జమ చేయలేదు. పాఠశాలలకు తమ పిల్లల్ని పంపే తల్లుల ఖాతాలో అమ్మఒడి పేరిట ఏటా రూ.15 వేలను జమచేస్తూ వస్తోంది. తొలి ఏడాది 2020 జనవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమచేసి, మరుగుదొడ్ల నిర్వహణకు వెయ్యి రూపాయలు వెనక్కి ఇవ్వాలని సీఎం జగన్‌ కోరారు. కొందరు ఇచ్చినా, మరికొందరు ఖాతాలో పడిన డబ్బును వినియోగించుకున్నారు. దీంతో రెండోసారి 2021 జనవరిలో తల్లుల ఖాతాలో రూ.14 వేల చొప్పున మాత్రమే ప్రభుత్వం జమ చేసింది. మరుగుదొడ్ల నిర్వహణకు అంటూ రూ.1000ని పాఠశాలల ఖాతాలకు జమ చేస్తున్నట్టు చెప్పింది. ఏడు నెలలు గడిచినా... ఆ వెయ్యి రూపాయల ప్రస్తావన లేదు. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించారు. వీరికి నెలకు రూ.6 వేల చొప్పున అమ్మఒడి నుంచి మళ్లించిన నిధులే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలలు తెరవకపోయినా వారికి సగం జీతం ఇవ్వాలి. మరుగుదొడ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రధానోపాధ్యాయులు సొంతంగా పెట్టుకుంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, నిర్వహణ కొరవడినా ప్రధానోపాధ్యాయులను బాధ్యుల్ని చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వాటి నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు.

అమ్మఒడి మినహాయింపు సొమ్ము రూ.45 కోట్లు రావాలి

అమ్మఒడి పథకంలో భాగంగా ఈ ఏడాది జనవరి 11న జిల్లాలో 4.50 లక్షల మంది లబ్ధిదారులకు రూ.675 కోట్ల నిధులను అందించారు. రూ.15 వేలకు బదులు రూ.14 వేలను తల్లుల ఖా తాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం వద్దే ఉంచుకుంది. ఇలా జిల్లాలోని పాఠశాలలకు రూ.45 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అప్పట్లో విద్యార్థుల నుంచి మినహాయించిన ఈ మొత్తాన్ని డీఈవో, జేసీ పేరుతో జాయింట్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేస్తే జమ చేస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఇక కరోనా నేపథ్యంలో గతేడాది నవంబరులో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు పనిచేశాయి. అప్పటినుంచి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూ.20 వేల నుంచి 30 వేల వరకు సొంత నిధులను ఖర్చు పెడితే ఆ మొత్తాన్ని స్కూలు గ్రాంటు నిధులు రాగారు చెక్కు రాసుకుని డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం సీపీఎంఎస్‌ విధానంలో చెక్కులు రాసి డ్రా చేసుకునే వెసులుబాటు లేదు. పెట్టిన ఖర్చులకు తొలుత బిల్లులు పెట్టి వాటిని ట్రెజరీ అధికారులు ఆమోదించాక పేమెం ట్‌ కోసం సీపీఎంఎస్‌కు పంపిస్తారు. అక్కడ నిధుల లభ్యతను బట్టి వాటిని విడుదల చేస్తారు.

Updated Date - 2021-07-30T06:48:03+05:30 IST