అమ్మ ఒడి అలజడి

ABN , First Publish Date - 2022-05-19T06:01:06+05:30 IST

అమ్మ ఒడి నగదు సాయం పథకానికి ఏలూరు జిల్లాలో అర్హులైన విద్యార్థులు, తల్లుల సంఖ్య ప్రాథమికంగా నిర్థారణ అయింది.

అమ్మ ఒడి అలజడి

2,64,457 మంది విద్యార్థులు అర్హత 

తేలని ఇంటర్‌ విద్యార్థుల వివరాలు

 నిబంధనలు కఠిన తరంతో తగ్గుతున్న లబ్ధిదారులు


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 18 : అమ్మ ఒడి నగదు సాయం పథకానికి ఏలూరు జిల్లాలో అర్హులైన విద్యార్థులు, తల్లుల సంఖ్య ప్రాథమికంగా నిర్థారణ అయింది. జిల్లాలోని 28 మండలాల్లో ఈ పథకానికి మొత్తం 2,64,457 మంది విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత లభించగా, ఆ మేరకు నగదు సాయం 1,72,749 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రూ.259.12 కోట్లు జమ అవుతుంది. ఇవన్నీ పాఠ శాల విద్యార్థులకు సంబంధించిన వివరాలు కాగా, ఇంకా ఇంటర్‌విద్యార్థుల వివరాలు తేలాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల అమ్మఒడి పథకాన్ని 2019–20 విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తుండగా, పథకం అర్హతలను కఠినతరం చేయ డం వల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి.


అడ్డగోలుగా తొలగింపు

నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే అమ్మ ఒడికి అనర్హులను చేయడంపై తీవ్ర విమర్శలు వస్తు న్నాయి. ఒకే భవనంలో అద్దెకు ఉంటున్న పలు కుటుంబాలకు ఒకే విద్యుత్‌ కనెక్షన్‌పై సబ్‌ మీటర్లతో నివాసం ఉంటున్న వారికి విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించి ఉంటోంది. ఫలితంగా సంబంధిత విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ అమ్మ ఒడికి దూరమ వుతున్నారు. మార్చిలో విద్యుత్‌ చార్జీలు పెంచడం వల్ల ఏప్రిల్‌లో మీటర్ల రీడింగ్‌ ఆలస్యంగా తీయడం వల్ల యూనిట్ల వినియోగం పెరిగి, ఆ మేరకు అమ్మ ఒడి షరతుల పరిధిలోకి రావడానికి దారి తీసింది. ఇక చిన్నపాటి ఉద్యోగాలు చేస్తోన్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, నెలకు రూ.15 వేలు పారితోషకాన్ని సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ ద్వారా తీసుకుంటున్న వారిని అనర్హుల జాబితాలోకి చేర్చారు. ఆదాయపు పన్నుకు సంబంధించి పన్ను చెల్లింపు వర్తించకుండా రిటర్న్‌లు దాఖలు చేసిన వారితోపాటు, సెంటు భూమి లేకపోయినా పలువురిని అనర్హులను చేసినట్టు సమాచారం. విద్యార్థుల హాజరును ఈ ఏడాది 75 శాతంగా చేయడంతో ఆ మేరకు వేల సంఖ్యలోనే ప్రాథమి కంగానే అర్హత కోల్పోయినట్టు ప్రచారం జరుగుతోంది.


ల్యాప్‌టాప్‌లకు 45,784 మంది 

స్కూలు శానిటేషన్‌ ఖర్చుల నిమిత్తం రూ.వెయ్యి పోను మిగిలిన నగదు సాయం రూ.14 వేలను అమ్మఒడి పథకం కింద అర్హత సాధించిన ఒక్కో తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. నగదు సాయం వద్దనుకునే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులకు ఈ ఏడాది ల్యాప్‌టాప్‌లను ఇవ్వనున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 45,784 మంది ల్యాప్‌టాప్‌ల కోసం అభీష్టాన్ని తెలియజేశారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ల నాణ్యతపై ఇప్పటికే అనుమానాలు ముసురుకున్నాయి. ఇవి మరమ్మతులకు లోనైతే వాటిని సరిదిద్దే బాధ్యతలను సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లకు అప్పగించారు. ల్యాప్‌టాప్‌ల కోసం ఆప్షన్‌ ఇచ్చిన ఇంటర్‌ విద్యార్థుల   సంఖ్య ఇంకా నిర్థారణ కాలేదు.


పెండింగ్‌ జాబితా ఏమైందో

గతేడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ సాకులవల్ల 6 వేల మంది అమ్మ ఒడికి దూరమయ్యారు. ఈ పథకానికి అర్హతలు ఉన్నప్పటికీ తొలగించారంటూ, పలువురు కలెక్టరేట్‌ ప్రత్యేక స్పందనలో అర్హతలను నిరూపించే ధ్రువీకరణపత్రాలు సహా అర్జీలు అందజేశారు. ఇలా ఇచ్చిన వారిలో ఎంత మంది తల్లులకు నగదు సాయం  అందిందో స్పష్టత లేదు. ఈ దఫా అమ్మఒడి  అనర్హులు తమ అర్హతలను నిరూపించుకునేందుకు లేదా అర్జీలు అందజేసేందుకు రిడ్రెసల్‌ సెల్‌ ఏర్పాటు దిశగా ఇంత వరకు చర్యలు లేవు.


Updated Date - 2022-05-19T06:01:06+05:30 IST