‘అమ్మఒడి’లో కోత.. నిబంధనల వాత!

ABN , First Publish Date - 2022-05-24T05:42:16+05:30 IST

జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభమైన ఏడాది 2019-20లో జిల్లావ్యాప్తంగా 2,20,607 మంది విద్యార్థుల తల్లులకు రూ.15వేలు చొప్పున అందచేయగా 2020-21లో 2,43,497 మందికి రూ.14 వేలు అందజేశారు.

‘అమ్మఒడి’లో కోత..  నిబంధనల వాత!

జనవరిలో అందజేయాల్సిన సాయం.. జూన్‌లో విడుదల

గతేడాది రూ.వెయ్యి.. ఇప్పుడు 2 వేలు...

ఆపై నిబంధనల కొర్రీ

ఘననీయంగా తగ్గిపోనున్న లబ్ధిదారుల సంఖ్య


అమ్మఒడి పథకంలో లబ్ధి అంతా గందరగోళంగా మారింది. ఒక్కో పేద విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15వేలు నగదు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తొలి ఏడాది మాత్రం పూర్తిస్థాయిలో అందించి రెండో ఏడాది రూ.వెయ్యి కోతపెట్టింది. తాజాగా ప్రకటించిన గడువులోగా ఈ పథకం అమలు చేయకపోగా సాయం అందించాల్సిన గడువును ఆరు నెలలు పొడిగించింది. పైగా ఈ ఏడాది రూ.2వేలు కోతపెట్టి రూ.13వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు కోసం పెట్టిన నిబంధనలు తల్లిదండ్రులను కలవరపెడుతోంది. నిబంధనలన్నీ పూర్తిస్థాయిలో అమలయితే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని విద్యాశాఖ వర్గాలు  చెబుతున్నాయి.


నెల్లూరు (విద్య), మే 23 : జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభమైన ఏడాది 2019-20లో జిల్లావ్యాప్తంగా 2,20,607 మంది విద్యార్థుల తల్లులకు రూ.15వేలు చొప్పున అందచేయగా 2020-21లో 2,43,497 మందికి రూ.14 వేలు అందజేశారు. ఇందులో వెయ్యి రూపాయలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో  మినహాయించుకున్నారు. తాజాగా 2021-22 విద్యా సంవత్సరానికి అమ్మఒడి సాయం జనవరిలో కాకుండా జూన్‌కు పొడిగించడంతోపాటు నిబంధనలు  కఠినం చేశారు. 75 శాతం హాజరుతోపాటు విద్యుత్‌ బిల్లులు, సొంత ఇల్లు, ఆదాయం ఇలా ఎన్నో నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే అమ్మఒడి సాయం ఆరు నెలలు ఆలస్యమైనా వచ్చే నెలలో అందుతుందని విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తుండగా ప్రభుత్వ మరో ప్రకటన విడుదల చేసింది. పాఠశాలల్లో మౌలిక  సదుపాయాల నిర్వహణ కోసమంటూ మరో వెయ్యి కోత విధించి ఈ ఏడాది రూ.13 వేలు మాత్రమే జమ చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది లక్షమందికి పైగా నగదుకు బదులు లాప్‌టాప్‌లను ఎంపిక చేసుకున్నారు. అమ్మఒడి సాయంకు రెండేళ్లలో రూ.2వేలు కోతపెట్టిన ప్రభుత్వం లాప్‌టాప్‌ల విషయంలో ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారో వేచి చూడాల్సిందే.


ఈకేవైసీ గండం

అమ్మఒడి పథకానికి సంబంధించి నగదు లబ్ధిదారులకు అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. కానీ జిల్లాలో నేటికీ కనీసం 40శాతం కూడా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో నగదును అర్హుల జాబితాల్లో జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వలంటీర్లతో బెనిఫిషరీ అవుట్‌రీచ్‌ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల వివరాలు ఈకేవైసీ చేసి ఉండాలని నిర్ధేశిస్తూ వలంటీర్లకు ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. సచివాలయాల వారీగా తల్లుల వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచారు. బెనిఫిషరీ అవుట్‌రీచ్‌ సర్వే పేరిట విద్యార్థుల తల్లుల వివరాలను వలంటీర్లు నవీకరిస్తున్నారు. 


నిబంధనలు కఠినం...

అమ్మఒడికి అర్హత ఉన్నా చాలామంది ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు. తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌ అనుసంధానం అయి ఉండాలి. బ్యాంకు ఖాతా, పాఠశాల లాగిన్‌లో నమోదైనది ఒకటే అయి ఉండాలి. 

అమ్మఒడి నిబంధనలు ఈ ఏడాది కఠినతరంగా చేశారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకే ఆర్థిక సాయం జమచేస్తారు. దీనిపై తల్లిదండ్రుల్లో చాలామందికి అవగాహన లేదు. 

బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ అనుసంధానం అయ్యిందా లేదా అన్న వివరాలను బ్యాంకుకు వెళ్లి సరి చూసుకోవాలి. రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఒక ఖాతాకు మాత్రం ఎన్‌పీసీఐ అనుసంధానం చేయించాలి.  ఆ తర్వాత వలంటీర్‌ దగ్గర ఆధార్‌ ఈకేవైసీ చేయించుకోవాలి. హౌస్‌హోల్డ్‌లో మ్యాపింగ్‌ నమోదైంది లేనిదీ సరి చూసుకోవాలి. 

బియ్యం కార్డులో తప్పనిసరిగా తల్లి, పిల్లల పేర్లు ఉండాలి. లేకుంటే సాయం అందదు. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు. వారి సంరక్షుల కార్డుల్లో పిల్లల పేర్లు ఉండవు. వీరిని అనర్హులుగా గుర్తిస్తారు. 

కొవిడ్‌ కారణంగా గత ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల్లో నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో చాలామంది తాము ముందు చదివిన పాఠశాల నుంచి టీసీలు తెచ్చుకోలేదు. ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తేల్చి చెప్పేశాయి. దీంతో ఈ విద్యార్థులు పేర్లు చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాలేదు. వీరికి అమ్మఒడి సాయం అందదు. 

నెలకు రూ.10వేలు ఆదాయం మించిన వారందరినీ అనర్హులుగా చూపిస్తున్నారు. ప్రఽధానంగా ప్రభుత్వ విభాగంలో పనిచేసే కార్మికులందరూ అనర్హులుగానే ప్రకటిస్తున్నారు. 

విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే సాయం అందదని ప్రభుత్వం ప్రకటించింది.  

Updated Date - 2022-05-24T05:42:16+05:30 IST