అమ్మఒడికి అన్నీ కోతలే

ABN , First Publish Date - 2021-01-10T05:26:15+05:30 IST

అమ్మఒడి పథకం అందరికీ అందేలా లేదు. తుదిజాబితాలో పలురకాల హాస్యాస్పదమైన కారణాలతో అర్హులకు అన్యాయం చేశారు. అంతా కోతలే అన్నట్లు అనర్హత వేటు వేశారు. అధికారుల మాత్రం అర్హులకు అన్యాయం జరగదంటూ పాతపాటే పాడుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే..

అమ్మఒడికి అన్నీ కోతలే
పేర్లు చూసుకుంటున్న విద్యార్థినులు

 అమ్మఒడి తుదిజాబితాలపై ఆగ్రహావేశాలు 

తప్పులతడకగా జాబితాలు 

హాస్యాస్పదమైన కారణాలతో తిరస్కరణ 

50వేలమందికిపైనే అనర్హులు 

మరో 11,470మంది పేర్లు విత్‌హెల్డ్‌లో..

ఆందోళనలో విద్యార్థుల తల్లులు 

ఒంగోలు విద్య, జనవరి 9 :  అమ్మఒడి కోతలమయంగా మారింది. పథకం అర్హుల తుదిజాబితాలపై సరత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల తుది జాబితాలు తప్పులతడకగా ఉండటంతో అర్హులైన తల్లిదండ్రులకు సమాధానాలు చెప్పలేక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల మొదటి జాబితాలో అర్హులుగా పేర్కొన్న వారిలో సైతం చాలామందిని తుదిజాబితాలో అనర్హులుగా ప్రకటించడంతో అమ్మలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్యాస్పదమైన కారణాలతో అర్హులను సైతం అనర్హుల జాబితాలో చేర్చడంతో అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పండుగ సంక్రాంతికి ముందు అమ్మఒడి పథకం నిధులు బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని ఎదురుచూస్తున్న చాలామందికి ఇది చేదువార్తనే. పండగవేళ పిల్లలకు కొత్త దుస్తులు కొనడంతో పాటు పండుగను బాగా జరుపుకోవచ్చునన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులకు తాజా పరిణామాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు.

 

అమ్మఒడి పథకం అందరికీ అందేలా లేదు. తుదిజాబితాలో పలురకాల హాస్యాస్పదమైన కారణాలతో అర్హులకు అన్యాయం చేశారు. అంతా కోతలే అన్నట్లు అనర్హత వేటు వేశారు. అధికారుల మాత్రం అర్హులకు అన్యాయం జరగదంటూ పాతపాటే పాడుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే..  జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొంది యూడైస్‌ కోడ్‌ ఉన్న 4,557 పాఠశాలలు, 172 జూనియర్‌ కళాశాలల్లో సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్నారు. వీరికి తోడు గతేడాది ఉన్నత పాఠశాలల్లో 10వతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరినట్లు భావించి అమ్మఒడి పథకం వర్తింపజేస్తూ వారి వివరాలను గతేడాది పదో తరగతి చదివిన పాఠశాలల లాగిన్‌కే పంపించారు. ఆ విధంగా మరో 40వేలమంది విద్యార్థులకు కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు.  ఇదంతా బాగానే ఉన్నా తుదిజాబితాలో అసలు వ్యవహారం బయటపడింది. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో సుమారు 50వేలమందిని అనర్హులుగా ప్రకటించారు. మరో 11,470మంది పేర్లను విత్‌హెల్డ్‌లో ఉంచారు. అర్హత ఉండి అనర్హుల జాబితాలో ఉన్న పిల్లల తల్లులు కొందరు కాళ్లు అరిగేలా గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిరిగినా పనికాకపోవడంతో నిరాశతో అశలు వదులుకున్నారు. 


తప్పులతడకగా జాబితాలు 

అమ్మఒడి పథకం లబ్ధిదారుల తుది జాబితాలు తప్పులతడకగా ఉన్నాయి. తుది జాబితాలను పరిశీలించిన ప్రధానోపాధ్యాయులు, పిల్లల తల్లులు విస్తుపోతున్నారు. మొదట ప్రకటించిన ప్రాథమిక జాబితాలో అర్హులుగా గుర్తించిన వారిని సైతం తుదిజాబితాలో అనర్హులుగా పేర్కొనడంతో వారు లబోదిబోమంటున్నారు. జాబితాల్లో ఏమి జరిగిందో ఈ తప్పులు ఎందుకు జరిగాయో తెలియక తల్లులకు సర్ది చెప్పలేక ప్రధానోపాధ్యాయులు నానా అవస్థలు పడుతూ తలులు పట్టుకుంటున్నారు. మొదటి జాబితాలో ఉన్న తమ పేర్లను ఎలా తొలగిస్తారంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడి పథకం మొదటి జాబితాలో అర్హులు కొందరిని హాస్యాస్పదమైన కారణాలతో అర్హులు జాబితా నుంచి తొలగించడం పట్ల నిరసన వ్యక్తమవుతుంది.


ఇదీ అసలు విషయం..

  కొంతమంది విద్యార్థుల పేర్లకు ఎదురుగా వారు ఏ పాఠశాలలో చేరలేదు కనుక వారి పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవానికి పాఠశాలలో చేరని విద్యార్థులకు చైల్డ్‌ ఐడీ నంబరు రాదు. చైల్డ్‌ ఐడీ నంబరు లేకుండా హెచ్‌ఎం లాగిన్‌లో విద్యార్థుల వివరాలు అప్‌లోడ్‌ చేయలేం. అయితే మొదటి జాబితాలో అర్హులుగా పేర్కొన్నా వీరిని తుదిజాబితాలో అనర్హులుగా చూపించడం అనుమానాలకు తావిస్తోంది. 

  గతేడాది బెస్టు అవలైబుల్‌ స్కూలులో చదివిన విద్యార్థులకు ఈ ఏడాది ఆ పాఠశాలలో వారు సాధారణ పాఠశాలలో చేరి చదువుతున్నారు. మొదటి జాబితాలో వీరిని అర్హులుగా పేర్కొన్నప్పటికి తుది జాబితాలో వీరు బెస్టు అవైలబుల్‌ స్కూలులో చదువుతున్న వారికి అమ్మఒడి వర్తించదంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. 

 గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పాసైన విద్యార్థులను ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద అదే పాఠశాలలో వీరి వివరాలను హెచ్‌ఎం లాగిన్‌లో పంపారు. మొదట ప్రకటించిన జాబితాలో వీరిని అర్హులుగా పేర్కొనగా తుది జాబితాలో వీరు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించలేదని, పరీక్ష ఉతీర్ణలు కాలేదన్న సాకుతో అనర్హుల జాబితాలోకి నెట్టేశారు. ఈ విధంగా జిల్లాలోని అనేక పాఠశాలల్లో లబ్ధిదారులు జాబితాల్లో తప్పులు చోటుచేసుకున్నాయి. 


అర్హులైన వారందరికీ లబ్ధి  

-సుబ్బారావు, డీఈఓ

అమ్మఒడి పథకం కింద అర్హులైన విద్యార్ధులందరికి తప్సనిసరిగా లబ్ది చేకూరుతుందని వారి తల్లులు ఖాతాకు డబ్బులు జమవుతాయని జిల్లా విద్యాశాఖాధికారి విఎ్‌స.సుబ్బారావు తెలిపారు. జాబితాల్లో తప్పులు ఉంటే సరిచేస్తారని తల్లులు అందోళన చెందవలసిన అవసరం లేదని అయన చెప్పారు. అసలు లబ్దిదారులైన తల్లులు ఎంపికలో ఎటువంటి పొరపాట్లు జరగవని అందరికి న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. 


Updated Date - 2021-01-10T05:26:15+05:30 IST