అమ్మో..ఒడి

ABN , First Publish Date - 2022-05-27T06:19:43+05:30 IST

అమ్మో..ఒడి

అమ్మో..ఒడి

అమ్మఒడిపై సవాలక్ష ప్రశ్నలు

వలంటీర్ల యాప్‌లకు లబ్ధిదారుల జాబితా

తాజాగా తల్లులు, విద్యార్థుల వేలిముద్రల సేకరణ

ఖాతాలు ఈకేవైసీ చేయాలని ఆదేశాలు

సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు


అమ్మఒడి అందుతుందా, లేదా? ప్రభుత్వ నిబంధనలు, వలంటీర్ల హడావుడి సర్వేలతో ప్రస్తుతం తల్లుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. వచ్చే నెలలో తల్లుల ఖాతాలో నగదు జమ కావాల్సి ఉండగా, ప్రస్తుతం వలంటీర్లు సర్వేలు నిర్వహిస్తుండటంతో అసలు ఏమవుతుందా?             అనే గందరగోళం ఏర్పడింది.


గుడివాడ, మే 26 : వచ్చే నెలలో అమ్మఒడి ప్రయోజనాన్ని తల్లుల ఖాతాకు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం వలంటీర్ల ద్వారా తల్లుల ఖాతాలకు ఈకేవైసీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాజా ఇంటింటి సర్వేలో చాలామంది తల్లుల పేర్లు జాబితాలో కనిపించట్లేదు. రెండు జిల్లాల్లో కలిపి గత ఏడాది అమ్మఒడికి 1.31 లక్షల మంది అర్హత పొందలేక పోయారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే రెట్టింపు మంది అమ్మఒడికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. 

మూడు రకాల జాబితాలు

అమ్మఒడికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మూడు జాబితాలు విడుదల చేసింది. అర్హులు, అనర్హులు, పునఃపరిశీలన పేరిట గ్రామ, వార్డు వలంటీర్ల లాగిన్‌కు ఆప్షన్లు వచ్చాయి. అర్హుల జాబితాలో ఉన్నవారి వద్ద అవసరమైన డాక్యుమెంట్లు రెండు జతలు సేకరించాలి. రెండో జాబితాలో అనర్హుల వివరాలు ఉన్నాయి. వాటిపై అభ్యంతరాలుంటే పక్కా వివరాలు, రెండు జతల డాక్యుమెంట్లు ఇవ్వాలి. పునఃపరిశీలన జాబితాలో ఉన్నవారి వద్ద నుంచి పిల్లలు, తల్లుల ఆధార్‌ నెంబర్లు, బ్యాంకు పుస్తకం, రేషన్‌ కార్డులు రెండేసి సేకరించాలి. అలాగే, తల్లుల వేలిముద్రలు సేకరించే బాధ్యతను వలంటీర్లపై ఉంచారు. కానీ, వేలిముద్రల డివైజ్‌ కొరత ఉండటంతో తల్లులే సచివాలయాలకు వెళ్లి వేలిముద్రలు వేయాలని సూచిస్తున్నారు. అలాగే, లబ్ధిదారులు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో వివరాలు అప్‌లోడ్‌ అయ్యాయో, లేదో చూసుకోవాలి. వేలిముద్రల ప్రక్రియ బుధవారానికి పూర్తి చేయాల్సి ఉన్నా చాలాచోట్ల సాంకేతిక సమస్యలతో ముందుకు కదలని పరిస్థితి ఉంది.  

సాంకేతిక సమస్యలు ఎన్నో..

2021-22 విద్యా సంవత్సరానికి రెండు జిల్లాల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే విద్యార్థులు 6.27 లక్షల మంది ఉన్నారని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరికీ వారి తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు జిల్లాల్లోని సచివాలయాలవారీగా నిర్దేశించిన యాప్‌లో పంపిన జాబితా ప్రకారం తల్లుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. మూడు రోజులుగా వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఆధార్‌ నెంబర్లు నమోదు చేస్తూ జాబితాను సరిచూస్తున్నారు. ఆధార్‌ నెంబరు నమోదు చేసినా ఎటువంటి సమాచారం లేదని చెబుతుండటంతో ఏం చేయాలో తెలియక వలంటీర్లు తలలు పట్టుకుంటున్నారు.  

ఇవేం నిబంధనలు

విద్యుత్‌ వినియోగం, సొంతభూమి, రెండు చక్రాలకు మించి వాహనం లేకపోవడం, ఆదాయపు పన్ను కట్టకపోవడం, అర్బన్‌ ల్యాండ్‌ వంద చదరపు గజాలకు మించి లేకపోవడం, జీఎస్టీ చెల్లించకపోవడం, హాజరు శాతం 75 శాతం ఉంటేనే అమ్మఒడి వర్తిస్తుందనే నిబంధనలు విధించారు. ఆయా నిబంధనల్లో ఏ ఒక్కటి సరిపోకపోయినా అంతే సంగతులు. కొన్నిచోట్ల విద్యార్థుల ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో ఫింగర్‌ ప్రింట్లు తీసుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్లో కొన్నింటిని సచివాలయాల సిబ్బంది పరిష్కరించగలిగినా మరికొన్ని అధికారులే చూడాల్సినవి ఉంటున్నాయి. హాజరు శాతం విషయంలో ఉపాధ్యాయులకే సరైన మార్గదర్శకత్వం లేదని తెలుస్తోంది. ఈకేవైసీ సమయంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా అదేమీ జరగలేదు.


అర్హులందరికీ అందజేస్తాం..

అర్హులందరికీ అమ్మఒడి అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈకేవైసీ చేసే సమయంలో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మఒడి అందేలా చూస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి.  - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖ అధికారి

Updated Date - 2022-05-27T06:19:43+05:30 IST