ఏపీ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్.. ఆ విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకం లేనట్టేనా!

ABN , First Publish Date - 2021-10-19T15:20:22+05:30 IST

చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మ ఒడి లబ్ధిని అందిస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక కుటుంబంలో ఒక్కరికే అన్న నిబంధన పెట్టారు. మొత్తం 54 లక్షల మంది పిల్లలు చదువుతుండగా.. ఈ నిబంధనతో దాదాపు 10 లక్షల మంది పథకానికి అర్హులు కాకుండా..

ఏపీ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్.. ఆ విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకం లేనట్టేనా!

అమ్మఒడి ఒక ఏడాది మిస్‌?

ఐదేళ్లు ఇవ్వాల్సింది.. ఇప్పుడు నాలుగేళ్లే..

రూ.6,500 కోట్ల మిగులుకు మాస్టర్‌ప్లాన్‌

నిధుల కొరత, అప్పుల మోతతో భారం

అదీ అస్పష్టంగా.. చెప్పీ చెప్పకుండా వెల్లడి

ఒక ఏడాది దాటవేతకే ‘జూన్‌’ ప్రకటన

మరి మార్చిలో పరీక్షలు రాసి బడి వదిలే టెన్త్‌ విద్యార్థులకు పథకం లేనట్టేనా!

ప్రైవేటు స్కూళ్లు అన్నినెలలు ఆగగలవా?

ఈ ఎన్నికల వరకు స్కీమ్‌ నడిస్తే తర్వాత సంగతి తర్వాత అన్నట్టు సర్కారు తీరు


అప్పుడు లబ్ధిలో.. ఇప్పుడు స్కీమ్‌లోనే..

చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మ ఒడి లబ్ధిని అందిస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక కుటుంబంలో ఒక్కరికే అన్న నిబంధన పెట్టారు. మొత్తం 54 లక్షల మంది పిల్లలు చదువుతుండగా.. ఈ నిబంధనతో దాదాపు 10 లక్షల మంది పథకానికి అర్హులు కాకుండా పోయారు. ఇది రెండేళ్ల క్రితమే జరిగింది. ఇప్పుడు ఒక ఏడాది ‘అమ్మ ఒడి’ని ఎగవేసేలా మాస్టర్‌ప్లాన్‌ వేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకాన్ని ఒక ఏడాది తప్పించేశారు. ఐదేళ్ల పాలనలో ఐదుసార్లు ఇస్తామన్న పథకాన్ని నాలుగేళ్లే ఇచ్చేలా మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. జనవరి నుంచి జూన్‌ నెలకు పథకం లబ్ధిని ఇచ్చే సమయం మార్చడం ద్వారా... ఈ విడతలో ఒక ఏడాది ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసుకున్నారు. 


ప్రతిఏటా రూ.6,500కోట్లు అమ్మ ఒడికి ఐదేళ్లు ఇస్తానన్న ప్రభుత్వం... సగం పాలనాకాలం ముగిసేసరికి ప్లేటు ఫిరాయించింది. పథకం అమలు కాలం మార్చేసి...పకడ్బందీగా, వ్యూహాత్మకంగా ఒక ఏడాది తప్పించేసుకుంది. ఏటా అమ్మ ఒడి ఇస్తాం...మా పాలనలో ఐదేళ్లూ ఈ లబ్ధి అందిస్తామన్న ప్రభుత్వం...చాపకింద నీరులా చిన్న మార్పు చేయడం ద్వారా ఒక ఏడాదికి ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందులో అమ్మ ఒడికి సంబంధించిన అంశంపైనా సమీక్షించి ఆయనే ఒక కొత్త ప్రతిపాదన పెట్టారు. ‘‘అమ్మ ఒడిని ఇప్పటివరకు జనవరిలో ఇస్తున్నాం. వచ్చే ఏడాదినుంచి అలాకాకుండా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇస్తాం’’ అని ప్రకటించారు. అంటే జనవరిలో ఇచ్చే రూ.6,500 కోట్లను జూన్‌లో ఇస్తారన్నమాట. 


అసలు మతలబిదేనా!..

సీఎం జగన్‌ ప్రకటన చూసినవారు పథకం పంపిణీ ఐదు నెలలు ఆలస్యం కావడం తప్ప పెద్ద తేడా ఏముంది అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడే అసలు మతలబు ఉంది. జనవరిలో అమ్మఒడి ఇవ్వడం కొనసాగిస్తే...2022 జనవరి, 2023 జనవరి, 2024 జనవరి...అంటే మూడేళ్ల పాటు ఇవ్వాలి. జనవరి నుంచి జూన్‌కు మార్చడంతో 2022 జూన్‌, 2023 జూన్‌ రెండేళ్లే ఇస్తారు. ఆ తర్వాత ఏడాది తొలి అర్ధభాగంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలయితే.. తర్వాత సంగతి తర్వాత అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. అలాగే... ఇప్పటిదాకా సంబంధిత విద్యాసంవత్సరం లబ్ధిని ప్రతి ఏటా జనవరిలో ఇస్తున్నారు. 2021 విద్యాసంవత్సరం అమ్మఒడి నిధులను జనవరిలో ఇచ్చేయాలి. కానీ... 2022 విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామంటున్నారు. మరి... 2021 విద్యాసంవత్సరంలో ‘అమ్మ ఒడి’ ఏమైనట్లు?


టెన్త్‌ పిల్లలకు దెబ్బే!

అమ్మ ఒడిని పాత పద్ధతిలోనే అమలు చేస్తే... ఇప్పుడు పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కూడా జనవరిలో డబ్బులు వచ్చేవి. కానీ... దానిని జూన్‌కు మార్చేశారు. అంటే... మార్చి-ఏప్రిల్‌లో పరీక్షలు రాసి పాఠశాలను వదిలిపెట్టే పదోతరగతి విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వారికి  మాత్రం జనవరిలో ఇస్తారా? లేక... టెన్త్‌ పూర్తయినప్పటికీ, కాలేజీలో చేరిన తర్వాత కూడా డబ్బులు ఇస్తారా? దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. తాజా నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు పథకాన్ని దూరం చేస్తారనే భయాందోళనలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. 


ప్రైవేటు బడులు సర్దుకోగలవా?

ఏటా సంక్రాంతి సమయంలో అమ్మ ఒడి ఇస్తామని 2020లో ప్రకటించారు. అదేవిధంగా రెండేళ్లపాటు ఇచ్చారు. ఈ పథకం కింద లబ్ధిని ఇచ్చే సమయాన్ని బట్టి ప్రైవేటు పాఠశాలలు కూడా ఫీజుల్ని వసూలుచేసే సమయం సర్దుబాటు చేసుకున్నాయి. సంక్రాంతికి ఎలాగూ అమ్మ ఒడి వస్తుంది...అప్పుడే అడుగుదామని అప్పటివరకు ఎలాగోలా లాక్కొచ్చేవాళ్లు. ఇప్పుడు జూన్‌ వరకు ఆగాలంటే ఇబ్బందే! తల్లిదండ్రుల్ని జనవరిలోనే కట్టేయాలని ఒత్తిడి తెచ్చే పరిస్థితులూ ఏర్పడతాయి. 


ఏడాది మొదట్లోనే చెప్పొచ్చుగా...

విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే...ఆ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలన్న ప్రశ్న వేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం విద్యార్థులకు జనవరిలో ఇచ్చేసి... వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూన్‌నుంచి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాల్సిందని అంటున్నారు. అలాకాకుండా విద్యాసంవత్సరం ప్రారంభంలో అమ్మ ఒడి అన్న నిర్ణయం... విద్యాసంవత్సరం మధ్యలో తీసుకోవడం వెనక ఏం మతలబు ఉందని ప్రశ్నిస్తున్నారు. ఒక ఏడాది లబ్ధిని ఈ పరిపాలనా కాలం నుంచి తప్పించడమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమ్మ ఒడి సాయం అందాలంటే ఇకపై 75శాతం హాజరు తప్పనిసరి అని ముఖ్యమంత్రి చెప్పారు. వాస్తవానికి గతంలోనే ఈ నిబంధన ఉన్నా కొవిడ్‌ కారణంగా అమలుచేయడం సాధ్యం కాలేదు. ఈ ఏడాది చదువుతున్న వారికి కూడా 75శాతం హాజరుచూస్తారు. సాధారణంగా విద్యార్థుల హాజరు 75శాతానికి తగ్గదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-19T15:20:22+05:30 IST