అమ్మఒడిలో సర్కారు నొక్కుడు

ABN , First Publish Date - 2022-05-24T06:53:17+05:30 IST

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చుల పేరిట ప్రభుత్వం ‘అమ్మఒడి’లో కోత విధిస్తోంది.

అమ్మఒడిలో సర్కారు నొక్కుడు

ఈ ఏడాది మినహాయింపు రూ.2 వేలు 

మరుగుదొడ్ల నిర్వహణ కోసమంటూ గత ఏడాది రూ.1000 కోత

అందులోనే బోలెడు మిగులు...

అది చాలదన్నట్టు మళ్లీ ఈ ఏడాది మరో రూ.వెయ్యి

విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి

తమకు ఇచ్చే డబ్బుల్లో టాయ్‌లెట్ల కోసం కోత విధించడమేమిటంటూ ప్రశ్నలు 

ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,10,004 మంది విద్యార్థులు

గత ఏడాది రూ.41 కోట్లు, ఈ ఏడాది సుమారు రూ.80 కోట్లు కోత


(విశాఖపట్నం, ఆరిలోవ, అనకాపల్లి, అరకులోయ-ఆంధ్రజ్యోతి)

పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ ఖర్చుల పేరిట ప్రభుత్వం ‘అమ్మఒడి’లో కోత విధిస్తోంది. విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేయాల్సిన రూ.15 వేలలో గత ఏడాది రూ.వెయ్యి మినహాయించుకున్న ప్రభుత్వం...ఈ దఫా రూ.రెండు వేలు కోత విధించనున్నట్టు ప్రకటించింది. ఈ నిధులను టాయ్‌లెట్లు శుభ్రం చేసేందుకు వినియోగించే ఫినాయిల్‌, బ్రష్‌లు, ఇతర సామగ్రి కొనుగోలుకు, ఆయాలకు వేతనాల కోసం వెచ్చిస్తామని చెబుతుండడంపై విద్యార్థుల తల్లులు మండిపడుతున్నారు. పాఠశాలల్లో టాయ్‌లెట్ల నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని...దానికి అమ్మఒడితో ఎలా ముడి పెడతారని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది రూ.1000 మినహాయించుకున్న ప్రభుత్వం, ఈ ఏడాది మరో వెయ్యికి ఎసరు పెట్టిందని భగ్గుమంటున్నారు. ఈ విధంగా ఒక్క ఉమ్మడి విశాఖ జిల్లాలో తల్లుల ఖాతాలకు జమ చేయాల్సిన నిధుల నుంచి ఏకంగా రూ.80 కోట్ల వరకు ప్రభుత్వం తీసుకోనున్నది. 

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఇప్పటివరకు మూడు విద్యా సంవత్సరాలు పూర్తి కాగా రెండుసార్లు మాత్రమే అమ్మఒడి ఇచ్చింది. తొలి ఏడాది తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమచేసినా టాయలెట్ల నిర్వహణకు రూ.1000 ఇవ్వాలని సీఎం జగన్‌ పిలుపు మేరకు విశాఖ జిల్లాలో రూ.1.2 కోట్ల వరకు  వెనక్కి తీసుకున్నారు. గత ఏడాది ప్రభుత్వమే అమ్మఒడి సొమ్ముల నుంచి వెయ్యి రూపాయల చొప్పున రూ.41 కోట్లు మినహాయించుకుంది. ఈ ఏడాది రూ.రెండు వేల వంతున రూ.80 కోట్ల వరకు తీసుకోనున్నది. 

గత ఏడాది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 4,10,004 మందికి అమ్మఒడి పథకం వచ్చింది. ప్రతి తల్లి ఖాతాకు రూ.14 వేలు వంతున రూ.574 కోట్లు జమ చేశారు. టాయ్‌లెట్ల నిర్వహణ పేరిట గత ఏడాది ప్రతి ఖాతా నుంచి రూ.1000 చొప్పున రూ.41 కోట్లు ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది. ఈ నిధులు జిల్లా విద్యాశాఖాధికారి ఖాతాలో కాకుండా ప్రభుత్వ ఖాతాలో ఉండడం కొసమెరుపు. కాగా టాయ్‌లెట్ల నిర్వహణ కోసం ప్రతి పాఠశాలకు ఫినాయిల్‌, యాసిడ్‌, బ్రష్‌లు, ఎయిర్‌ ఫ్రెషనర్లు, మగ్‌లు, డస్ట్‌ బిన్లు, ఆయాకు సేఫ్టీ జాకెట్‌ ప్రభుత్వం సరఫరా చేయగా ప్రధానోపాధ్యాయులు చీపుళ్లు...స్థానికంగా కొనుగోలు చేశారు. టాయ్‌లెట్ల నిర్వహణ కోసం 300 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించుకునే అఽధికారం ఇచ్చారు. ఆమెకు నెలకు రూ.ఆరు వేల గౌరవవేతనం ఇస్తున్నారు. ఏడాదిలో పది నెలలకు మాత్రమే నెలకు రూ.ఆరు వేల వంతున మొత్తం రూ.60 వేలు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,680 మంది ఆయాలు పనిచేస్తున్నారు. వీరికి పది నెలలకు రూ.60 వేలు వంతున 3,680 మందికి రూ.22.08 కోట్లు వెచ్చించారు. ఇంకా ఫినాయిల్‌, బ్రష్‌లు, యాసిడ్‌కు కలిపి రూ.ఐదారు కోట్లు ఖర్చు అవుతుందని భావించినా జిల్లాలో గత ఏడాది అమ్మఒడి నుంచి తీసుకున్న రూ.41 కోట్లలో రూ.12 కోట్లు వరకు ప్రభుత్వానికి మిగులుతుంది. అదే నుంచి రూ.2 వేలు తీసుకుంటే రూ.50 కోట్ల వరకు మిగలనున్నది. 


అరకులోయ పాఠశాలలో రూ.ఐదు లక్షల కోత

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 255 మంది విద్యార్థులు ఉండగా గత ఏడాది 250 మంది అమ్మఒడికి అర్హత సాధించారు. ఈ లెక్కన 250 మంది నుంచి ప్రభుత్వం రూ.1000 వంతున రూ.2.5 లక్షలు టాయ్‌లెట్ల నిర్వహణకు తీసుకుంది. ఈ పాఠశాలలో ఒక్కరే ఆయా ఉన్నారు. ఆమెకు నెలకు రూ.6 వేల చొప్పున పది నెలలకు రూ.60 వేలు గౌరవ వేతనం కింద ఇచ్చారు. ఫినాయిల్‌, బ్రష్‌లు, యాసిడ్‌ ప్రభుత్వం సరఫరా చేసింది. దీనికి రూ.40 వేలు వెచ్చించి ఉంటారునుకున్నా...ఈ పాఠశాల విద్యార్థుల నుంచి తీసుకున్న రూ.2.5 లక్షల్లో రూ.1.5 లక్షలు ప్రభుత్వానికి మిగిలి ఉంటుంది. అదే ఈ ఏడాది టాయ్‌లెట్ల నిర్వహణకు రూ.2 వేలు తీసుకుంటే రూ.నాలుగు లక్షల వరకూ మిగలనున్నది. 


మామిడిపాలెం ఉన్నత పాఠశాలలో...

అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి మండలం మామిడిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 636 మంది విద్యార్థులు ఉండగా 350 మంది గత ఏడాది అమ్మఒడికి అర్హత సాధించారు. వీరి నుంచి టాయ్‌లెట్ల నిర్వహణకు రూ.3.5 లక్షలు ప్రభుత్వం తీసుకుంది. ఈ పాఠశాలలో ముగ్గురు ఆయాలు ఉన్నారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.1.8 లక్షలు కేటాయించారు. టాయ్‌లెట్ల నిర్వహణకు ఫినాయిల్‌, యాసిడ్‌, ఎయిర్‌ ఫ్రెషనర్లు, బ్రష్‌లు, మగ్‌లు, ఇతర సామగ్రి ప్రభుత్వం అందజేసింది. అందుకు రూ.లక్ష వరకు వెచ్చించినా...ఇంకా ఈ పాఠశాల నుంచి దాదాపు రూ.70 వేలు మిగులుంది. అదే రూ.2 వేలు తీసుకుంటే మరో రూ.3.5 లక్షలకుపైగా ప్రభుత్వ ఖాతాకు జమ కానున్నది.


తోటగరువులో గత ఏడాది రూ.16 లక్షలు జమ

నగరంలోని ఆరిలోవ ప్రాంతంలో తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గత ఏడాది రెండు వేల మంది విద్యార్థులు ఉండగా వారిలో సుమారు 1,600 మందికి అమ్మఒడి అందింది. వెయ్యి రూపాయల చొప్పున టాయ్‌లెట్ల నిర్వహణ కోసం రూ.16 లక్షలు ప్రభుత్వం తీసుకుంది. ఇక్కడ నలుగురు ఆయాలు ఉండగా వారికి ఏడాదికి పది నెలలకు రూ.60 వేలు వంతున రూ.2.4 లక్షలు ఖర్చుచేసింది. టాయలెట్ల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన సామగ్రి విలువ కనీసం మూడు లక్షల రూపాయలు వుంటుందని అనుకుందాం. ఆయాల జీతం, సామగ్రి ఖర్చు కలిసి రూ.5.4 లక్షలగా ఖర్చయిందనుకున్నా...ఇంకా పది లక్షల వరకు మిగులుతుంది. అదే ఈ ఏడాది రూ.రెండు వేలు తీసుకుంటే ఎంత మిగులుతుందో చెప్పనక్కర్లేదు.  

Updated Date - 2022-05-24T06:53:17+05:30 IST