అమ్మఒడి.. ఆంక్షల అలజడి !

ABN , First Publish Date - 2022-04-19T05:32:14+05:30 IST

జిల్లాలో 2021 - 22 విద్యా సంవత్సరానికి అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థిని, విద్యార్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

అమ్మఒడి.. ఆంక్షల అలజడి !


వడపోతకు ప్రభుత్వం కసరత్తు

నిబంధనలు కఠినతరం

తల్లిదండ్రుల ఆందోళన

తగ్గనున్న లబ్ధిదారుల సంఖ్య


సీతారామపురం, ఏప్రిల్‌ 18 : జిల్లాలో 2021 - 22 విద్యా సంవత్సరానికి అమ్మఒడి పథకానికి  అర్హులైన విద్యార్థిని, విద్యార్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.  లబ్ధిదారుల్లో కోత విధించేందుకే ప్రభుత్వం ఇలా చేసిందన్న విమర్శలున్నాయి. పేద విద్యార్థులకు చేయూతతోపాటు, బడి బయట పిల్లలను పాఠశాల వైపు మక్కువ చూపేలా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల అమల్లో భాగంగా 2019 - 20 విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. ఏటా ఒకటి నుంచి ఇంటర్‌ వరకు అర్హత కలిగిన విద్యార్థుల తల్లి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాకు నేరుగా రూ. 15వేల చొప్పున జమ చేయనున్నట్లు ప్రకటించింది. తొలి ఏడాది రూ. 15వేలు ఇవ్వగా, రెండో ఏడాది రూ. 14వేల చొప్పున జమ చేసింది. మినహాయించిన రూ. 1000 నగదును పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు తల్లిదండ్రుల కమిటీల ఖాతాలకు జమ  చేసింది.  రెండేళ్లుగా ఈ పథకం కింద లక్షలాది మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు కొన్ని వందల కోట్ల నగదును ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి అమ్మఒడి నగదు జూన్‌లో ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా ప్రకటించిన నిబంధనలు లబ్ధిదారులకు ప్రతిబంధకాలుగా మారాయి. 


మారిన నిబంధనలతో ఆందోళన 

జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరువేలకు పైగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో 2021 - 22 విద్యా సంవత్సరానికిగాను నాలుగు లక్షలకుపైగానే విద్యార్ధులున్నారు. గతంలో మాదిరే ఒక తల్లికి చెందిన ఇద్దరు పిల్లలు ఇంటర్‌లోపు చదువుతుంటే, వారిలో ఒకరికే లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు ఆరంచెల విధానం కింద నాలుగు చక్రాల వాహనం ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, ఆరు నెలలకు కలిపి సరాసరి విద్యుత్‌ మీటరు రీడింగ్‌ 300 యూనిట్లు దాటినా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, పట్టణ ప్రాంతంలో ఇంటి నిర్మాణంతోపాటు ఖాళీ స్ధల విస్తీర్ణం 1,000 చదరపు అడుగులపైన ఉన్నా అమ్మఒడికి అనర్హులే. ఇప్పుడు వీటికితోడు కొత్త బియ్యం కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇక గత నవంబరు ఒకటి  నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి. నెలకు విద్యుత్‌ రీడింగ్‌ 300 యూనిట్లు దాటకూడదు. విద్యార్ధి, తల్లి ఒకే కుటుంబంలో మ్యాపింగ్‌ అయి ఉండటంతోపాటు, ఆధార్‌కు సెల్‌ఫోన్‌ నెంబరు అనుసంధానమై ఉండాలి.


సమస్యల సంగతేమిటి ? 

 రెండు నెలలుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోతను తట్టుకోవడానికి నిత్యం ఫ్యాన్లు, కూలర్లు వాడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ తరుణంలో నెలకు 300 యూనిట్లు దాటే అవకాశం ఉంది. దీంతో అమ్మఒడి పథకానికి అర్హత కోల్పోయే అవకాశం ఉంది. సరాసరి చూడటం అనేది నెలకా.. ఆరు నెలలకా ? అనే దానిపై ఉపాధ్యాయులకు, అధికారులకు స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా మూడోదశ ఉధృతి వల్ల ఎక్కువ శాతం విద్యార్ధులు  పాఠశాలలకు వెళ్లలేదు. ఆ సమయంలో హాజరు శాతం తగ్గింది. విద్యార్ధి ఈకేవైసీ చేయించుకోవాలన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా పథకానికి దూరం కానున్నారు. ఏదిఏమైనా అమ్మఒడికి తాజాగా పలు నిబంధనలు అమలు చేస్తుండటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-04-19T05:32:14+05:30 IST