రూ.75 కోట్లు.. ఏమాయె?

ABN , First Publish Date - 2022-08-04T05:13:49+05:30 IST

పాఠశాలల అభివృద్ధి పేరిట అమ్మఒడికి కన్నం వేసిన ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని పాఠశాలలకు ఇవ్వకుండా సున్నం పెడుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

రూ.75 కోట్లు.. ఏమాయె?
గుంటూరు నగరంలోని ఓ పాఠశాలలోని మరుగుదొడ్ల దుస్థితి

వారికీ ఇవ్వలేదు.. వీరికీ చేరలేదు..

పాఠశాలల అభివృద్ధి పేరిట అమ్మఒడిలో రూ.2 వేలు కట్‌

మూడు జిల్లాల్లో రూ.75 కోట్లు కోత

నెలరోజులైనా పాఠశాలలకు చేరని నిధులు

కోత పెట్టిన నగదు ఏమైనట్లు?


పాఠశాలల అభివృద్ధి పేరిట అమ్మఒడికి కన్నం వేసిన ప్రభుత్వం... ఆ మొత్తాన్ని పాఠశాలలకు ఇవ్వకుండా సున్నం పెడుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమ్మఒడి విడుదలై ఇప్పటికి రెండునెలలు కావస్తున్నా పాఠశాలలకు ఇచ్చేందుకని మిగుల్చుకున్న రూ.రెండు వేలు మాత్రం పాఠశాలలకు చేరలేదు. మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేక సతమతమవుతున్న పాఠశాలలు ఆ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. కాగా పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి కోసం కేటాయిస్తామన్న ఆ నిధులు ఇటు తల్లుల, అటు కళాశాలలకు ఎవరికీ దక్కక పోవడంతో, ఆ నిధులు ఏమయ్యాయనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.

   

గుంటూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల అభివృద్ధి పేరిట అమ్మఒడికి కన్నం వేసిన ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని పాఠశాలలకు ఇవ్వకుండా సున్నం పెడుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అమ్మఒడి విడుదలై ఇప్పటికి రెండునెలలు కావస్తున్నా పాఠశాలలకు ఇచ్చేందుకని మిగుల్చుకున్న రూ.రెండువేలు మాత్రం పాఠశాలలకు చేరలేదు. మరుగుదొడ్లు, మౌలిక వసతులు లేక సతమతమవుతున్న పాఠశాలలు ఆ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. కాగా పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి కోసం కేటాయిస్తామన్న ఆ నిధులు ఇటు తల్లుల, అటు కళాశాలలకు ఎవరికీ దక్కక పోవడంతో, ఆ నిధులు ఏమయ్యాయనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది.

 

 తల్లులకు రూ.75.2 కోట్లు కోత

సంక్షేమ పథకాల్లో కోత పెట్టి భారం తగ్గించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం ఒక్కో పథకానికి ఒక్కో రూపంలో చిల్లు వేస్తోంది. పాఠశాలల అభివృద్ధి నిధి పేరిట అమ్మఒడి పథకంలో కూడా కోత పెట్టింది. పిల్లలను చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు అమ్మఒడి ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.13 వేలు మాత్రమే ఇచ్చింది. ఆ కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3లక్షల 76 వేల మంది తల్లులు రూ.రెండువేలు చొప్పున నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని విద్యార్థుల తల్లులు రూ.75.2 కోట్ల మేర నష్టపోయారు.  


 ఎదురు చూస్తున్న విద్యాసంస్థలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4,925 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, 500 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6లక్షల 98 వేల మంది బాలబాలికలు చదువుకుంటున్నారు. వీటితోపాటు 117 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు జూనియర్‌ కళశాలలు ఉన్నాయి. వీటిలో 43,345 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను మినహాయించినా జిల్లాలో ఉన్న ఐదువేల పైచిలుకు పాఠశాలలకు ఈ నిధులు వెళ్లాల్సి ఉంది. ఇప్పటివరకూ నిధులు రాకపోవడంతో ఆయా విద్యాసంస్థలు కనీస మరమ్మతులు కూడా చేయలేని స్థితికి చేరాయి. 


 ఆది నుంచి కోతల పర్వం.. 

ఆది నుంచి అమ్మఒడికి ప్రభుత్వం కోతలు పెడుతూనే వస్తోంది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇవ్వాల్సిన అమ్మఒడిని ఒక బిడ్డకే పరిమితం చేసింది. ఫలితంగా సగంమంది పిల్లలకు అమ్మఒడి దూరమైంది. 2019- 20 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 7లక్షల మంది విద్యార్థులు ఉండగా వారిలో 4లక్షల 53 వేల మందికే అమ్మఒడి దక్కింది. అందులోనూ వెయ్యి రూపాయల చొప్పున పాఠశాల అభవృద్ధి నిధి పేరిట కోత పెట్టింది. తొలి రెండేళ్లు ప్రతి తల్లికి వెయ్యి రూపాయలు కోత పెట్టిన ప్రభుత్వం, ఈ ఏడాది మాత్రం కోతను రెట్టింపు చేసింది. విద్యా సంవత్సరం ముగిసే వరకూ పథకాన్ని వాయిదా వేయడం ద్వారా ఒక ఏడాది అమ్మఒడికి డుమ్మా కొట్టింది. ఈ ఏడాది నిబంధనల వడపోతతో లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించింది. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదని, 75 శాతానికి మించి హాజరు ఉండాలని, తల్లిదండ్రులు, పిల్లలు ఒకే చోట ఉండాలని రకరకాల నిబంధనలు పెట్టి ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్యను లక్షకుపైగా తగ్గించారు. కిందటేడాది జిల్లాలో 4.5 లక్షల మందికి అమ్మఒడి రాగా ఈ ఏడాది చీరాల డివిజన్‌తో కలుపుకొని మూడు జిల్లాల్లో 3.76 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి దక్కింది. అందులోనూ కోత పెట్టడం, విద్యాసంస్థలకు ఆ నగదును కేటాయించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

Updated Date - 2022-08-04T05:13:49+05:30 IST