అమ్మ.. చెట్టు

ABN , First Publish Date - 2022-05-17T05:18:35+05:30 IST

వేరే స్థలంలో అమ్మ నాటిన చెట్టును తన జ్ఞాపకంగా, అమ్మ సమాధి వద్ద నాటించి తల్లిపై మమకారాన్ని చాటుకున్నాడు ఓ తనయుడు.

అమ్మ.. చెట్టు
తల్లి అంత్యక్రియలు జరిగిన చోట ఎక్స్‌కవేటర్‌ సహాయంతో గుంతను తవ్వి నాటిన మామిడి వృక్షం

25 ఏళ్ల క్రితం తల్లి నాటిన చెట్టును ఆమె సమాధి వద్ద నాటించిన తనయుడు

ఏడాది క్రితం కరోనాతో చనిపోయిన తల్లి

సిద్దిపేట పట్టణంలో ఓ న్యాయవాది మమకారం

సిద్దిపేట టౌన్‌, మే 16: వేరే స్థలంలో అమ్మ నాటిన చెట్టును తన జ్ఞాపకంగా, అమ్మ సమాధి వద్ద నాటించి తల్లిపై మమకారాన్ని చాటుకున్నాడు ఓ తనయుడు. సిద్దిపేట పట్టణం, రాఘవేంద్రనగర్‌కు చెందిన గన్నమనేని బాలకిషన్‌రావు, రాధ దంపతుల కుమారుడు కిరణ్‌కుమార్‌ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. రాధ గతేడాది కరోనాతో మృతి చెందగా, సిద్దిపేట అర్బన్‌ మండలం, బూరుగుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రాధ 25 ఏళ్ల కిందట ఎంతో ఇష్టంతో ఓ మామిడి మొక్కను ఒక ప్రాంతంలో నాటి సంరక్షించారు. అది వృక్షమై ఫలాలను అందిస్తోంది. తన తల్లికి ఎంతో ఇష్టమైన మామిడి వృక్షాన్ని కిరణ్‌కుమార్‌ సోమవారం శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలు కత్తిరించి యంత్ర సాయంతో వెలికి తీయించారు. ట్రాక్టర్‌లో తరలించి, తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన చోట గుంతను తవ్వించి నాటించారు. అమ్మకు ఇష్టమైన చెట్టును ఆమె అంత్యక్రియలు నిర్వహించిన చోట ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఆ చెట్టులోనే అమ్మను చూసుకుంటానని కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-05-17T05:18:35+05:30 IST