ర్యాకుల్లో మగ్గిపోతున్న అమ్మవారి చీరలు

ABN , First Publish Date - 2022-06-23T04:32:57+05:30 IST

నడిగడ్డ భక్తుల ఇలవేల్పుగా పిలిచే జములమ్మ అమ్మవారికి భక్తులు ఇచ్చే చీరలను వేలం వేయడంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ర్యాకుల్లో మగ్గిపోతున్న అమ్మవారి చీరలు
ర్యాక్‌లలో నిల్వ ఉంచిన అమ్మవారి చీరలు

- వేలం వేయడంలో జములమ్మ ఆలయ అధికారుల నిర్లక్ష్యం

- వేలం ద్వారా రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం

- ఏరువాక పౌర్ణమి వరకే ఆలయానికి భక్తుల తాకిడి

- ఆ తర్వాత తగ్గుదల


గద్వాల, జూన్‌ 22: నడిగడ్డ భక్తుల ఇలవేల్పుగా పిలిచే జములమ్మ అమ్మవారికి భక్తులు ఇచ్చే చీరలను వేలం వేయడంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంతో చీరలన్నీ ర్యాకుల్లో మగ్గిపోతున్నాయి. అమ్మవారికి పెట్టే నైవేద్యంలో చీర, జాకెట్‌ ప్రధానమైనవి. రోజూ అమ్మవారిని భక్తులు సమర్పించే చీరల ద్వారానే అలంకరిస్తారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి అలంకరణ కోసం భక్తులు పోటీ పడతారు. ప్రతీ వారం అమ్మవారి అలంకరణలో ఐదు నుంచి ఎనిమిది చీరల వరకు వినియోగిస్తారు. మిగిలిన చీరలు ఇతర రోజులలో అలంకరణకు వినియోగిస్తారు. ప్రస్తుతం అమ్మవారికి నైవేద్యం పెట్టే చీరలను భక్తుల స్థాయిని బట్టి రూ.500ల నుంచి రూ.5,000 విలువైన చీరలను సమర్పిస్తారు. ఎక్కువ ధర ఉన్న చీరలను రశీదుతో పాటు ఒకవైపు, తక్కువ ధర ఉన్న చీరలను రశీదు లేకుండా మరోవైపు ఆలయ అధికారులు భద్రపరుస్తున్నారు.


వేలం వేయడంలో అధికారుల మీనమేషాలు

అమ్మవారి ఆలయాల్లో దేవతలకు కానుకగా సమర్పించిన చీరలను ఎండోమెంటు అధికారులు వేలం వేసి, భక్తులకు విక్రయిస్తారు. భక్తులు కూడా అమ్మవారి అలంకరణలో వాడిన చీరలను ఇష్టంతో తీసుకుంటారు. ఇందుకోసం పోటీపడి, ఎక్కువ ధరలు చెల్లించిన సందర్భాలూ జోగుళాంబ ఆలయంలో ఉన్నాయి. అక్కడ ఏటా చీరల వేలం ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుంది. జములమ్మ ఆలయంలో కూడా గత ఏడాది చీరలను వేలం వేశారు. అయితే ఎంత ఆదాయం వచ్చిందనేది అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు ఎందుకు చీరలను వేలం వేయలేదో అర్థం కావడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.


5 వేలకుపైగా చీరలు

ఈ ఏడాది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చీరలను ర్యాకులలో భద్రపరిచారు. ఇందులో దాదాపు మూడు వేల చీరలు రూ.500ల నుంచి రూ.5,000 విలువైనవి ఉండగా మరో రెండు వేలకుపైగా చీరలు తక్కువ ధరవి ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు వేలం వేయలేదు. ఏరువాక పౌర్ణమి వరకే అమ్మవారు ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత తల్లిగారు గ్రామమైన గుర్రంగడ్డకు వెళ్లిపోతారనే నానుడి భక్తులలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి డిసెంబరు వరకు భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోతుంది. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో ఉన్న వారాలలో చీరల వేలం నిర్వహించి ఉంటే ఆలయానికి రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చి ఉండేది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని కర్పూరంలా ఖర్చులు చేస్తున్న అధికారులు, ఆలయానికి ఆదాయం వచ్చే వియాలపై ఎందుకు దృష్టి పెట్టం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








Updated Date - 2022-06-23T04:32:57+05:30 IST