అమ్మా రాణీ.. నేనూ వస్తున్నా..!

ABN , First Publish Date - 2022-01-26T05:15:08+05:30 IST

రాణి అంటే నాన్నమ్మకు ఎంతో ప్రాణం. తాను పుట్టినప్పటి నుంచి అన్నీ తానైంది. గోరు ముద్దలు తినిపించింది. కథలు చెప్పింది.

అమ్మా రాణీ.. నేనూ వస్తున్నా..!
మృతి చెందిన లక్ష్మమ్మ


 రాణి అంటే నాన్నమ్మకు ఎంతో ప్రాణం. తాను పుట్టినప్పటి నుంచి అన్నీ తానైంది. గోరు ముద్దలు తినిపించింది. కథలు చెప్పింది. కంటికి రెప్పలా చూసుకుంది. నాన్నమ్మ చేతు ల్లో పెరిగి పెద్దదైన తనకు ఇప్పుడు 17 ఏళ్లు. అయినా.. నాన్నమ్మకు రాణి ఇంకా పసిపాపే. వారం క్రితం పొలం పనులకు వెళ్లిన సమయంలో రాణిని ఓ పాము కాటు వేసింది. దీంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అన్నారు. నాన్నమ్మకు ముద్ద దిగలేదు. తన మనవరాలి ప్రాణాలు నిలబడాలని ఎందరో దేవుళ్లను వేడుకుంది. తన ప్రార్థనలు ఫలించలేదు. పరిస్థితి చేయిదాటి పోయింది. రాణి సోమవారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలియగానే నాన్నమ్మ గుండె పగిలింది. భోరున విలపిస్తూ అక్కడే కుప్పకూలింది. అందరూ సొమ్మసిల్లింది అనుకున్నారు. కానీ తను మనవరాలి వెంట వెళ్లింది. తను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. నాన్నమ్మ పేరు వెంకట లక్ష్మమ్మ. తన వయసు 66 ఏళ్లు. వీరిది గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామం. నాన్నమ్మ, మనవరాలి మరణం ఆ ఊరిలో అంతులేని విషాదాన్ని నింపింది.     

- గడివేముల





Updated Date - 2022-01-26T05:15:08+05:30 IST