అమ్మ ఒడి.. ఆంక్షల ముడి...!

ABN , First Publish Date - 2022-04-27T05:54:48+05:30 IST

అమ్మఒడి పథకం పెద్ద చిక్కుముడిగా మారింది. ప్రభుత్వం కొత్తగా పెట్టిన ఆంక్షలు పెద్ద ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో అమ్మఒడి వస్తుందా.. లేదా అని అయోమయ పరిస్థితుల్లో తల్లులు ఆందోళన చెందుతున్నారు. అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి లబ్ధిదారులకు జూన్‌లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు రూపొందించిన నిబంధనలు తమకు ప్రతిబంధకాలుగా మారేలా ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల అమలు పై అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.

అమ్మ ఒడి.. ఆంక్షల ముడి...!

ప్రతిబంధకాలుగా మారిన ప్రభుత్వ నిబంధనలు 

అయోమయ పరిస్థితిలో తల్లులు

కడప(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 26: అమ్మఒడి పథకం పెద్ద చిక్కుముడిగా మారింది.  ప్రభుత్వం కొత్తగా పెట్టిన ఆంక్షలు పెద్ద ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో అమ్మఒడి వస్తుందా.. లేదా అని అయోమయ పరిస్థితుల్లో తల్లులు ఆందోళన చెందుతున్నారు. అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి లబ్ధిదారులకు జూన్‌లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు రూపొందించిన నిబంధనలు తమకు ప్రతిబంధకాలుగా మారేలా ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనల అమలు పై అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.


ఇలా మొదలు

ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో బడి మానేయకూడదనే లక్ష్యంతో 2019 -20 విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్హులైన తల్లుల ఖాతాలకు రూ.15 వేల చొప్పున జమ చేశారు. 2020-21లో రూ.వెయ్యి తగ్గించి రూ.14 వేలు జమ చేశారు. మినహాయించిన రూ.1000 పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఖాతాలకు వేశారు. గత రెండేళ్లగా ఉమ్మడి జిల్లాలో 2,68,076 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఏడాదికి రూ.402.11 కోట్లు జమ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9 నుంచి ఇంటర్‌ విద్యార్థుల్లో అప్షన్లు ఇచ్చిన వారికి నగదు బదులు ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని భావించినా ఈసారి నగదు ఇస్తారని సమాచారం.


ఇవీ నిబంధనలు

నవంబర్‌ 1 నుంచి ఏప్రిల్‌ ఆఖరు వరకు 75 శాతం హాజరు తప్పనిసరి, బియ్యం కార్డు కొత్తది కావాలి. కరెంట్‌ బిల్లు నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. విద్యార్థి, తల్లి ఒకే హౌస్‌హోల్ద్‌ మ్యాపింగ్‌ ఉండాలి. విద్యార్థి ఈకేవైసీ అప్టేడ్‌ చేయాలి. సదరు వలంటీరు వద్ద విద్యార్థి తల్లిపేరు, వయసు సరి చూడాలి. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌ అయిందో లేదో చూడాలి. ఆధార్‌ నెంబర్‌తో వాడే సెల్‌ నెంబర్‌ లింకై ఉండాలి. బ్యాంకు  ఖాతా మనుగడలో ఉంచాలి. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎన్‌పీసీఐ చేయించాలి. 


గ్రామీణులకు ప్రశ్నార్థకమే

ఇన్ని నిబంధనలు గ్రామీణ నిరక్షరాస్యులు అధిగమించగలరా అనేది ప్రశ్నార్థకమే. పైగా విద్యార్థి వివరాలన్నీ కూడా సీఎస్సీ వెబ్‌సైట్‌లో చైల్డ్‌ ఇన్ఫోలో డేటాతో సరిపోవాలి. పాఠశాల రిజిస్టర్‌లో ప్రధానోపాధ్యాయుల లాగిన్లో ఉన్న తల్లిఖాతా, సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఒకటైనప్పుడు వారికి ఓటీపీ వస్తుంది. దాన్ని ప్రధానోపాధ్యాయులు వారి లాగిన్లో నమోదు చేస్తారు. అప్పుడే వారి ఖాతాకు అమ్మఒడి నగదు జమ అవుతుంది. ఈ నిబంధనలన్నీ లబ్ధిదారుల జాబితాను తగ్గించేందుకే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఇలా అయితే అమ్మవడి వర్తించదు

- కరెంట్‌ బిల్లు 300 యూనిట్లు పైబడి ఉంటే

- 10 ఎకరాల పైబడి భూమి ఉంటే 

- ఎక్కువ రోజులు పాఠశాలకు హాజరు కాకున్నా

- రేషన్‌ కార్డు నెంబర్‌, అకౌంట్‌ నెంబరు సరిపోకుంటే 

- 4 చక్రాల వాహనం ఉంటే

- విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పుగా ఉంటే 

- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ దారులు అయితే

- గ్రామంలో నివాసం లేకుంటే

- ఇతర ప్రాంతాలకు వలస పోయి ఉంటే 

- మరణించి ఉంటే

- అవసరమైన వివరాలు వలంటీరుకు చూపించకుంటే 

- ఆదాయం పన్ను చెల్లించే వారు


ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాబితా : డీఈవో 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివరాలు కచ్చితంగా ఉన్న వాటికి మాత్రమే జాబితా రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాలను ప్రధానోపాధ్యాయులకు పంపిస్తున్నాం. మార్గదర్శకాలపై తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో విద్యార్థులు, తల్లుల సమాచారం కరెక్ట్‌గా ఉండాలి. వలంటీర్లు వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వివరాలు కూడా కచ్చితంగా ఉండాలి. అన్లైన్లో తల్లిదండ్రులు తప్పనిసరిగా నమోదు చేసిన వాటికి మాత్రమే అమ్మ ఒడి వర్తిస్తుంది. 

Updated Date - 2022-04-27T05:54:48+05:30 IST