అమ్మఒడి డబ్బు.. అప్పునకు జమ

ABN , First Publish Date - 2020-02-22T09:38:40+05:30 IST

అమ్మఒడి కింద తల్లులకిచ్చే డబ్బును బ్యాంకులు తమ అప్పుల కింద జమ కట్టుకోకుండా చేస్తామని సీఎం జగన్‌ పదేపదే చెప్పారు. కానీ కొన్నిచోట్ల తద్విరుద్ధంగా జరుగుతోంది.

అమ్మఒడి డబ్బు.. అప్పునకు జమ

డోన్‌, ఫిబ్రవరి 21: అమ్మఒడి కింద తల్లులకిచ్చే డబ్బును బ్యాంకులు తమ అప్పుల కింద జమ కట్టుకోకుండా చేస్తామని సీఎం జగన్‌ పదేపదే చెప్పారు. కానీ కొన్నిచోట్ల తద్విరుద్ధంగా జరుగుతోంది. ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా డోన్‌లో ఓ విద్యార్థిని జేజమ్మ ఖాతాలో వేసి న సొమ్మును ఆ బ్యాంకు అధికారులు తమ రుణం కింద జమ వేసుకున్నారు. డోన్‌లోని ఇందిరానగర్‌లో చిన్నపెంకుటింట్లో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఆమె కొడుకు మల్లేష్‌, కోడలు రామాంజనమ్మకు రామేశ్వరి అనే కుమార్తె ఉంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో రామేశ్వరి.. నాయనమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. అమ్మఒడి కోసం నాయనమ్మ బ్యాంకు ఖాతా ఇచ్చింది. పట్టణంలోని ఎస్‌బీఐ శాఖలో ఆమెఖాతాలో అమ్మఒడి సొమ్ము రూ.15 వేలు జమయింది. అయి తే నాగలక్ష్మికి బ్యాంకులో ముద్ర రుణం ఉందంటూ అధికారులు దాన్ని అప్పు కింద జమ వేసుకున్నారు. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనికరం చూపడం లేదు.

Updated Date - 2020-02-22T09:38:40+05:30 IST