అమ్మ దూరమై.. భవిత శూన్యమై!

ABN , First Publish Date - 2022-05-04T06:01:07+05:30 IST

అన్నీ తానై పెంచుతున్న అమ్మ దూరమై... నా అనే వారు లేక ఆ చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలారు. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక తల్లడిల్లుతున్నారు

అమ్మ దూరమై.. భవిత శూన్యమై!
తల్లి మృతదేహం వద్ద చిన్నారులు (ఫైల్‌)

పాణ్యం, మే 3 : అన్నీ తానై పెంచుతున్న అమ్మ దూరమై... నా అనే వారు లేక ఆ చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలారు. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక తల్లడిల్లుతున్నారు. ఇదీ పాణ్యం గ్రామం తెలుగుపేటకు చెందిన సాయితేజ, కార్తికేయల  కన్నీటిగాథ. తెలుగుపేటకు చెందిన సల్కాపురం సునీత, సుబ్రహ్మణ్యం దంపతులకు సాయితేజ(13), కార్తీకేయ (11) ఇద్దరు కుమారులు. సుబ్రహ్మణ్యం రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లల నాయనమ్మ రంగమ్మ రెండునెలల క్రితం మృతి చెందింది. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లి సునీత (39)సోమవారం కన్నుమూసింది. సాయితేజ సుగాలిమెట్టలోని మోడల్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కార్తికేయ పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. వీరికి ఇల్లు తప్ప వేరే ఆస్తులు లేవు. తల్లి మృతదేహం పక్కన కూర్చొని ఏడుస్తున్న పిల్లల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. సమీప బంధువులు సునీత మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక సాగునీటి సంఘ నాయకుడు గుర్రం బాలన్న పిల్లలకు రూ.5 వేలు, వైసీపీ నాయకుడు కరుణాకరరెడ్డి రూ.6 వేలు అందజేశారు. వైఎస్సార్‌ బీమా వర్తించదని సచివాలయ వెల్ఫేర్‌ అధికారి సబినా పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులకు బీమా వర్తింపజేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి : చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలి. పిల్లల చదువుకు, రోజువారీ అవసరాలకు ఆర్థిక సాయం చేయాలి. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి చిన్నారులకు రూ. 5 లక్షలు అందించాలి. 

  -రంగరమేష్‌, ఎంపీటీసీ, పాణ్యం 

Read more