విశాఖ ఉక్కుపై అమీతుమీ

ABN , First Publish Date - 2021-07-22T08:31:44+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం దిశలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ అమ్మకానికి న్యాయపరమైన చిక్కులు రాకుండా...

విశాఖ ఉక్కుపై అమీతుమీ

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం దిశలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ అమ్మకానికి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడడానికి న్యాయ సలహాదారు, అమ్మక ప్రక్రియను పూర్తిచేయడానికి అమ్మకం సలహాదారు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రప్రభుత్వం ఈ నెల ఏడవ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనితో తెలుగు ప్రజల తీవ్ర వ్యతిరేకతను కూడా కాదని కేంద్రప్రభుత్వం ముందుకే పోతున్నట్లు స్పష్టమయింది. 


గత జనవరి 27న కేంద్రప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే తెలుగు ప్రజల నుంచి, దేశ వ్యాపితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల కార్మికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఫిబ్రవరి 12 నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. విశాఖ నగరంలో కూడా ఏప్రిల్ 2 నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజల నుంచి వీరి పోరాటానికి మద్దతు లభిస్తోంది. కేంద్ర అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేశారు. నూతనంగా ఎన్నికైన గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ మొట్ట మొదటి సమావేశంలోనే ఈ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్ర ముఖ్య మంత్రి రెండు సార్లు దేశ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్ర ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించింది. ప్రజల నుండి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండిగా ఉందని తాజా చర్యతో తేటతెల్లమయింది. 


ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయే బాధ్యత నేడు రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దీనిపై స్పందిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాం, ముఖ్య మంత్రి రెండు లేఖలు రాశారు, ఇంకేం చేయగలమని తెలిపారు. ఇది సరి కాదు. దీనికి భిన్నంగా ఇంకా చాలా చేయాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కాగితాలకే పరిమిత మయింది. ఇప్పుడు దానిని ఆచరణాత్మకంగా చూపించాల్సిన సమాయమాసన్నమయింది. అలా చేయకుండా అడగడానికే పరిమితమయితే ప్రత్యేక హోదాకు పట్టిన గతే దీనికీ పట్టే ప్రమాదం ఉంది. 


ప్రభుత్వరంగ సంస్థల ప్రాధాన్యత ఈ కరోనా కాలంలో ప్రపంచవ్యాపితంగానే స్పష్టంగా కనపడింది. ప్రభుత్వ వైద్యం బలంగా ఉన్న అనేక దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో సఫలీకృతమవగా, ప్రభుత్వ పాత్ర బలహీనంగా ఉన్న అమెరికా, బ్రెజిల్‌, మన దేశం వంటివి భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. ఈ అనుభవం రీత్యా కొన్ని దేశాలు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసే చర్యలు కూడా చేపట్టాయి. కానీ అదేం విచిత్రమో కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం కనీసమైన గుణపాఠాలను కూడా తీసుకోవడానికి నిరాకరించడమే కాక, మరింత వేగంగా తన ప్రైవేటీకరణ విధానాలతో ముందుకు పోవడానికే సాహసిస్తోంది. మన పొరుగు దేశాలతో సహా అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఈ మహమ్మారి ప్రభావాన్ని తట్టుకుని నిలబడగా, ఈ విధానాల వల్ల మన దేశ ఆర్ధికాభివృద్ధి మాత్రం ఎన్నడూ లేని విధంగా మైనస్‌ లోనికి దిగజారింది. అయినా మోదీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం దేశ ప్రయోజనాలకు భంగకరంగా మారుతుంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో అతి పెద్ద భారీ పరిశ్రమగా విరాజిల్లుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ గాని ప్రైవేటు పరమయితే, అది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రకే వన్నె తెచ్చిన ఈ పరిశ్రమను పరిరక్షించుకోకపోతే, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక ఎండమావే. ఇది పోయి, రాజధాని వచ్చినా ఈ ప్రాంతానికి ఒరిగేదేమీ ఉండదు. 


ఇటువంటి కామధేనువును కాపాడుకోవడానికి కార్మికులు అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉంది కదా, ఇక మనమేం చేసినా లాభంలేదు అనే వాదన శుద్ధ పొరపాటే కాక, పిరికిబంద చర్య కూడా. విశాఖలోనే కార్మికులు పొరాడి బిహెచ్‌పివి పరిశ్రమ ప్రైవేటీకరణను వెనక్కు తిప్పికొట్టిన అనుభవం మన కుంది. అంతెందుకు ఆనాటి బలమైన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్నే ఢీకొని సాధించుకున్న ఇదే స్టీల్‌ ప్లాంటు అనుభవమూ మన కళ్ల ముందే ఉంది. ఈ స్పూర్తితో ముందుకు కదలాలే తప్ప, అంతా అయిపోయింది అనే భావం కలగడం దివాళాకోరుతనమవుతుంది. వాస్తవంగా 1960 దశకంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం నాటి కంటే అనుకూల పరిస్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయి. నాడు కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా, ప్రతిపక్ష పార్టీల అండతో ప్రజలు పొరాడి దీనిని సాధించుకున్నారు. నేడు దానికి భిన్నంగా మేం కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా ఉంటాం అనే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షంతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని బహిరంగంగానే అనేక మార్లు ప్రకటించాయి. అందువల్ల నేడు బాధ్యతంతా జగన్‌ ప్రభుత్వం మీదే ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అన్ని చర్యలు చిత్తశుద్ధితో చేపట్టాలి. ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తిప్పికొట్టగలమనే సంపూర్ణ విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వ శక్తులు మోహరించాలి. 

ఎ. అజ శర్మ 

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2021-07-22T08:31:44+05:30 IST