టీఎంసీ - బీజేపీ సర్కార్లకు తేడా చెప్పిన షా

ABN , First Publish Date - 2021-04-17T01:44:43+05:30 IST

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా... తృణమూల్ కాంగ్రెస్‌ సర్కారుకు, బీజేపీ ప్రభుత్వానికి తేడా చెప్పారు.

టీఎంసీ - బీజేపీ సర్కార్లకు తేడా చెప్పిన షా

కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా... తృణమూల్ కాంగ్రెస్‌ సర్కారుకు, బీజేపీ ప్రభుత్వానికి తేడా చెప్పారు. తృణమూల్ అధినేత్రి మమతకు అల్లుడే సర్వస్వమని, అయితే నరేంద్ర మోదీకి 130 కోట్ల మంది భారతీయులు కుటుంబసభ్యులని షా చెప్పారు. అల్లుడికి మాత్రమే మేలు చేసే మమతా దీదీ సర్కారు కావాలా లేక దేశవ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే మోదీ ప్రభుత్వం కావాలా తేల్చుకోవాలని ఆయన ఓటర్లను కోరారు. పశ్చిమబెంగాల్‌ కృష్ణానగర్‌, బ్యారక్‌పూర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మమత సర్కారును చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దీదీ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల బెంగాల్‌లో మతువా వర్గీయులు వెనుకబడిపోయారని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మతువా వర్గీయుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. పదేళ్లుగా తృణమూల్ దుష్పరిపాలన కారణంగా నిరుద్యోగం పెరిగిందని, శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా మారిందని, అక్రమ చొరబాట్లు పెరిగాయని షా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అక్రమ చొరబాట్లను నిరోధించగలదన్నారు. 


సీఏఏను మమత వ్యతిరేకించడం వెనుక ఓటు బ్యాంక్ రాజకీయాలున్నాయని, అయితే బీజేపీ మాత్రం ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయదని, దేశ ప్రజలే తమ ఓటు బ్యాంకని షా చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూజకు హై కోర్టు అనుమతి కావాలా అని షా ప్రశ్నించారు. పాఠశాలల్లో సరస్వతి పూజపై ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు అవసరమా అని షా ఓటర్లను ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-17T01:44:43+05:30 IST