బెంగాల్ కంటే నా పేరే దీదీ ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు : అమిత్‌షా

ABN , First Publish Date - 2021-04-12T21:26:18+05:30 IST

ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.

బెంగాల్ కంటే నా పేరే దీదీ ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు : అమిత్‌షా

కోల్‌కతా : ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఇబ్బందులు తలెత్తుతాయని అధికార తృణమూల్ లేనిపోని ప్రచారం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ గూర్ఖాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని భరోసా ఇచ్చారు. ‘‘ఇప్పటి వరకైతే ఎన్నార్సీని అమలు చేయలేదు. చేసే సమయంలో ఏ గూర్ఖాని కూడా దేశం విడిచి వెళ్లమని ఆదేశించం. ఈ విషయంలో తృణమూల్ అసత్యాన్ని ప్రచారం చేస్తోంది. వారిలో భయాన్ని పెంచుతోంది’’ అంటూ షా విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో సీఎం మమత బెంగాల్ కంటే తన పేరునే ఎక్కువ సార్లు ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారని, బెంగాల్ ప్రజలు చెబితే తప్పకుండా రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి మే 2 న రాజీనామా చేసేందుకు మాత్రం దీదీ సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా, అసందర్భంగా సీఎం మమత బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2021-04-12T21:26:18+05:30 IST