శ్రీనగర్ : జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ నుంచి షార్జాకు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం ప్రారంభించారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత అమిత్ షా మొట్టమొదటిసారి మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు.శ్రీనగర్ విమానాశ్రయం టెర్మినల్ 25000 చదరపు మీటర్ల నుంచి 63000చదరపు మీటర్లకు విస్తరించడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు.అమిత్ షా పర్యటన సందర్భంగా కశ్మీర్ లోయలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలకప్రాంతాల్లో షార్ప్ షూటర్లు, పోలీసు జాగిలాలను మోహరించారు. ఉగ్రదాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్ సిటీ సెంటరు నుంచి లాల్ చౌక్ వరకు గగనతలంపై నిఘా వేశారు.