హోదాపై ఏం చెబుతారో?

ABN , First Publish Date - 2021-11-14T06:35:21+05:30 IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. విభజన చట్టంలోని హామీలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.

హోదాపై ఏం చెబుతారో?

నేడు దక్షిణ ప్రాంతీయ సదస్సు

తిరుపతికి చేరుకున్నఅమిత్‌ షా

తిరుమల సందర్శన


అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. విభజన చట్టంలోని హామీలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిపై వినతులే తప్ప నిలదీయడం చేతగాని జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు దక్షిణ ప్రాంతీయ సదస్సులో ఏం చేస్తుంది? వాటిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుంది? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ‘దక్షిణ’ ప్రాంతీయ సదస్సు ఆదివారం ప్రారంభం కానున్నది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయి. ఈ సదస్సులో 26 అజెండా అంశాలను చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మూడు అంశాలను చేర్చాలని కోరింది. దీంతో మొదట 23 అంశాలుగా ఉన్న సదస్సు అజెండా 26 అజెండా అంశాలకు పెరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని అజెండాలో చేర్పించిన ఆంధ్రప్రదేశ్‌.. మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మూడు రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాలని సదస్సులో కోరనున్నది. రాష్ట్ర కొత్త రాజధానికి కేంద్రం రూ.2500 కోట్లు సాయంగా ప్రకటించింది. ఇంతవరకు రూ.1500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన వెయ్యి కోట్లూ విడుదల చేయాలని రాష్ట్రం కోరనున్నది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సదస్సులో రాష్ట్ర గొంతు ఏ స్థాయిలో వినిపిస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేంద్రంతో ఘర్షణ వైఖరిని కాకుండా సర్దుకుపోయే ధోరణితోనే ముఖ్యమంత్రి జగన్‌ గడచిన రెండున్నరేళ్లుగా గడిపేశారు. 2019 సెప్టెంబరు 27న చెన్నయ్‌లో జరిగిన సదరన్‌ జోనల్‌ సమావేశంలో ప్రత్యేక హోదాపై కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా దాటవేత ధోరణి ప్రదర్శించింది. అయినా దీనిపై కేంద్రాన్ని నిలదీసే స్థితిలో ముఖ్యమంత్రి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


అజెండాలోని ప్రధానాంశాలు

ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, ఏడు జిల్లాలకు వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు, పోలవరం ప్రాజెక్టు, ద్రవ్యలోటు భర్తీ, న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ ఆస్తుల విభజన, రాష్ట్రంలో కేంద్రం స్థాపించే సంస్థలు, కొత్త రాజధానికి సహకారం, కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు, వైజాగ్‌- చెన్నయ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌, కొత్త రైల్వే జోను ఏర్పాటు తదితర అంశాలు అజెండాలో ఉన్నాయి. 


తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ వివాదాల ప్రస్తావన!

రాష్ట్ర విభజన సమస్యల్లో కీలకమైన కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం, ట్రైబ్యునల్‌ ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు కూడా సదస్సులో ప్రస్తావనకు రానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం సూచనల మేరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తు బకాయిలు రూ.6300 కోట్ల బకాయిలనూ ప్రస్తావించేందుకు ఏపీ సిద్ధమవుతోంది.


నగదు బదిలీపై ప్రత్యేక ప్రస్తావన

కేంద్రం పలు పథకాలను రాష్ట్రాల ద్వారా అమలు చేస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లో వేస్తున్నాయి. వాస్తవానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని కేంద్రం ఇస్తున్నట్టుగా రాష్ట్రాలు ఎక్కడా ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ అనర్హులనూ అర్హులుగా ప్రకటిస్తున్నాయి. దీంతో బినామీలకు అత్యధికంగా నిధులు వెళ్లిపోతున్నాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆడిటింగ్‌ జరగాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర సహకారంతో అమలు చేసే పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని కేంద్ర వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని సదస్సులో ప్రత్యేకంగా రాష్ట్రాలకు సూచించనున్నది.


సదస్సుకు అంతా సన్నద్ధం

తిరుపతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆదివారం నుంచి జరిగే దక్షిణ ప్రాంతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఆయనతోపాటు పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళి సై, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రపుల్‌ ఖోడా పటేల్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ దేవేంద్రకుమార్‌ జోషి కూడా తిరుపతి చేరుకున్నారు. కర్ణాటక సీఎం ఆదివారం రానున్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సదస్సు 3.47 గంటలకు మొదలై, సాయంత్రం 6.45 గంటలకు ముగియనుంది. రాత్రి 7.30కు ముఖ్యమంత్రి జగన్‌ సదస్సుకు హాజరైనవారికి విందు ఇస్తారు దక్షిణ ప్రాంతీయ సదస్సు నేపథ్యంలో శనివారం నుంచే తిరుపతి మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. వీవీఐపీల భద్రతకు మూడు వేల మంది పోలీసు బలగాలను నియమించారు.

Updated Date - 2021-11-14T06:35:21+05:30 IST