Glory of India : సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం : Amit Shah

ABN , First Publish Date - 2022-06-03T00:07:09+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భారతీయ జనతా

Glory of India : సాంస్కృతిక పునరుజ్జీవంతో భారత్‌కు పూర్వ వైభవం : Amit Shah

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన 2014 నుంచి సాంస్కృతిక పునరుజ్జీవ శకం ప్రారంభమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. ఈ ప్రస్థానం భారత దేశాన్ని తన పూర్వ వైభవం దిశగా నడిపిస్తుందని చెప్పారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన ‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ (Samrat Pridhviraj) సినిమా చూసిన అనంతరం బుధవారం రాత్రి ఆయన మాట్లాడారు. 


‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ సినిమాను న్యూఢిల్లీలో బుధవారం రాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన తర్వాత అమిత్ షా మాట్లాడుతూ, భారత దేశం (India) లెక్కలేనన్ని ప్రతికూలతలను ఎదుర్కొందని చెప్పారు. గతంలో ప్రపంచానికి మార్గదర్శిగా భారత్ నిలిచిందన్నారు. అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం మన దేశ ఔన్నత్యం, సంస్కృతి, సహజసిద్ధ విశ్వాసం చాలా కాలం తర్వాత తిరిగి తన పూర్వ వైభవానికి చేరుకునే బాటలో ఉన్నట్లు  తెలిపారు.  


1025లో సుదీర్ఘ ప్రయాణం ప్రారంభమైందని, అందులో మహమ్మద్ గజనీతో పృథ్వీరాజ్ యుద్ధం ఓ భాగమని చెప్పారు. గజనీ గుజరాత్‌పై దాడి చేసి, సోమనాథ (Somnath) దేవాలయాన్ని దోచుకున్న విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం రావడంతో 1947లో ఈ సుదీర్ఘ ప్రయాణం ముగిసిందన్నారు. తాను చరిత్రను చాలా శ్రద్ధగా చదివే విద్యార్థినని తెలిపారు. 


భారత దేశంపైనా, భారతీయ సంస్కృతిపైనా అనేక మంది దాడి చేశారన్నారు. వారిపై పోరాటం ఎన్నటికీ అంతం కాదన్నారు. వారితో అనేక ప్రాంతాల్లోని రాజులు పోరాడి, భారత దేశ సంస్కృతిని కాపాడి, పరిరక్షించడానికి కృషి చేశారని తెలిపారు. 


ఈ సినిమాలో పృథ్వీరాజును చూపించిన తీరును ప్రశంసించారు. వందలాది పుస్తకాలకు సాధ్యం కానంతటి స్థాయిలో ఓ సినిమా మన ఆత్మగౌరవాన్ని ప్రేరేపిస్తుందపి. ప్రజలకు అవగాహన కల్పిస్తుందని చెప్పారు. వేలాది పేజీలుగల పుస్తకానికి సాధ్యం కాని రీతిలో రెండున్నర గంటల సినిమా ఓ మహా నాయకుడి పట్ల అవగాహన కల్పిస్తుందన్నారు. 


‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ సినిమా దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదీ, నటీనటులు అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ తదితరులను  అమిత్ షా ప్రశంసించారు. ఈ సినిమా కేవలం పృథ్వీరాజ్ మాతృభూమి కోసం ధైర్యసాహసాలతో చేసిన పోరాటాన్ని మాత్రమే కాకుండా ఆ కాలం నాటి సాంస్కృతిక వైభవాన్ని కూడా చూపించిందన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడేవారు ఈ సినిమాను తప్పకుండా చూడాలన్నారు.


Updated Date - 2022-06-03T00:07:09+05:30 IST