రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధంతో గొప్ప ఊపు : అమిత్ షా

ABN , First Publish Date - 2020-08-10T03:34:43+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులను నిషేధించడం వల్ల

రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధంతో గొప్ప ఊపు : అమిత్ షా

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 101 రక్షణ ఉత్పత్తుల దిగుమతులను నిషేధించడం వల్ల మన దేశ రక్షణ రంగంలోని పరిశ్రమలకు గొప్ప ఊపు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ‘స్వయం సమృద్ధ భారత్’ కల సాకారమవుతుందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను అభినందించారు. 


అమిత్ షా కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు గురై, గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో ‘‘101 ఐటమ్స్‌ దిగుమతిపై నిషేధం విధించాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.52,000 కోట్ల డొమెస్టిక్ కేపిటల్ ప్రొక్యూర్‌మెంట్‌కు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా దేశీయ రక్షణ రంగానికి గొప్ప ఊపునిస్తుంది. ఈ చరిత్రాత్మ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ధన్యవాదాలు చెప్తున్నాను’’ అని పేర్కొన్నారు. 


ఈ నిర్ణయం వల్ల మన దేశ రక్షణ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్లకు వస్తాయన్నారు. వీటి ఫలితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలు కంటున్న స్వయం సమృద్ధ భారత దేశం, మేక్ ఇన్ ఇండియా పథకాలకు బలం చేకూరుతుందని తెలిపారు. 


రాజ్‌నాథ్ సింగ్ 101 ఐటమ్స్‌ దిగుమతులను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జాబితాలో ఆర్టిలరీ గన్స్, మిసైల్ డిస్ట్రాయర్లు, షిప్ బోర్న్ క్రూయిజ్ మిసైల్స్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్, రకరకాల రాడార్లు, అసాల్ట్ రైఫిల్స్, స్నైపర్ రైఫిల్స్, మినీ యూఏవీలు, వివిధ రకాల ఆయుధాలు ఉన్నాయి. 



Updated Date - 2020-08-10T03:34:43+05:30 IST