చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

ABN , First Publish Date - 2021-10-27T20:54:41+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు.

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే అమిత్ షా నిన్న మధ్యాహ్నం వరకు జమ్మూ కశ్మీర్ నుంచి రాకపోవడం, తర్వాత ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని ఆయన పేషీ అధికారులు చంద్రబాబు బృందానికి సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు బృందం నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు.


ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో కలవడం కుదరలేదని, మరోసారి కలుద్దామని చెప్పారు. కాగా చంద్రబాబు తనను ఎందుకు కలవాలని అనుకుంటున్నారో అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఏపీ పరిస్థితులపై వినతి పత్రం తయారు చేశామని, అది పంపుతున్నామని చంద్రబాబు కేంద్రమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ విధ్వంసం జరుగుతోందని, అలాగే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు తదితర విషయాలను అమిత్ షాకు వివరించారు. అలాగే ఏపీలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడినా దాని మూలాలు ఏపీకి రావడం, ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. అదే విధంగా తాము రాష్ట్రపతికి అందించిన వినతిపత్రం, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో, వీడియోతో సహా పంపుతానని.. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-10-27T20:54:41+05:30 IST