Har Ghar Tiranga: జాతీయ జెండాను ఎగురవేసిన అమిత్ షా

ABN , First Publish Date - 2022-08-13T18:22:29+05:30 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర హోం మంత్రి

Har Ghar Tiranga: జాతీయ జెండాను ఎగురవేసిన అమిత్ షా

న్యూఢిల్లీ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో శనివారం జాతీయ జెండాను ఎగురవేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆయన తన సతీమణి సోనాల్ షాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గత నెలలో ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని (Har Ghar Tiranga) పిలుపునిచ్చారు. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అందరూ ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాల స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్చర్లను పెట్టాలని పిలుపునిచ్చారు. 


ప్రజలు పగలు, రాత్రి జాతీయ జెండాను ఎగురవేసేందుకు అవకాశం కల్పిస్తూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002ను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జూలై 20న జారీ చేసింది. ఈ వివరాలను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు పంపించారు. 


హిమంత బిశ్వ శర్మ ట్వీట్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకునేందుకు ఉదయాన్నే పాఠశాల విద్యార్థులు కవాతు నిర్వహించారని, వారితో కలిసి తాను  ఈ రోజును ప్రారంభించానని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ‘వందే మాతరం’ నినాదాలు చేస్తూ ఉంటే, తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొన్నారు. 


ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాలను పెంపొందించడం, జాతీయ జెండా గురించి అవగాహనను పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 


Updated Date - 2022-08-13T18:22:29+05:30 IST