నాగాలాండ్‌ ఎన్‌కౌంటర్‌లో సాధారణ పౌరుల మృతిపై అమిత్ షా ఆవేదన

ABN , First Publish Date - 2021-12-05T15:52:51+05:30 IST

నాగాలాండ్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న

నాగాలాండ్‌ ఎన్‌కౌంటర్‌లో సాధారణ పౌరుల మృతిపై అమిత్ షా ఆవేదన

న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తుందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 


స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మోన్ జిల్లాలోని ఓటింగ్-టిరు గ్రామాల మధ్యలో ఈ ఆపరేషన్ జరుగుతుండగా, రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అదే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు రోజు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. గ్రామస్థులు భద్రతా దళాలకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. హింసాకాండకు పాల్పడుతున్నవారిని చెదరగొ్ట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. 


నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఆదివారం ఉదయం స్పందిస్తూ, ఈ సంఘటను తీవ్రంగా ఖండించారు. అత్యున్నత స్థాయి సిట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే న్యాయం జరుగుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలు శాంతియుతంగా ఉండాలని ఓ ట్వీట్‌లో కోరారు. 


Updated Date - 2021-12-05T15:52:51+05:30 IST