Munugode By-election: టీఆర్ఎస్‌కు మూకుమ్మడి రాజీనామాలు

ABN , First Publish Date - 2022-08-20T01:59:53+05:30 IST

తుర్కపల్లిలో టీఆర్ఎస్‌కు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దాదాపు 500 మంది నాయకులు రాజీనామాలు ప్రకటించారు.

Munugode By-election: టీఆర్ఎస్‌కు మూకుమ్మడి రాజీనామాలు

యాదాద్రి: తుర్కపల్లిలో టీఆర్ఎస్‌కు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దాదాపు 500 మంది నాయకులు రాజీనామాలు ప్రకటించారు. వీరంతా 21న కేంద్రమంత్రి అమిత్‌షా (Amit Shah) సమక్షంలో బీజేపీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (kusukuntla prabhakar reddy) ఖరారవుతారన్న సమాచారంతో అసంతృప్త నేతలు ఓ వైపు రాజగోపాల్‌రెడ్డి, మరోవైపు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ వలసలను ఆపే క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ కేసులు, అరెస్టుల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అప్రమత్తమైన అసంతృప్తి నేతలు అమిత్‌షా సభ వరకు వేచి చూడకుండా కమలం కండువా కప్పుకుంటున్నారు. చండూరు మండలానికి చెందిన ఐదుగురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు బుధవారం చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ (Etala Rajender) చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిక నేపథ్యంలో చౌటుప్పల్‌లో ఈ నెల 21న తలపెట్టిన అమిత్‌షా సభ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఉంటాయని అధికార పార్టీకి సమాచారం వెళ్లింది.


ఇలా వెళ్లిపోయే సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులపై టీఆర్‌ఎస్‌ నిఘా పెట్టి కౌన్సెలింగ్‌ ప్రారంభించింది. పరిస్థితిని అంచనా వేసిన అధికార పార్టీ నేతలు తమ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు ఒక్కొక్కరికి బుధవారం రాత్రి రూ.2 లక్షల చొప్పున అందజేసినట్టు సమాచారం. చండూరు మండలంలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌‌కు 15 మంది సర్పంచ్‌లు, నలుగురు ఎంపీటీసీ సభ్యులున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు బుధవారం రాత్రి చండూరు మండలంలో ఓ గ్రామంలోని ఫాంహౌస్‌లో డబ్బు ప్యాకెట్లను ఓ ఎమ్మెల్సీ, జడ్పీటీసీ సభ్యుడు పకడ్బందీగా పంపిణీ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-20T01:59:53+05:30 IST