అమిత్‌ జీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ?

ABN , First Publish Date - 2022-05-15T08:58:31+05:30 IST

దేశంలోని ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతలపైనా గంటల వ్యవధిలో సీబీఐ, ఈడీ దాడులు చేయించే బీజేపీ ప్రభుత్వం..

అమిత్‌ జీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ?

  • కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై ఉపేక్ష ఎందుకు?
  • అవినీతి జరిగిందంటూనే చర్యలు తీసుకోరెందుకు?
  • ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌, బీజేపీవి డ్రామాలు
  • రైతుల మరణాలకు రెండు పార్టీలు కారణం కాదా?
  • నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు ఏమైంది?
  • రామాయణం సర్క్యూట్‌లో భద్రాద్రి రామునికి చోటేదీ?
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రేవంత్‌రెడ్డి ప్రశ్నలు


హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతలపైనా గంటల వ్యవధిలో సీబీఐ, ఈడీ దాడులు చేయించే బీజేపీ ప్రభుత్వం.. ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ఎందుకు ఉపేక్షిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక రహస్యమేంటో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుమార్లు వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అవినీతి జరిగిందని అంగీకరిస్తూ.. చర్యలెందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర-2 ముగింపు సభలో పాల్గొనేందుకు శనివారం అమిత్‌షా తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు రేవంత్‌రెడ్డి పలు ప్రశ్నలు సంధిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అమిత్‌షా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్‌ డైలాగులు చెప్పడం తప్ప సమస్యల పరిష్కారానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతితో రూ.వేల కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురవుతున్నా చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులు చేసినా.. కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తారని, బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం టీఆర్‌ఎ్‌సతో లడాయి అంటూ తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ చీకటి సంబంధం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందన్నారు.


టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి డ్రామాలు..

ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి ఆడిన డ్రామాలతో రైతులు మానసిక క్షోభకు గురయ్యారని రేవంత్‌రెడ్డి అన్నారు. పదుల సంఖ్యలో రైతు లు వడ్ల కుప్పలపైనే గుండె పగిలి చనిపోయారని ఈ మరణాలకు బాధ్యులు టీఆర్‌ఎస్‌, బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ‘నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది? విభజన చట్టంలో ఇచ్చిన ఐటీఐఆర్‌, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ వంటి పథకాలకు కేంద్రం మంగళం పాడినా టీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతిస్తూ వస్తోంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన ఈ రెండు పార్టీలను ఎందుకు నమ్మాలి? గిరిజన వర్సిటీకి మోక్షమెప్పుడు? అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఉన్న రాములవారి పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా రామాయణం సర్క్యూట్‌ పేరుతో శ్రీ రామాయణ్‌ యాత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రవేశపెట్టిన కేంద్రం.. అందులో భద్రాద్రి రాముల వారికి చోటు ఎందుకు కల్పించలేదు? ఒడిసాలోని నైనీ కోల్‌మైన్‌ టెండర్‌ అవినీతిలోకేసీఆర్‌ కుటుంబం పాత్రపై మేము చేసిన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పెట్రో ధరలను పెంచుతూ మోయలేనంత భారం మోపుతున్న బీజేపీని ప్రజలు ఎందుకు క్షమించాలి?’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అనుచితంగా, ఉద్యమాన్ని కించపరిచేలా మోదీ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


చీకటి మిత్రునిపై ఈగ వాలనివ్వని అమిత్‌షా

కేంద్ర మంత్రి అమిత్‌షా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి తమ చీకటి మిత్రునిపై ఈగ వాలనివ్వరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం ట్వీట్‌ చేశారు. తక్కుగూడలో అమిత్‌షా ప్రసంగం కొండంత రాగం తీసి... అన్నట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల తరఫున తాము అడిగిన ప్రశ్నలకు సమాధానంలేదని, కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండబోవని తేలిపోయిందని పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-15T08:58:31+05:30 IST