లౌడ్‌స్పీకర్ల వివాదం : ముస్లింలు అర్థం చేసుకోవాలంటున్న రాజ్ థాకరే

ABN , First Publish Date - 2022-04-17T19:55:55+05:30 IST

చట్టం కన్నా మతం పెద్దది కాదని అర్థం చేసుకోవాలని ముస్లింలను

లౌడ్‌స్పీకర్ల వివాదం : ముస్లింలు అర్థం చేసుకోవాలంటున్న రాజ్ థాకరే

ముంబై : చట్టం కన్నా మతం పెద్దది కాదని అర్థం చేసుకోవాలని ముస్లింలను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కోరారు. ఓ వార్తా సంస్థ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ముస్లింలు ప్రార్థన చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని రాజ్ చెప్పారు. మహారాష్ట్రలో అల్లర్లు జరగాలని తాము కోరుకోవడం లేదన్నారు. అయితే ముస్లింలు లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రార్థనలు చేస్తే, తాము కూడా అదేవిధంగా చేస్తామన్నారు. 


మే 3నాటికి మసీదుల నుంచి లౌడ్‌స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చేసిన డిమాండ్ గురించి రాజ్ మాట్లాడుతూ, మే 3 తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. మరాఠీ నూతన సంవత్సరం గుడి పడవ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ, మసీదుల నుంచి పెద్ద శబ్దంతో లౌడ్‌స్పీకర్లలో ఆజాన్‌ను వినిపిస్తే, తాము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు లౌడ్‌స్పీకర్లలో వినిపిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. 


ఇదిలావుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్ థాకరే డిమాండ్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. అధికార కూటమిలోని శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ పోషించిన పాత్రనే మహారాష్ట్రలో రాజ్ థాకరే పోషిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ ఇక్కడి పోలీసులు, ప్రజలు శాంతికాముకులని చెప్పారు. ‘కొత్త ఒవైసీ’ ద్వారా శ్రీరాముడు, హనుమంతుడు పేరు మీద అల్లర్లను రెచ్చగొట్టాలని కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్రలో ‘హిందూ ఒవైసీ’ ద్వారా అల్లర్లను రెచ్చగొట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము దానిని జరగనివ్వబోమన్నారు. 


రాజ్ ధాకరేను ఒవైసీతో పోల్చడంతో ఎంఎన్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేన పత్రిక ‘సామ్నా’ కార్యాలయం వద్ద శనివారం సంజయ్ రౌత్‌ను హెచ్చరిస్తూ పోస్టర్లను అతికించింది. ‘‘సంజయ్ రౌత్, ఎవరిని ఒవైసీ అని పిలుస్తున్నావు నువ్వు? నీ లౌడ్‌స్పీకర్‌ను ఆపు. దీనివల్ల యావత్తు మహారాష్ట్ర సమస్యలను ఎదుర్కొంటోంది. లౌడ్‌స్పీకర్లను ఆపకపోతే, నీ లౌడ్‌స్పీకర్‌ని ఎంఎన్ఎస్ శైలిలో ఆపేస్తాం’’ అని హెచ్చరించింది. 


Updated Date - 2022-04-17T19:55:55+05:30 IST