Maharastra Political Crisis : గవర్నర్ Koshyari కి కొవిడ్.. హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో చేరిక

ABN , First Publish Date - 2022-06-22T17:24:08+05:30 IST

మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ కరోనా బారినపడ్డారు

Maharastra Political Crisis : గవర్నర్ Koshyari కి కొవిడ్.. హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో చేరిక

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ(Bhagat Singh Koshyari) కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయనకు కొవిడ్ పాజిటివ్‌(covid positive)గా నిర్ధారణ అయ్యింది. దీంతో ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ఆయన చేరారు. ఈ మేరకు గవర్న్ కొశ్యారీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను’’ అని కొశ్యారీ ట్వీట్ చేశారు. 


గుజరాత్ నుంచి అసోంకు రెబల్ ఎమ్మెల్యేల మకాం..

మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. శివసేన కీలకనేత ఏక్‌నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటూ ఎగురవేసిన విషయం తెలిసిందే. మంగళవారమంతా గుజరాత్‌ సూరత్‌లోని హోటల్‌లో  బసచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం ఉదయమే అసోంలోని గౌహతికి మకాం మార్చారు.  గౌహతి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మకాం వేశారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌ నుంచి బుధవారం తెల్లవారుజామున విమానంలో ఎమ్మెల్యేలను గౌహతికి తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పంపిన శివసేన నాయకులు మిలింద్ నార్వేకర్,  రవీంద్ర ఫాటక్ తిరుగుబాటుదారులతో హోటల్‌లో చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్‌సీపీతో చేతులు కలిపినందుకు శివసేనపై షిండే తీవ్ర విమర్శలు చేశారు. లశాసనసభలో తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ శాసనమండలి ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకున్న తర్వాత అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలసిందే.

Updated Date - 2022-06-22T17:24:08+05:30 IST