Maharashtra Crisis : BJP చీఫ్ జేపీ నడ్డాతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ

ABN , First Publish Date - 2022-06-28T23:52:03+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చీఫ్

Maharashtra Crisis : BJP చీఫ్ జేపీ నడ్డాతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా (JP Nadda)తో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను నడ్డాకు ఫడ్నవీస్ వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫడ్నవీస్ బీజేపీ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 


శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గం ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటిలో ఓ హోటల్‌లో బస చేశారు. ఈ వర్గంలో సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఆ వర్గంలోని 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. 


అయితే శివసేనలో తిరుగుబాటు వెనుక తమ ప్రమేయం లేదని బీజేపీ (BJP) నేతలు చెప్తున్నారు. కానీ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 


బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ మంగళవారం నాగపూర్ విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ, తగిన ఎమ్మెల్యేల బలం లేదని ఉద్ధవ్ ప్రభుత్వం ప్రకటించే వరకు తాము వేచి చూస్తామన్నారు. రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో తమ పార్టీ ఓ కోర్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 


ఏక్‌నాథ్ సిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శాసన సభ ఉప సభాపతి జారీ చేసిన నోటీసులను సుప్రీంకోర్టు సోమవారం అడ్డుకుంది. ఈ నోటీసులపై తదుపరి చర్యలను జూలై 11 వరకు నిలిపేసింది. శాసన సభలో బల పరీక్ష నిర్వహించకుండా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ, అటువంటి తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. 


మహారాష్ట్రలో 288 శాసన సభ స్థానాలు ఉన్నాయి. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అగాడీ కూటమిగా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో తిరుగుబాటు రావడంతో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డారు.  ప్రతిపక్షంలోని బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. BJPకి ఆర్ఎస్పీ (1), జేఎస్ఎస్ (1), ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. 


Updated Date - 2022-06-28T23:52:03+05:30 IST