UK Crisis: బ్రిటన్ ప్రభుత్వంలో సంక్షోభం.. రాజీనామాలకు క్యూ కడుతున్న మంత్రులు..

ABN , First Publish Date - 2022-07-07T00:22:09+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తాజాగా మరో ఆరుగురు మంత్రులు కేబినెట్ నుంచి రాజీనామా చేసి..

UK Crisis: బ్రిటన్ ప్రభుత్వంలో సంక్షోభం.. రాజీనామాలకు క్యూ కడుతున్న మంత్రులు..

లండన్: బ్రిటన్‌ (UK) ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తాజాగా మరో ఆరుగురు మంత్రులు కేబినెట్ నుంచి రాజీనామా చేసి తప్పుకున్నారు. దీంతో.. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయే ప్రమాదంలో పడింది. ఆర్థిక శాఖ మంత్రి రిషీ సునాక్‌ (Rishi Sunak) ఆరోగ్య శాఖ కార్యదర్శి సజిద్‌ జావిద్‌ (Sajid Javid) తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. వీరిలో రిషీ సునాక్‌.. ఇన్ఫోసిస్‌ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి అల్లుడు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ విప్‌ క్రిస్‌ పించర్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని బోరిస్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రాజీనామాలు జరిగాయి. తన నిర్లక్ష్యంపై బోరిస్‌ క్షమాపణలు కూడా కోరారు. కానీ అదే సమయంలో తాము క్యాబినెట్‌ నుంచి వైదొలుగుతున్నట్టు రిషీ, సజిద్‌ ప్రకటించారు. యూకే విద్యా శాఖ మంత్రి విల్ క్విన్స్, సోలిసిటర్ జనరల్ అలెక్స్ చాక్, మరో విద్యా శాఖ మంత్రి రాబిన్ వాకర్, ట్రెజరీ మినిస్టర్ జాన్ గ్లెన్, న్యాయ శాఖ మంత్రి విక్టోరియా అకిన్స్, పర్యావరణ శాఖ మంత్రి జో చర్చిల్, గృహ నిర్మాణ శాఖ మంత్రి స్టార్ట్ ఆండ్రూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.



పార్లమెంటరీ ప్రైవేట్ సెక్రటరీలు జొనథాన్ గుల్లీస్ (నార్త్ ఐర్లాండ్ ఆఫీస్), షకీబ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్), నికోలా రిచర్డ్స్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్), వర్జీనియా క్రాస్బీ (వెల్ష్ ఆఫీస్), లౌరా ట్రాట్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్), ఫెలిసిటీ బుచాన్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ) కూడా తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మంత్రుల వరుస రాజీనామాలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాత్రం ఇంత జరుగుతున్నా తన పదవి నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందో అదే జరుగుతుందని దానికి బదులుగా తప్పుకుని వెళ్లనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత యూరప్ గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత నష్టాన్ని చవిచూసిందని, ఆర్థిక వ్యవస్థపై కూడా ఆ ప్రభావం పడిందని బోరిస్ తెలిపారు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించి సాయపడుతున్నామని బోరిస్ జాన్సన్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-07-07T00:22:09+05:30 IST