అమెరికా తరహా చదువులు

ABN , First Publish Date - 2022-05-24T08:33:06+05:30 IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల తరహాలో పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు.

అమెరికా తరహా చదువులు

  • ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నుంచైనా ఆన్‌లైన్‌ క్లాస్‌లు
  • ప్రతి డిపార్ట్‌మెంట్‌కు స్పెషల్‌ ఆన్‌లైన్‌ క్లాస్‌ రూమ్‌
  • 2024 నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు పోటీ పడుతున్నాం
  • ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో జేఎన్‌టీ యూ వీసీ నరసింహారెడ్డి 


హైదరాబాద్‌ సిటీ/ జేఎన్‌టీయూ, మే 23(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల తరహాలో పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. చదువుతో పాటు ఉపాధి కల్పన ధ్యేయంగా చేస్తున్న ఈ మార్పులతో డిగ్రీలు చేతికి రాకముందే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా లక్షల మందికి ఉపాధి కలగనుందని చెప్పారు. జేఎన్‌టీయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నరసింహారెడ్డి సోమవారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.


విద్యా విధానంలో ఏమేం మార్పులు తెస్తున్నారు?

ప్రస్తుత విద్యావిధానంలో ఇంటర్నల్స్‌కు 25 మార్కులు, ఎక్స్‌టర్నల్స్‌కు 75 మార్కులు ఉన్నాయి. ఇంటర్నరల్‌ మార్కులను 40కి పెంచి ఎక్స్‌టర్నల్స్‌ మార్కులను 60కి తగ్గించాం. దాంతో విద్యార్థులకు ఎక్కువ మార్కులు సాధించుకొనే అవకాశం ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు రెండో ఏడాది తర్వాత బ్రేక్‌ తీసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థులకు ప్రస్తుతం నాలుగేళ్లలో 160 క్రెడిట్లు ఇస్తున్నారు. వీటిని 8 సెమిస్టర్లకు విభజించి, 20 చొప్పున క్రెడిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం.


ఎలాంటి కొత్త కోర్సులు తీసుకువస్తున్నారు?

ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టాం. ఒకేసారి డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు పూర్తిచేసే అవకాశాలను కల్పిస్తున్నాం. బీటెక్‌ తో పాటు బీబీఏ లాంటి కోర్సును సమాంతరంగా ఆన్‌లైన్‌లో చేయొచ్చు. దీంతో వాళ్లు తమకు ఎక్కువ ప్యాకేజీ ఉన్న ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు పొందే అవకాశముంటుంది. వారంలో ఐదురోజులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంజనీరింగ్‌ తరగతులు నిర్వహిస్తాం. శనివారం బీబీఏ క్లాసులు తీసుకుంటాం. తీరిక వేళల్లో బీబీఏ తరగతులను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో ఆన్‌లైన్‌లో  నిర్వహిస్తాం.


పరిశోధనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి?

‘ఇంజనీరింగ్‌ మార్వెల్స్‌ ఆఫ్‌ తెలంగాణ’ నినాదంతో లైవ్‌ ప్రాజెక్టుల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశాలు కల్పిస్తున్నాం. పరిశోధన సంస్కృతిని తప్పనిసరి చే స్తూ ప్రాజెక్టుల్లో విద్యార్థులు నేరుగా పనిచేసే అవకాశాలను కల్పిస్తున్నాం. లైవ్‌ ప్రాజె క్టులో పాల్గొన్న విద్యార్థులకు ఎక్కడికి వెళ్లినా ఉద్యోగావకాశాలు సాధించే సామర్థ్యం పెరుగుతుంది. పరిశోధన విద్యార్థులకు ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నాం. ఇప్పటిదాకా జేఎన్‌టీయూలో కంపెనీల నుంచి క్వాలిటీ, సామర్ధ్య పరీక్షల కోసం వసూలు చేస్తున్న ఫీజులను కాలేజీలు, అధ్యాపకులకు పంచుతున్నాం. ఇక నుంచి విద్యార్థులకు కూడా 20 శాతం వాటా ఇస్తాం.


రాష్ట్రంలో కొత్త కాలేజీలు వస్తున్నాయా?

ఈ ఏడాది (2021-22)లో సుల్తానాపూర్‌లో ఫార్మసీ, సిరిసిల్లలో ఇంజనీరింగ్‌ కళాశాలలో మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాం.  వనపర్తిలో 2022-23 నుంచి తరగతులు నిర్వహిస్తున్నాం. నిజామాబాద్‌లో మరో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సూచన మేరకు ప్రతిపాదనలు పంపించాం.


భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటీ?

2024 జనవరి 3న నేషనల్‌ సెన్స్‌ కాంగ్రెస్‌ జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే జరిగితే ప్రధాని కూడా వస్తారు. 150 కోట్ల వరకు ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలుంటాయి.

విశ్వవిద్యాలయాల అభివృద్దికి ప్రణాళికలేంటి?

దేశంలోనే మొదటిసారిగా క్లస్టర్‌ యూనివర్సిటీ ప్రారంభించాలనే లక్ష్యంతో ఐఐటీ, జేఎన్‌టీయూహెచ్‌లు ముందుకువెళ్తున్నాయి. క్లస్టర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇప్పటికే పలు సూచనలను జేఎన్‌టీయూహెచ్‌ చేసింది. క్లస్టర్‌ యూనివర్సిటీతో పలు విశ్వవిద్యాలయాలు ఒకే గొడుకు కిందకు వచ్చే అవకాశముంటుంది. క్లస్టర్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తే తక్షణమే రూ. 100 కోట్లు నిధులు కేటాయిస్తారు.


జేఎన్‌టీయూలో సరిపడా హాస్టళ్లులేవంటున్నారు?

మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 275 మంది సామరఽ్ధ్యంతో బాలుర హాస్టల్‌,  200 మందితో బాలికల హాస్టల్‌ త్వరలో ప్రారంభించబోతున్నాం. పూర్వ విద్యార్థుల సహాకారంతో గర్ల్స్‌ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగు పరుస్తున్నాం. ఖాళీగా ఉన్న సిబ్బంది క్వార్టర్లనూ బాలురహాస్టళ్లుగా మారుస్తున్నాం.

Updated Date - 2022-05-24T08:33:06+05:30 IST