రెస్టారెంట్‌కు వెళ్లి తమిళంలో ఆర్డర్ ఇచ్చిన American YouTuber.. రెస్టారెంట్ యజమాని ఫిదా అయిపోయి..

ABN , First Publish Date - 2022-06-08T00:34:26+05:30 IST

పరాయి దేశంలో ఉండగా మన భాష మాట్లాడే వాళ్లు ఎదురుపడితే సంతోషంగా అనిపిస్తుంది. అదే.. పరాయి దేశస్తుడి నోట మన మాతృభాష పలికితే ఆశ్చర్యానికి అంతే ఉండదు. అమెరికాలోని ఓ తమిళుడికి ఇటీవల సరిగ్గా ఇదే అనుభూతి ఎదురైంది.

రెస్టారెంట్‌కు వెళ్లి తమిళంలో ఆర్డర్ ఇచ్చిన American YouTuber.. రెస్టారెంట్ యజమాని ఫిదా అయిపోయి..

ఎన్నారై డెస్క్: పరాయి దేశంలో ఉండగా మన భాష మాట్లాడే వాళ్లు ఎదురుపడితే సంతోషంగా అనిపిస్తుంది. అదే.. పరాయి దేశస్తుడి నోట మన మాతృభాష పలికితే.. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండదు. అమెరికాలోని ఓ తమిళుడికి ఇటీవల సరిగ్గా ఇదే అనుభూతి ఎదురైంది. తన రెస్టారెంట్‌కు వచ్చిన ఓ శ్వేతజాతీయుడి నోట తమిళం విన్న ఆయన ఉబ్బితబ్బిబ్బైపోయారు. కావాల్సిన ఆహారాన్ని ఉచితంగానే తీసుకెళ్లంటూ అతడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో  వైరల్ అవుతోంది.


అమెరికాకు చెందిన యూట్యూబర్ ఆరీ స్మిత్‌కు కొత్త భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే అతడు పలు భాషలు నేర్చుకున్నాడు. అందులో తమిళం కూడా ఒకటి. ఇటీవలే ఓ రోజు అతడు ఓ తమిళ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ.. తమిళంలో మాట్లాడుతూ తనకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చాడు.  అయితే.. రెస్టారెంట్ యజమాని తమిళుడు!  దీంతో.. తమిళం మాట్లాడుతున్న ఆరీని చూసి అతడు తెగ సంతోషపడిపోయాడు.


ఆరీ తన యూట్యూబ్‌ వీడియోలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ‘‘ప్రపంచంలోని పురాతన భాషల్లో తమిళం కూడా ఒకటని తెలుసుకున్నాక  ఆ భాషపై నాకు ఆసక్తి పెరిగింది. కానీ..అమెరికాలో తమిళం మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. కాబట్టి..  తమిళులు నిర్వహించే రెస్టారెంట్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశా. న్యూయార్క్ నగరంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ గురించి తెలిసింది. అక్కడికెళ్లి తమిళంలో దోసె కోసం ఆర్డరిచ్చా. నేను తమిళంలో మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయిన ఆ రెస్టారెంట్ యజమాని.. దోసెకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.’’ అని చెప్పుకొచ్చాడు. ఆ రోజు తాను వెళ్లిన పలు తమిళ రెస్టారెంట్లలో తనకు ఇదే అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రికార్డు చేసిన వీడియోను ఆరీ తన చానల్ Xiaomanyc‌ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పాశ్చాత్యులకు క్లిష్టంగా అనిపించే తమిళ భాషను కష్టపడి నేర్చుకున్న ఆరీపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. భారతీయులను ఇలా సర్‌ప్రైజ్ చేయడం ఆరీకి కొత్తేమీ కాదు. గతంలో అతడు ఓ గుజరాతీ రెస్టారెంట్‌లో గుజరాతీలోనే మాట్లాడి అక్కడి వాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 



Updated Date - 2022-06-08T00:34:26+05:30 IST