Abn logo
Jul 12 2020 @ 02:46AM

ఇక ప్రతిభ ఆధారిత వీసాలు!

  • గొలుసుకట్టు వలసలకు చెక్
  • భారీ సంస్కరణ దిశగా ట్రంప్‌ అడుగులు
  • త్వరలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌
  • డీఏసీఏ లబ్ధిదారులనూ జత చేసే యోచన
  • డ్రీమర్ల కల  నెరవేరుతుంది: ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 11 : ప్రతిభ ఆధారిత వలస విధానం దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అడుగులేస్తున్నారు.  గొలుసుకట్టు వలసలను అడ్డుకునేందుకు వీలుగా భారీ సంస్కరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వు(ఎగ్జిక్యూటివ్‌ ఆర్దర్‌) కూడా తీసుకురానున్నారు. ఒబామా సర్కారు మానవతా దృక్పథంతో తెచ్చిన ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ ఎరైవల్స్‌(డీఏసీఏ)’ కార్యక్రమం కూడా ఇందులో భాగం కానుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో వచ్చి అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కల్పించేందుకు ఒబామా సర్కారు డీఏసీఏను తీసుకొచ్చింది. ప్రస్తుతం దీని కింద లబ్ధి పొందుతున్న 7 లక్షల మందికి పౌరసత్వం కల్పించడానికి త్వరలో తాను తీసుకురానున్న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ బాటలు వేస్తుందని, డ్రీమర్ల కల నెరవేరుస్తుందని ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వెల్లడించారు. ఆ ఆర్డర్‌ ద్వారా తాను సంతకం చేయబోయే ఇమ్మిగ్రేషన్‌ బిల్లు.. వలస సంస్కరణలకు సంబంధించి అతి పెద్దదని, అందరినీ సంతృప్తి పరిచే మంచి బిల్లు అని ఆయన చెప్పుకొచ్చారు. 


ఎగ్జిక్యూటివ్‌ ఆర్డరే ఎందుకు?

వాస్తవానికి వలస విధానంలో ఏ సంస్కరణలు చేపట్టినా చట్టసభల ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్‌  అందుకు భిన్నంగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ వైపు మొగ్గు చూపడానికి గత అనుభవాలే కారణం. బిల్లు రూపంలో వలస సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆయన పలు ప్రయత్నాలు చేశారు. ఉభయసభలపై రిపబ్లికన్లకు పట్టు ఉన్న సమయంలోనూ అవన్నీ బెడిసి కొట్టాయి. డీఏసీఏను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న ట్రంప్‌ దాని రద్దు కోసం బిల్లు తెచ్చినా.. ఆ దేశ సుప్రీంకోర్టు అడ్డుకుంది. డీఏసీఏ ఉపసంహరణకు అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ ఇటీవల తీర్పు వెలువరించింది. పదవీకాలం ఐదు నెలలే మిగిలి ఉన్నందున మరో బిల్లు తీసుకొచ్చినా ఫలితం ఉండదు. అందుకే వలస విధానంలో భారీ సంస్కరణలకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా ఆమోదం తెలపనున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. తద్వారా ప్రతిభ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియకు తెరతీస్తున్నారు. ఇందులో భాగంగా.. విద్య, అనుభవం, వయసు, ఆంగ్లభాషలో ప్రావీణ్యం, ఇతర అంశాల వారీగా పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్లను ప్రాతిపదికగా చేసుకుని వీసాలు జారీ చేస్తారు. అయితే డీఏసీఏ లబ్ధిదారులను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో చేర్చరాదని ట్రంప్‌ యంత్రాంగానికి రిపబ్లికన్‌ సెనెటర్‌ టెడ్‌ క్రూజ్‌ సూచించారు. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా పౌరసత్వం కల్పించే అధికారం అధ్యక్షుడికి ఎంత మాత్రం లేదని ట్వీట్‌ చేశారు. 


పన్ను రాయితీలను రద్దు చేస్తా

యూనివర్సిటీలకు ట్రంప్‌ హెచ్చరిక

కరోనా నేపథ్యంలో వర్సిటీలు పూర్తిగా ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే.. విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. మరో అడుగు ముందుకేశారు. వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ కాలేజీలు, స్కూళ్లను తెరిపించేందుకు బెదిరింపుల అస్త్రం ప్రయోగించారు. కాలేజీలు, స్కూళ్లు పొందుతున్న ప్రభుత్వ రాయితీలను సమీక్షిస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలను పాటించకుంటే పన్ను రాయితీలు రద్దు చేయాలంటూ ఆదేశాలిచ్చానని ట్రంప్‌ చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement