అమెరికాలో చట్టసభలో కొత్త బిల్లు.. డాలర్ డ్రీమ్స్‌పై నీళ్లు.. ?

ABN , First Publish Date - 2021-12-14T03:16:00+05:30 IST

‘అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే’ అన్న వాదనకు ఇటీవల అగ్రరాజ్యంలో మద్దతు పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే అక్కడి ప్రజాప్రతినిధులు అమెరికా చట్టసభల్లో అమెరికన్లకు ప్రయోజనం కలిగించే పలు కొత్త ముసాయిదా చట్టాలను ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చిందే..

అమెరికాలో చట్టసభలో కొత్త బిల్లు..  డాలర్ డ్రీమ్స్‌పై నీళ్లు.. ?

ఇంటర్నెట్ డెస్క్: ‘అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే’ అన్న వాదనకు ఇటీవల అగ్రరాజ్యంలో మద్దతు పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే అక్కడి ప్రజాప్రతినిధులు అమెరికా చట్టసభల్లో అమెరికన్లకు ప్రయోజనం కలిగించే పలు కొత్త ముసాయిదా చట్టాలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చిందే.. ‘అమెరికన్ టెక్ వర్క్‌ఫోర్స్ యాక్ట్’ ముసాయిదా బిల్లు. అమెరికా కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందన్న విశ్లేషణలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ బ్యాంక్స్ ప్రవేశపెట్టారు. 


ఏమిటీ మూసాయిదా చట్టం..?

అమెరికాలో స్థిరపడాలంటే ముందుగా లక్షలు ఖర్చు పెట్టి స్టూడెంట్ వీసాపై అక్కడ చదువుకోవాలి. ఆ తరువాత..విద్యార్థులకు తమ వృత్తిలో అనుభవం సంపాదించేందుకు ఉపకరించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ ద్వారా ఏదోక అమెరికన్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలి. ఇక.. ఓపీటీ పూర్తయ్యేలోపు హెచ్-1బీ సంపాదించగలిగితే.. డాలర్ డ్రీమ్స్ నిజం చేసుకున్నట్టే! హెచ్-1బీ వీసా పెండింగ్‌లో ఉన్న పక్షంలో స్టూడెంట్ వీసాను మరికొంత కాలం పొడిగించే అవకాశం కూడా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓపీటీ, హెచ్-1బీ వీసాలు భారతీయులకు ఎంతో కీలకమైనవి. అయితే.. ప్రస్తుత అమెరికన్ టెక్ వర్క్‌ఫోర్స్ యాక్ట్ ఈ రెండు అంశాల్లో మార్పులను ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే భారతీయులకు ఇబ్బందులు ఉంటాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 


హెచ్-1బీ వీసాదారులకు ఇచ్చే వేతనాల్లో మార్పులు చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం.. ఓ ఉద్యోగాన్ని హెచ్-1బీ వీసాదారుడికి ఇవ్వాలనుకుంటే..అంతకమునుపు అదే స్థానంలో పని చేసిన అమెరికన్‌కు ఇచ్చిన వేతనం కంటే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా.. హెచ్-1బీ వీసాదారుడి కనీస వార్షిక వేతంగా 110,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన భారతీయ కంపెనీలకు తలకు మించిన భారంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా.. థర్డ్ పార్టీ కంపెనీలు స్పాన్సర్ చేసే హెచ్-1బీ వీసా కాలాన్ని ఏడాదికే పరిమితం చేయాలనే ప్రతిపాదన కూడా ఇబ్బందులు కలిగించనుంది.  ఈ ప్రతిపాదన వల్ల వీసా పునరుద్ధరణ ఖర్చులు తడిసి మోపెడై..కంపెనీలు ఈ వీసా స్పాన్సర్ చేసేందుకు ముందుకు రాకపోవచ్చనేది నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అంతిమంగా ఇది డాలర్ డ్రీమ్స్‌కు బ్రేకులు వేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్, యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్ సంస్థలన్నీ హెచ్-1బీ వీసా సౌలభ్యాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. 


ఇక ఓపీటీ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలనేది భారతీయులకు ఆందోళన కలిగించే మరో ఆంశం. అమెరికా చదువులపై భారతీయులు లక్షలు ఖర్చు చేసేందుకు ఓపీటీ సౌలభ్యం ఓ ప్రధాన కారణం. దీంతో.. ఓపీటీ తొలగింపు ప్రతిపాదన కూడా పెద్ద చర్చకే దారితీస్తోంది. అయితే.. ఇటువంటి నిబంధనలు రూపొందిస్తే భారతీయులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోయే ప్రమాదం ఉందని కూడా పరిశీలకులు చెబుతున్నారు. ఇది అంతిమంగా అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది. ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందితే.. ఎగువ సభ సెనెట్‌‌కు చేరుతుంది. సెనెట్ కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తేనే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అయితే.. ఈ పరిస్థితి.. భారతీయుల డాలర్ డ్రీమ్స్ ఏమౌతాయనే చర్చకు దారి తీస్తోంది.  

Updated Date - 2021-12-14T03:16:00+05:30 IST